-->

Wednesday, January 22, 2025

#talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #పెళ్ళి_హైకూలు #తలతోటిపృథ్విరాజ్_హైకూలు

శ్రీశ్రీ గారు చెప్పినట్లు కాదేదీ కవితకనర్హం అన్నట్లు... హైకూ కవితా వస్తువులలో రుతువులు, ప్రకృతి, దేశ సంస్కృతి- సంప్రదాయాలు, మానవ ఉద్వేగాలు ఇవన్నీ. పెళ్ళిపై నేను రాసిన ఈ హైకూలు మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తూ.... డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ 
(1)
ఓ చీమల్లారా!
జీలకర్ర- బెల్లం పసిగట్టి 
దారికట్టకండి!

(2)
శీతాకాల పెళ్లి ముహుర్తం.
మంగళవాద్య సంగీతం 
కొంకర్లు పోతుంది 

(3)
ఆకాశంలో కాంతిపూలు
విరబూస్తూ మాయమౌతున్నాయి:
బాణసంచా   

(4)
అర్థరాత్రి పెళ్లి ముహుర్తం:
ఇళ్ళల్లోని గురకరాయుళ్ళనుసైతం
కలవరపెట్టే బాణసంచా!

(5)
లక్షల కట్నం తీసుకునికూడా 
గొడవపడుతున్నాడు వరుడితండ్రి-
పురోహితుడి సంభావనలో...

(6)
తెల్లారి పెళ్లి ముహుర్తం:
బంధు మిత్రులు కుర్చీలలో 
కునికిపాట్లు

(7)
పెళ్ళి పందిరిలో బుద్దిగా
పరీక్షలకు కూర్చున్నట్లు ఓ విద్యార్థి:
చదివింపులు

(8)
అమ్మాయితండ్రి పెళ్ళికి
చేసిన అప్పులు ఇంకా తీరకముందే -
పాపం... విడాకులు!

(9)
పూలతో అలంకరించిన
పెళ్ళి మండపం పరిమళిస్తోంది:
జీవితం పూదోట 

(10)
మబ్బులాకాశంలో అరుంధతి నక్షత్రం 
కనిపిస్తున్నట్లు చూపే పురోహితుడు, 
చూసినట్లే నూత్న వధూవరులు!

(11)
పెళ్ళి విందు ప్రారంభం.
మెల్లిగాపోగైన వీథికుక్కలు
కాట్లాట ప్రారంభించాయి

(12)
జంట ఈడూ జోడు కంటే 
పెళ్ళి విందుభోజనం గూర్చి 
మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

No comments:

Post a Comment