-->

Sunday, December 26, 2021

ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల-బోయి భీమన్న గీతం

ఏ గాలి వడి రాలి

 ఏ ధూళి దోగినదో

ఏ కబరి ముడి సడలి ఏ దారి జారినదో

 

ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల

 

ఏ రమణి మకుట లీలా మంజరీ చ్యుతము

ఏయసంకృత కుంతలా యదాతధ కృతము

ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల

 

మధుమాస మాధురులు  మాసి పోయే దారి

ఆదుకున్నా ఎదకు ఆనందమిడు నోయి

ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల

Friday, December 10, 2021

రావిశాస్త్రి "న్యాయం" కథ ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

రావిశాస్త్రి గారి "న్యాయం" కథ

రావిశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆరుసారా కథలు లోని "మాయ"అనే కథను గత వీడియోలో విశ్లేషించాను. నవంబర్ పదో తారీఖున రావిశాస్త్రి గారి వారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడు "న్యాయం" అనే వారి కథను ఈ వీడియోలో విశ్లేషించనున్నాను. 

 

రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి )గారు వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా కథకులు . వృత్తిలో భాగంగా ఎన్నో యదార్థ సంఘటనలను, అన్యాయాలను కోర్టు ఆవరణలో చూసిన వాడిగా, న్యాయం కోసం తన వద్దకు వచ్చిన వారు  తమ గోడును వెళ్లబోసుకోగా విన్నవాడిగా రావి శాస్త్రి గారు వాటిని కథలుగా మలచి మనకు అందించారని చెప్పకోవచ్చు. "న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు అని శ్రీశ్రీ గారి మాటలు గుర్తుకు తెచ్చే కథ.  

 

వన్ లైన్ స్టోరీ: ఒక స్త్రీ ఒక గేలం వంట సారా కలిగి ఉండగా మదరాసు ప్రొహిబిషన్ ఆక్టు సెక్షన్ 4 (1) ఎ ప్రకారం పోలీసులచే కేసు పెట్టబడినట్లు విచారింపబడుతుంది. నేరం చెయ్యలేదు;కాని కేసు ఒప్పుకుంటున్నాననే ముద్దాయి స్త్రీ మాటలకు న్యాయమూర్తి ఏమి తీర్పు చెప్పాలో పాలుపోని పరిస్థితుల్లో , కేసులను లోతుగా విచారించి తీర్పు చెప్పే సమయం లేని ఈ న్యాయవ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, ఆమెపై పాతకేసులు మరో మూడు ఉన్నాయని పోలీసులు చెప్పిన కారణంగా న్యాయమూర్తి ఆ స్త్రీ ముద్దాయికి నాలుగు కేసులకు కలిపి "ఒక నెల  " జైలు శిక్ష విధించిన కథ.  

 

వివరంగా కథ : పాతికేళ్ల వయసుగల ఒక యువతీ, కొందరు పోలీసులు, న్యాయవాదులు ఉండగా న్యాయమూర్తి తన కూర్చీలో ఏదో ఆలోచనలో ఉన్నవాడిలా కూచుంటాడు.  పోలీసులు నీపై పెట్టిన నేరాన్ని ఒప్పుకుంటున్నావా అని జడ్జి ఆ యువతిని ప్రశ్నిస్తాడు. కేసు ఒప్పేసుకుంటాను కానీ నేను నేరం చెయ్యలేవు అని ఆమె సమాధానానికి జడ్జి నిర్ఘాంతపోతాడు. "నా దగ్గర సారా దొరక లేదండీ! తాగేనని పట్టుకున్నారు" అని ఆ యువతీ సమాధానానికి జడ్జి నిర్ఘాంత పోతాడు. "ఆడది తాగడమేమిటి " అన్నట్లు జడ్జి అసహ్యపడతాడు.  ఈ స్థితిలో పోలీసులు కోర్టువారికి వాస్తవాన్ని చెప్పాల్సిన  పరిస్థితి ఏర్పడి అమెరికన్ షిప్ లో వచ్చినవారు జల్సాచేసి వారు తాగడమేగాకుండా ఈ యువతితో తాగించేసి పోయినట్లు చెబుతారు. అందరు తనను అసహ్యంగా చూడడాన్ని, పోలీసులు తనని దూషించడాన్ని బట్టి తన గతాన్ని ఆ యువతి తలబోసుకొని కోర్టులో ఏడుస్తుంది.  'నేరం చెయ్యలేదు. కేసు ఒప్పేసుకుంటానుఅనే ఆ యువతీ మాటలకు జడ్జిగారికి ఏంచెయ్యాలో పాలుపోలేదు. ముద్దాయిల గోడంతా విని తీర్పు చెప్పాలంటే ఈ దేశ కోర్టుల్లో మూలుగుతున్న కేసును బట్టి అది సాధ్యమయ్యే పని కాదని ఒకపెద్దమనిషి చెప్పిన సలహా గుర్తుకొచ్చి జడ్జి ఆమెకు ప్రథమ తప్పుక్రింద వదిలేస్తాను అనగా పోలీసులు ఈవిడ పై పాతకేసులు మరో మూడున్నాయి అనగా మొత్తం నాలుగు కేసులకు గాను జడ్జి నెలపాటు శిక్ష విధించడంతో కథ ముగుస్తుంది. 

