"నువ్వే నా మధు పాత్ర ప్రియతమా నేనే నీ - దాహార్తి
నిన్నే నాలో నింపుకు ఉంటే అవుతావు నువు నా అభ్యర్థి
నన్ను తాగేది నువ్వయితే మరి నిన్ను తాగేది నేనె కదా
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
ప్రేయసీ ప్రియులు ఒక మధుశాల. నిత్యం ఒకరికినొకరు మధువనే ప్రేమను సేవిస్తూ జీవితం సాగిస్తారు. ప్రేయసి మధుపాత్ర అయితే ప్రియుడు దాహార్తి.
"మధుశాల" కవితా సంపుటి లోతైన తాత్విక చింతన. అమితాబచ్చన్ తండ్రిగారైన డాక్టర్ హరివంశ రాయ్ బచ్చన్ హిందీలో రాయగా, డాక్టర్ దేవరాజు మహారాజు చే తెలుగులోకి అనువాదింపబడిన కవితా సంపుటే మధుశాల. మధుశాల కేవలం మధువుకే కాదు; ఒక ధ్యేయానికి, గమ్యానికి సంకేతం అంటాడు అనువాదకుడు మహారాజు.
"ఒక్కొక్కడుగూ వేస్తూ తీస్తూ ఎంత జీవితం నడిచాము
అయినా చాలా దూరం ఉందని దారి చూపు వారంటారు
సాహసముంటె వెనక్కి తిరగకు ధైర్యం ఉన్నా ముందుకు పోకు
కింకర్తవ్యమ్మని సంశయించు నను, దూరము నెట్టెను మధుశాల!"అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
"ఎరుపు వర్ణపు మదిరా ధారలు చూసి జ్వాలలని అనకండి
హృదయ జ్వాలల గాయం కాదు, మదిర మీది తెలి నురుగండి
విగత స్మృతి సాకీ అయితే, బాధే కద మధువున ఉన్న నిషా
రండి - బాధలో ఆనందం, పొందే వారిది మధుశాల"
అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
"మందిరమందున గంట కొట్టరు విగ్రహాలకి దండ వేయరు
మసీదుకు ఓ తాళం వేసి, మౌల్వీ గారు నిద్రపోదురు
రాజుల కోటలు బీటలు వారును గుల్లయి పోవును కోశాగారం
తాగు బోతులకు శుభం కలగనీ, తెరిచి ఉండనీ మధుశాల"
ఈలోకంలో ఏం నశించి కనుమరుగైనా... ప్రేమ మధువును గ్రోలేవారికి ప్రేయసి హృదయ మధుశాలలు తెరిచే ఉంటాయని హరివంశ రాయ్ బచ్చన్ అంటారు. శుభం కలగాలని కోరుకుంటాడు.
"ఏడ్చేవారు ఒక్కరు మిగలక పరివారాలు నాశనమగును
సుస్వరాల సిరి గల భవనాలు చప్పుడు లేక మూగబోవును
రాజ్యాలన్నీ తల కిందవును రాజుల భాగ్యం నిద్ర పోవును
అయినా, తాగే వారిని కూడగట్టును - తట్టి లేపును మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
అంటే ఈ లోకంలో ఏవి కళావిహీనమైనా, దూరమైనా నిత్యం మధువును ఆస్వాదించేవారితో నిత్యం సందడిగా ఉండేది మధుశాలే అంటాడు కవి.
"యుగయుగాలుగా జగమున మధువు, చెడుదని అందరు అంటారు
తాగేవాడు బుద్ది హీనుడు సాకీ హొయలు తుంటరివి
జగతికి మధువుకు జోడీ కుదరదు-దూరం పెరగదు
క్షీణించేది జగమైతే, నిత్యం రాణించేది మధుశాల"అంటాడు కవి హరివంశ రాయ్ బచ్చన్.
హిందీలో "హాలా"వాదాన్ని... అంటే "మధు" వాదాన్ని ప్రతిపాదించిన కవి రాయ్. హాలా అంటే మధువు. కానీ ఈ కవి దృష్టిలో మధువంటే మధువే కాదు; తన కావాల్సిన దాన్ని వెతుక్కోవడంలో మనిషి పొందే ఆనందమే "మధువ"ని రాయ్ భావం. ప్రేమకు, ఆధ్యాత్మికతకు, జీవన గమ్యానికి సంబంధించిన సంకేతం మధుశాల. ఉర్దూ కవులైన ఉమర్ ఖయ్యాం, గాలిబ్, జఫర్, మీర్, దాగ్ వంటి కవుల మాదిరిగానే మధువు, మధు పాత్ర, మధుశాల, సాకీ పదాలను ప్రయోగిస్తూనే సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ "మధుశాల"లో కవితలు అల్లారు. హరివంశ రాయ్ బచ్చన్ అధ్యాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యులు. తన తండ్రి 115వ జయంతి ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే అమితాబ్ బచ్చన్ తన తండ్రి మధుశాల కవితా సంపుటి ఆకృతిని రాతిబల్లగా పోలాండ్ లో తయారు చేయించి తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.
No comments:
Post a Comment