-->

Friday, July 7, 2023

శ్రీ కొణతం నాగేశ్వరరావు "గీతరచనా దీపిక" గ్రంథ సమీక్ష : డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

     శ్రీ కొణతం నాగేశ్వరరావు వ్రాసిన "గీతరచనా దీపిక" పరిశోధన గ్రంథం. మంచి కృషి. పాట రాయడానికి సంగీతం, లయ, సమతా, తూగు వంటి విషయాల కంటే ఛందస్సుండటం ప్రతిపాదించి ఇందులోని చందస్సును వింగడించడం చూస్తే ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి, ఇది గొప్ప కృషి. ఇది మంచి పరిశోధనాత్మకమైన రచన. ఈ కృషి ఉన్నత విశ్వవిద్యాలయాలలో జరగవలసిన కృషి. దీన్ని ఇంత బాగా రూపొందించిన ఈ పరిశోధకుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అని తన ముందు మాటలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అంటారు. అంతేకాదు ... ఛందో ఆధారంగానే పాటలు రాయబడతాయనప్పుడు జానఫదులపాటల్లో ఛందస్సుందరంగా ఉండడానికి గల కారణాన్ని చెప్పాలని ఇనాక్ అభిప్రాయపడ్డారు.

     ఎనిమిది ఆధ్యాయాలు విభజించుకుని వివరించిన తన పరిశోధనాత్మక రచనలో గేయ ప్రక్రియ పుట్టుక, నిర్వచనం, ప్రయోజనం, విభిన్న గీతాలను వివరించి, సాకి, పల్లవి, అనుపల్లవి, చరణాలు గూర్చి తెలిపారు. పాట రచనకు ఉపయోగించే అక్షర చ్ఛందస్సు, మాత్రా ఛందస్సు, పాదసౌష్ఠవం, లయ, యతి, ప్రాసలు గూర్చి వివరించారు‌‌.  గాన యోగ్యతకు ఉపకరించే రగడలు, జాతులు, ఉప జాతులు, వివిధ వృత్తాలు పేర్కొన్నారు. అన్నమయ్య, త్యాగయ్య సంకీర్తనలనే గాక, వివిధ కవులు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను, లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, సినీ గీతాలను ఉదాహరణకు తీసుకుని విశ్లేషించారు.

     పాటలు రాయాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడే, అవగాహన కలిగించే పరిశోధనాత్మక రచన ఇది.కొణతం నాగేశ్వరరావు గారు రంగస్థల నటులు. 2010 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 2009 నుండి తెలుగు విద్యార్థుల పాఠ్యాంశాలను స్వియగానంతో ఆడియో సీడీలను తీసుకొచ్చారు. 'శతక సుధా స్రవంతి' సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించి కవి సమ్మేళనాలు,పద్యపోటీలు, ఏకపాత్రాభినయాలు నిర్వహించారు. "సాహితీ కళారత్న"గా పలు సన్మాన, సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. 

     వీరు కవిగా పరిశోధకునిగా  ప్రేమ విలాసం (ఖండ కావ్యం) 2017, ఆదివాక్యోదాహరణము (ఉదాహరణ కావ్యం) 2020, గీతరచనాదీపిక - (2023) గ్రంథాలు రచించారు.

"గీతరచనా దీపిక" రచించడంలో శ్రీ కొణతం నాగేశ్వరరావు గారి పరిశోధనాత్మక కృషికి నా అభినందనలు.

డెమ్మి సైజ్ లో, 122 పేజీలతో ఉన్న ఈ పుస్తకం వెల 120/-.రూపాయలు. కావాల్సినవారు ఈ అడ్రెస్ ద్వారా పొందవచ్చు. 


శ్రీ కొణతం నాగేశ్వరరావు
ఇంటి నెం.37-12-1817/20,
11వ వీధి, శివనాగరాజుకాలనీ,
(B.O.) రెడ్డిపాలెం, (S.O.) పెదకాకాని,
గుంటూరు-522509.
చరవాణి : 9985144963

No comments:

Post a Comment