 

 రచన విధానం:

 

కథకుని కవితాత్మక వర్ణన:        రచయిత మొదట కోర్టు యొక్క ఆవరణ వర్ణించే టువంటి వర్ణించడంతో కథ ప్రారంభిస్తారు.  కోర్టులో సంత గోల...అబద్ధాలకి పాముల పుట్ట..., బందిల దొడ్డికి రాచబాట అన్నట్లుగా కోర్టుని రావిశాస్త్రి గారు  వర్ణిస్తూ అంతేకాదు; కోర్టులో అనాథుల ఆక్రందన, అక్కడ అసహాయుల ఆర్తనాదం, అక్కడ పేదల కన్నీటి జాలు కూడా ఉంటాయని కూడా రాయాలని ఉందన్నట్లు రావిశాస్త్రి రాస్తారు. 

 

 

మానవ ప్రవర్తన : కథకుడు పాత్రలతో కథను నడిపించడమే కాదు; కథా సన్నివేశాలను, సంఘటనలను తానూ చూసినట్లే... పాఠకుడూ చూస్తున్నట్లు అనుభూతి చెందేలాగా అక్కడక్కడా రాసే విధానం మనం కథా రచనా శైలిలో గమనించవచ్చు.  సందర్భానుసారంగా కథలో కథకుడు తన అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు.కథను నడిపించడంలో కథకుడు పాఠకుడి కళ్ళకు కట్టెలా వర్ణించడం, మానవ జీవితంలోని స్వభావాన్ని సన్నివేశాలనూ ఉపమానాత్మకంగా చెప్పడం గమనించవచ్చు.

(1) యువకుడైన మేజిస్ట్రేట్ ఆలోచిస్తూ తన కుర్చీలో కూర్చునే విధానాన్ని వర్ణిస్తూ ""అతనేదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని బయల్దేరేడో ఆ సంగతి మధ్య దార్లో మర్చిపోయిన వాళ్ళా ఉన్నాడతను. వెళ్తూన్న దారి సరైన దారేనా అని అనుమానం తగిలినవాళ్ళా ఉన్నాడతను."   

 

బెంచీకి ఎదురుగా నాలుగైదునల్ల కోట్లు ధరించి కూర్చున్న లాయర్లు . అయిదారు ఎర్రటోపీలు ధరించిన పోలీసులు" అని రొటీన్ గా రాయకుండా .... "బెంచీకి ఎదురుగా నాలుగైదు నల్ల కోట్లు కూర్చున్నాయి. అయిదారు ఎర్రటోపీలు నిల్చున్నాయి."

 

సామూహిక వ్యభిచారానికి గురిఅయిన ముద్దాయి యువతిని కథకుడు ఇలా వర్ణించారు:

" ఆమె ముఖంలో కళాకాంతుల్లేవు, మూడో తరగతి రైలు పెట్టెలో ఓ మూల నలిగిపడి వాడిపోయిన పువ్వులదండలా వుందామె."

 

" రోడ్డువార నల్ల కుక్క జూలులా ఆమె జుట్టంతా రేగిపోయింది."

 

కొందరి న్యాయమూర్తులగూర్చి కొందరి న్యాయవాదుల అభిప్రాయాలు కథకుని ద్వారా :

మేజిస్ట్రేటుగారు నెల్లాళ్ళయి ఉద్యోగంలో ప్రవేశించారు. ప్లీడర్లంతా ఆయనను గురించి 'చాదస్తం ముండాకొడుకు' అని తీర్పు చెప్పేరు. ఆయన గరించి 'పట్టువిడుపూలేదు. సర్దిపుచ్చుకోవడం తెలీదు, 'సత్యం సత్యం' అని తినేస్తున్నాడు. కల్పన కొంచెం అయినా లేని కేసు పృథ్విలోనే లేదు.

 

"నీ కోర్టులో నెలకి ఎన్ని కేసులు ? కనీసం అయిదు వందలు. కొండ కొండా చొప్పున అయిదువందల కొండలు తవ్వాలంటే తవ్వు. దానికినీకు శక్తుంటే ఉండవచ్చు. కాని టైముంటుందా ! ఆలోచించు" అన్నాడా పెద్ద మనిషి.

 

"....అసలు ఈ ప్రపంచమే భగవంతుడి పెద్ద కల్పన. అంతా మాయే అయినప్పుడు మాయలోంచి మాయగాక యింకేమిటొ స్తుంది? న్యాయంట, ధర్మంట, సత్యంట! "

 

--------------------------------

పోలీసుల కరుడుగట్టిన తత్వాన్ని, తప్పుడు కేసులను : సారా పట్టుకున్నట్టు, నీతులు, ఆరునెలలు శిక్షించాలని కోరుకోవడం, మూలాలను  నిర్మూలించకపోవడం , నియంత్రించక పోవడం .

 

 స్త్రీలపట్ల, వారి జీవితం పట్ల జాలి గుణం, మానవత్వం ప్రదర్శించక పోవడం:

వీళ్ళకి రాత్రిళ్ళు సిగ్గుండదుసార్ , పగలే ఈ సిగ్గంతాను" అన్నాడు ఇన స్పెక్టరు కోర్టువారివైపు తిరిగి. 

 

"దిక్కుమాలిన ముండల్ని యెవరు చేరతీస్తాడు. బాబూ ? మరింక పొట్ట పోషించుకుందికి ఈ పన్లు మానమంటే చస్తే మానరు వీళ్ళు. అది వీళ్ళ బతుకు. వాళ్ళని పట్టుకోవడం బతుకు మా బతుకు..ఏ బతుకు బతికే వాళ్ళు ఆ బతుకు బతకాలి కదా బాబుగారూ!" అన్నాడు హెడ్డు ఫిలసాఫికల్ గా....

 

" కేసుల్లోనే న్యాయంవుంటే ఈ పోలీసులం మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకు? ఈ కోర్టులన్నీ ఎందుకు" అని హెడ్డు

"శిశుపాలుడి పరిపాలన! తన్ని పరిపాలించాడు తెల్లబాబు " అని బ్రిటీషర్స్ పాలనను హెడ్డు సమర్థిస్తారు.

" తంతేకాని వీళ్ళు లొంగరు సార్ "

"ముద్దాయిమీద చెయ్యి వెయ్యడానికే పోలీసువాడు జంకితే ఇంకేం ప్రభుత్వం బాబుగారూ!""మనకి నిజంగా డిక్టేడరుండాలి సార్ " 

 ముద్దాయినుద్దేశించి హెడ్డు  : ".... యిదిగో యిలాటి వాళ్ళని కమ్చితోకొట్టాలి బాబుగారూ!"

"ఆర్నెల్లకి తక్కువ కాకుండా "శిక్షించాలని  కోరుకుంటాడు 

 

-----------------------------

మేజిస్ట్రేట్ తత్వం : తాగింది అని  విని ఆశ్చర్యపోయాడు.

కథలో పఠితలా లేదామె 

ఈ ఆడమనిషికూడా మనిషేకదా , అదీ మనలాటి మనిషేనా ,

సావధానంగా విని విచారించాలనుకుంటాడు.

పోలీసులు చెప్పే కంపెనీలను తీయించలేక పోవడాన్ని ప్రశ్నిస్తాడు.

ప్రథమ తప్పుగా క్షమించాలనుకుంటాడు. నాలుగు కేసులకు నెల శిక్ష విధిస్తాడు. 

 

 

"మరై తే, ఆ కంపెనీలు - మీరు చెప్పినవి అవన్నీ ఎందుకు ఎత్తించరూ?" అని అడిగేరు."ఎత్తించేస్తూనే వున్నాంసార్ ! ఎత్తించే స్తే వీళ్ళు రోడ్లు కాసేస్తున్నారు సార్ ! ఎంచెయ్యమంటారు? వీళ్ళతో మా కెంత పెరిబుల్ న్యూసెన్స్ గా వుందో తమరితో చెప్పాలంటే వారంరోజులు పడుతుంది. అంతన్యూ సెన్సుగా వుంది. కంపెనీలోంచి తన్ని తగిలేస్తే చేరదీసేవాడెవడూ కనిపించడు" అన్నాడు ఇన స్పెక్టరు .

 

---------------------------

ముద్దాయి పాత్ర:  మేజిస్ట్రేట్ అన్నట్లు  ఆడమనిషికూడా మనిషేకదా. ఆమెకు చేసిన పనికి సిగ్గు ఉంటుంది. గౌరవం లేని పనైనా చెయ్యాల్సిన పరిస్థితులు, దగా పడిన గతం ఉంటాయి.    

ఇదంతా జరుగుతున్నంత సేపూ ముద్దాయి కొంచెం కొంచెం బెక్కుతోందతేకాని 'బతుకు బతుక' నే మాట ఆరేడుసార్లు వినేసరికి ఆమె మెదడ్లో ఏ నరాలకి నిప్పంటుకుందోగాని, ఆమె ఒక్క పెట్టున ముందు కొచ్చి పెద్దగా ఉడుస్తూ కేకలు వేయడం మొదలు పెట్టింది.

 

"నా కొద్దుబాబూ నాకొద్దు" అంటూ ప్రారంభించింది. "నా కొద్దీ బతుకు. నన్ను చంపేయండి. కాని బాబూ నాకొద్దీ బతుకు. నేవింక దికకు లేనసలు, ఇంత నీచం బతుకు, హీనబతుకు నేబతకలేను. ఇంత కష్టపడి తెచ్చుకున్న కూడయినా తిందావంటే సయిస్తుందా! అన్నం తింటే వాంతులు కడుపునొప్పి, తల బాధ, లేకపోతే, మూర్ఛలు, రాత్రల్లా నిద్దర్లేదు, పగలో నిమిషఁ హాయి లేదు. వంట్లో నీరసం, వళ్ళంతా విషం. పగలంతా బాధ, రాత్రంతా బాధ. నిన్న రాత్రి మీరుచూళ్ళేదు. హెడ్డుబాబు చూసేడు. అడుగో ఆ బాబు; బాబూ! నీకు తెలుసు. ఎంత మందున్నారు? ఎలా వున్నారు. మరి తాక్కా చచ్చి పోమంటారా? చెప్పండి బాబూ చెప్పండి. చచ్చిపోమంటారా? చెప్పండి. చచ్చిపోతాను. చచ్చిపోతే, యెవడేడవాలి? మీ రేడుస్తారా! యెవరేడవాలి? తల్లా తండ్రా తోబుట్టువా ? ఎవరున్నారు? అందరూ వుంటే ఈ బతుకెందుకు బతకాలి? అందరూ వుంటే  మీ కడుపున పుట్టిన ఆడకూతుర్లందల్లాగానే నేనూ బతుకుదును. ఈ కుక్క బతు కెందుకు బతకాలి! చూడండి బాబూ చూడండి ! నాకు సిగ్గు లేదు. చూడండి మరేం సిగ్గుపడక చూడండి.

 

     ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఒక్క రాత్రికి అంతమంది ఇలా కరిసేసి, రక్కేసి, రక్తం తాగేసి, ప్రాణాలు తీసేస్తే నిన్న రాత్రి ఇందరు ప్లీడరు బాబులు, ఇందరు జవాను బాబులు, ఇందరు ధర్మప్రభువులు ఇంత మంది ఉన్నారు. నిన్న రాత్రి యేబాబొచ్చి అడ్డుకున్నాడు. చెప్పండి! యెవరొచ్చేరు? యెవరూ రాలేదే? మరింక ఈ బతుకు నన్నింక బతకనివ్వక నన్ను చంపేయండి. మెడకి తాడేసి ఆ గుమ్మానికి వేశాడ దీసేయండి. మీ మడాలకింద పడేసి మన్ను కుమ్మేసినట్టు కుమ్మేసి మట్టిలో కలిపేయండి. రెండు కట్టెలుంటే చాలు గుప్పెడు బుగ్గయిపోతాను. గుప్పెడు బుగ్గి చేయిస్సీ గాలి కెగరేసే యండి. కత్తితో పొడిచేయండి." సముద్రంలోకి తోసేయండి నన్ను             చంపేయండి చంపేయండి."అంటూ మేజిస్ట్రేటుగారి వైపు పరిగెట్టిందామె.

పెమ్మయ సింగధీమణి శతకము-జక్కన

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, చాల వి

స్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సద

భ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్,

గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

--- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి