-->

Wednesday, February 9, 2011

నేటి తెలుగు పత్రికలు-సాహిత్య పోషణ


"తెలుగు భాషా-సాహిత్యం పత్రికా రచన" అనే అంశంపై ఆంధ్ర విశ్వ విద్యాలయం తెలుగు శాఖవారు
2011 ఫిబ్రవరి 9 ,10 తేదీలలో నిర్వహిస్తున్న సదస్సుకు 
"నేటి తెలుగు పత్రికలు-సాహిత్య పోషణ" 
అనే అంశంపై డా.తలతోటి పృథ్వి రాజ్ సమర్పించిన సెమినార్ పేపర్ 
...................................................................................................................................................................
ఎందరో కవుల,రచయితల సృజనాత్మక రచనలతో తెలుగు సాహిత్యం సుసంపన్నం కావడంలో కవుల పాత్రేకాదు...ఎన్నో పత్రికల సాహిత్య పోషణ కూడా ప్రధానమైన అంశం. ఒక కవి,రచయిత రచన వందలాదిమందికి,సమాజానికి,ప్రపంచానికి పరిచయం చేస్తూ  ప్రధాన భూమిక పోషించేవి పత్రికలే అని చెప్పక తప్పదు.ఇంకా చెప్పాలంటే ఒక కవి సాహిత్యం పుస్తక రూపంలో కంటే, ఒక పత్రికల ద్వారానే వేలాది,లక్షలాది మంది సాహిత్యాభిమానులకు చేరుతుంది. ఈ ఆధునిక కాలంలో ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న  పత్రికలు తెలుగు భాషలో కోకొల్లలు. అచ్చు యంత్రాలు వచ్చిన దగ్గరనుంచి పత్రికలు వహించే బాధ్యత క్రియశీలకమైనది. 

స్వాతంత్ర్యోద్యమ కాలంనుంచి పత్రికలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వివిధప్రాంతలకు సంబంధించిన సమాచారాలను తెలిపేవిగా మాత్రమేకాకుండా ,సాహిత్య సంబంధమైన అంశాలతో ప్రజల్ని చైతన్యపరిచే పాత్రను కూడా పోషించాయి పత్రికలు. స్వాతంత్ర్యానంతరం సాధించిన సాంకేతిక అభివృద్దిని బట్టి అనేక ప్రింటింగ్ ప్రెస్ లు వచ్చాక అనేక పత్రికలు ప్రాణం పోసుకున్నాయి. ఇలా ఆధునిక కాలంలో సాహిత్య పత్రికలు ఎన్నో ప్రారంభించ బడ్డాయి.

ప్రపంచంలో మొట్ట మొదటి పత్రికా ప్రచురణ 1805 లో స్ట్రాన్ బర్గ్ . మన దేశంలో పత్రికకు 1835 లో బొంబాయి నగరంలో శ్రీకారం చుట్టారు. 1780  లో బెంగాల్ గెజిట్ మొదటిదని అంటారు. 1862 లో సుజన రంజని తెలుగు వారి మొదటి పత్రిక అంటే తెలుగు భాషలో పత్రికలువచ్చి 150 సంవత్సరాలు.             

తెలుగు పత్రికలు - సాహిత్య పోషణ:
ఈ సాహిత్య పత్రికలు ఎందఱో కవుల,రచయితల రచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళే సమర్ధవంతమైన పనిచెయ్యడమే కాకుండా, అనేకమంది కొత్త కవులను ప్రోత్సహిస్తున్నాయి. ఎన్నో ప్రక్రియల్లో రచనలను ప్రచురించి సాహిత్య సేవ చేస్తున్నాయి.స్వాతంత్రోద్యమ కాలంలో భారతి,కృష్ణ పత్రికలు ప్రసిద్ధి. నేడు అనేక పత్రికలు సాహిత్య పరివ్యాప్తికి వాటివంతు కృషి చేస్తున్నాయి. రచనలను పంపిన కవులకు గుర్తింపునే కాదు, పారితోషకాన్ని కూడా అందించి ప్రోత్సహిస్తున్నాయి.

A) తెలుగు దిన పత్రికలు - సాహిత్య సేవ : 
తెలుగు దినపత్రికలు కేవలం వార్తలకు మాత్రమే ప్రధాన్యమివ్వకుండా వారానికి  ఒకరోజు ఒక పేజీని సాహిత్యానికి కేటాయిస్తూ సాహిత్యాభిమానులకు సాహిత్య విందును ఏర్పాటు చేస్తున్నాయి.

1. ఆంధ్రజ్యోతి దినపత్రిక - సాహితీ విశేషాలు:
ఇప్పుడొస్తున్న దినపత్రికలలోకెల్లా సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నది,మంచి రచనలను ప్రచురిస్తున్నది,ఒకప్పటి భారతి పత్రికను గుర్తు చేసేది ఆంధ్రజ్యోతి. ప్రతి సోమవారం "వివిధ"శీర్షికతో ఒక ప్రత్యేక పేజీని ఆంధ్రజ్యోతి సాహిత్యానికి కేటాయిస్తుంది.కవుల జయంతి వర్ధంతులను పురస్కరించుకొని వ్యాసాలు,వచన కవితలు,ఒక వ్యాసంలోని కొన్ని అంశాలను విభేదిస్తూ సాగిన చర్చ... ఇలా వివిధ సాహిత్య విశేషాలతో సాగుతుంది "వివిధ". తెలంగాణా కవులకు పెద్దపీట వేస్తున్నదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది.
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం:
సోమవారం దినపత్రికలోనే కాకుండా ఆదివారం దినపత్రికకు అనుబంధంగా వచ్చే సంచికలో కూడా సాహిత్యంశాలను ఆంధ్రజ్యోతి ప్రచురిస్తుంది. ఇందులో "ఈవారం కథ"శీర్షికతో కథని,"ఈవారం కవిత" శీర్షికతో కవితను,"కొత్త పుస్తకాలు"శీర్షికతో సంక్షిప్త పుస్తక సమీక్షలు సాహిత్యాంశాలుగా  ప్రచురింప బడుతున్నాయి. 

2. ఆంధ్రభూమి దినపత్రిక - సాహిత్య సేవ:
ఆంధ్రభూమి దినపత్రిక ప్రతి సోమవారం "సాహితీ"శీర్షికతో సాంప్రదాయ - ఆధునిక సాహిత్యాంశాలు ,విమర్శనాత్మక వ్యాసాలు,కవితలను ప్రచురిస్తుంది. ఇటీవల "భూమిక","నుడి","అక్షర"శీర్షికలతో కొన్ని ప్రత్యేక పేజీలను స్త్రీవాద,భాష,కథా సాహిత్య అంశాలకు సంబంధించి శని,అది,సోమవారాల పేజీలలో ప్రచురిస్తున్నారు.
ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం:
"కవిత"శీర్షికతో కవితలు,"ఈవారం కథ"శీర్షిక పేరుతో కథను ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం ప్రచురిస్తుంది.

3. ఆంధ్ర ప్రభ దినపత్రిక - సాహిత్య సేవ:
"సాహితీ గవాక్షం"పేరుతో ప్రతి సోమవారం ఆంధ్రప్రభ దినపత్రిక అనేక సాహిత్య వ్యాసాలను,కవితలను,మరెన్నో సాహిత్యంశాలను ప్రచురిస్తుంది.
ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం:
ఆదివారం అనుబంధంగా వచ్చే ఆంధ్రప్రభ సంచికలో "కథ"శీర్షికతో కథా సాహిత్యాన్ని,"కవిత"శీర్షికతో చక్కని కవితల్ని,"కొత్త పుస్తకాలు"శీర్షికతో సంక్షిప్త పుస్తక సమీక్షలనే కాకుండా "చిన్నారి"శీర్షికతో బాల సాహిత్యాన్ని కూడా ప్రచురిస్తూ సాహిత్య సేవచేస్తుంది ఆంధ్ర ప్రభ.

4. ప్రజా శక్తి దినపత్రిక - సాహిత్య సేవ:
"సవ్వడి"పేరుతో ప్రజా శక్తి దినపత్రిక ప్రతి సోమవారం సాహిత్య పేజీని ప్రచురిస్తూ వస్తుంది. ప్రజాశక్తి సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే ఉద్యమ సాహిత్యానికే అధిక ప్రధాన్యతనిస్తుంది.
ప్రజాశక్తి ఆదివారం అనుబంధం:
ప్రజాశక్తి ఆదివారం అనుబంధం "కవిత్వమ్"శీర్షికతో కవితలు,"కథ"శీర్షికతో కథను,"కొత్త పుస్తకాలు"శీర్షికతో సంక్షిప్త పుస్తక సమీక్షలు,"సీరియల్ "శీర్షికలతో నవలా సాహిత్యం సీరియల్స్ గా  ప్రచురింప బడుతుంది.       

5. వార్త దినపత్రిక - సాహిత్య సేవ: 
"కావ్య" అనే శీర్షికతో ప్రతి సోమవారం ప్రచురింపబడే వార్తలో విమర్శలు,వ్యాసాలూ,లేఖా సాహిత్యం మొదలగు అంశాలు ప్రచురింప బడుతున్నాయి. శుక్రవారం "గళం"పేరుతో మహిళల కవితలు ప్రచురింప బడుతున్నాయి.
వార్త ఆదివారం అనుబంధం:
వార్త ఆదివారం అనుబంధంలో "కథ" శీర్షికతో కథ ప్రచురింపబడుతుంది."ఈవారం కవిత్వం"శీర్షికతో కవిత్వం,"కృతి"శీర్షికతో సంక్షిప్త పుస్తక సమీక్షలు,"సింగిల్ పేజీ కథ"లో కథ,"అందాయి"శీర్షికతో సమీక్షకు అందిన పుస్తకాల వివరాలు,"సృష్టిలో"కళలు,సృజనాత్మక అంశాలపై వ్యాసాలు ప్రచురింప బడతాయి.

6. సాక్షి దినపత్రిక - సాహిత్య సేవ:
ప్రతి సోమవారం "సాహిత్యం"శీర్షికతో "సాక్షి"దినపత్రికలో సమీక్షలు,కవితలు,ప్రముఖుల సాహిత్యంపై వ్యాసాలూ,సంక్షిప్తంగా పుస్తక పరిచయాలు ప్రచురింప బడుతున్నాయి.
సాక్షి ఆదివారం అనుబంధం"ఫన్ డే ":
సాక్షి ఆదివారం అనుబంధమైన  ఫన్ డే సంచికలో "కథ","సింగిల్ పేజీ కథ" శీర్షికలతో కథా సాహిత్యం,మరియు పుస్తక సమీక్షలు,"వేమన్న వెలుగులు"శీర్షికతో డా.ఎన్.గోపిగారి వేమన పద్యాల విశ్లేషణలే కాకుండా,"చందమామ స్టొరీ","పిడుగు"మొదలగు శీర్షికలతో  బాల సాహిత్యం ప్రచురింప బడుతుంది.

7. సూర్య దినపత్రిక - సాహిత్య సేవ: 
"అక్షరం" శీర్షికతో సాహిత్య,సాంస్కృతిక వేదికగా "సూర్య" వ్యాసాలూ,కవితలు,"కొత్త పుస్తకం"శీర్షికతో సమీక్షకు అందిన పుస్తకాలను ప్రతి సోమవారం ప్రచురిస్తూ సాహిత్య సేవ చేస్తుంది.
సూర్య ఆదివారం అనుబంధం:
సూర్య ఆదివారం అనుబంధం సంచికలో "బాలసాహితీ శిల్పులు""చిన్నారి""బుడుగు" శీర్షికలతో బాలసాహిత్యాన్ని ఎక్కువగా ఆదరిస్తుంది. "ఈవారం కథ"శీర్షికతో కథని సూర్య ప్రచురిస్తుంది.

8. విశాలాంధ్ర దినపత్రిక - సాహిత్య సేవ:
"సాహిత్య అనుబంధం"శీర్షికతో ప్రతి సోమవారం సాహిత్యంశాలను విశాలాంధ్ర దినపత్రిక ప్రచురిస్తుంది.

9. నేటినిజం దినపత్రిక - సాహిత్య సేవ:
"సాహితీ కెరటాలు"శీర్షికతో ప్రతి గురువారం "నేటినిజం" అనే హైదరాబాద్ స్థానిక దినపత్రిక సాహిత్యానికి పెద్దపీట వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులకు సుపరిచితమైనది నేటినిజం. 

B) తెలుగు వార పత్రికలు - సాహిత్య సేవ : 
తెలుగు వార పత్రికలు కూడా సాహిత్యాంశాలకు ప్రాధాన్యతను ఇస్తూనే ఉన్నాయి. ఆంధ్రభూమి,(ఆంధ్ర జ్యోతి వారి)నవ్య,స్వాతి వారపత్రికలు సాహిత్యాంశాలతో సాహిత్యాభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా నవల,కథ,కవితా ప్రక్రియలు , పుస్తక సమీక్షలు మొదలుగున్నవి వారపత్రికలు ప్రచురిస్తున్నాయి.

C) తెలుగు మాస  పత్రికలు - సాహిత్య సేవ :
తెలుగు మాసపత్రికలను ప్రధానంగా నాలుగైదు రకాలుగా విభజించవచ్చు. 1).సామాజిక మాస పత్రికలు. 2 ).సాహిత్య మాస పత్రికలు ౩).ఆధ్యాత్మిక మాసపత్రికలు 4).కమ్యూనల్ మంత్లీ మ్యాగజైన్
అ).సామాజిక మాస పత్రికలు:
సామాజిక మాసపత్రికలుగా ఇండియా టుడే,ఆంధ్రప్రదేశ్,మల్లె తీగ,నది,అధినేత,తెలుగు విద్యార్ధి ,గ్రందాలయ సర్వస్వం  మొదలగు వాటిని చెప్పుకోవచ్చు. సామాజిక సమస్యలు,వర్తమాన రాజకీయ అంశాలతోపాటు కాస్త సాహిత్యాంశాలకు ఇలాంటి పత్రికల్లో చోటుంటుంది.
ఆ).సాహిత్య మాస పత్రికలు:
సాహిత్యం కోసమే పుట్టిన పత్రికలు ఈ సాహిత్య మాస పత్రికలు. సాహిత్యాభి వృద్దిలో ప్రధాన పాత్రను పోషించేవి ఈ సాహిత్య మాస పత్రికలే అని చెప్పుకోవచ్చు. ఇందులో కవిత్వం,వ్యాసం,కథా సాహిత్యం,పుస్తక సమీక్షలు,సాహిత్య సభలు,సాహితీ మూర్తులపై   ప్రత్యేక వ్యాసాలు ఇందులో ఉంటాయి.ఉదాహరణకు ఆయా సంపాదకుల ఆధ్వర్యంలో వచ్చే వివిధ మాసపత్రికలు కొన్ని పరిశీలించవచ్చు.
వాజ్ఞ్మయి - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
చైతన్య కవిత - సంపాదకులు సంగిరాల వెంకట సుబ్బా రావు, 
ప్రసన్న భారతి - సంపాదకులు: కొండేపూడి సుబ్బా రావు, 
సాహితీ కౌముది - సంపాదకులు: శిష్ట్లా వెంకట్రావు,  
భావ తరంగిణి  - సంపాదకులు: భవిష్య ,
స్రవంతి - దక్షిణ భారత హిందీ ప్రచార సభ,
సాహితీ కిరణం - సంపాదకులు: పొత్తూరి సుబ్బా రావు,
ఎక్స్ రే - సంపాదకులు: కొల్లూరి, 
రమ్య భారతి - సంపాదకులు: చలపాక ప్రకాష్, 
ప్రజా సాహితీ - సంపాదకులు: కొత్తపల్లి రవిబాబు, 
ప్రసారిక - సంపాదకులు: నమిలికొండ బాలకిషన్ రావు, 
మిసిమి - సంపాదకులు: అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, 
ముంబయి వన్ - సంపాదకులు: డా.ఎ.మంజుల రెడ్డి,
పాలపిట్ట - సంపాదకులు: గుడిపాటి,
సాహిత్య ప్రస్థానం - సంపాదకులు: తెలకపల్లి రవి,
పత్రిక - గౌ. సంపాదకులు: .శ్రీరమణ, 
నేటి నిజం - సంపాదకులు: బైసా దేవదాస్, 
నడుస్తున్న చరిత్ర - సంపాదకులు: సామల రమేష్ బాబు,
మూసి - సంపాదకులు: డా.సాగి కమలాకర శర్మ,
చినుకు - సంపాదకులు: నండూరి రాజగోపాల్,
విపుల,చతుర,రచన,ఆకాషిక్...ఇలా మొదలుగున్నవి.

ఇ). ఆధ్యాత్మిక మాసపత్రికలు:
ప్రాచీన సాహిత్యమంతా ఇతిహాస,పురాణ సంబంధమైనదే.కనుక ఆధ్యాత్మిక సాహిత్యం పురాణాలు,భారత,భాగవతాలకు సంబంధించిన రచనలు ఇందులో ఉంటున్నాయి. "సప్తగిరి" ఇలాంటి పత్రికకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ).కమ్యూనల్ మంత్లీ మ్యాగజైన్:
ఒక కులానికి సంబంధించిన పత్రికల్లోకూడా సాహిత్యంశాలు ప్రచురింప బడుతున్నాయి. ఈ విధంగా సాహిత్య పోషణను కమ్యూనల్ మంత్లీ మ్యాగజైన్  లు కూడా చేస్తున్నాయి. ఉదా: "వాసవీ స్రవంతి",వాసవీ ప్రభ","శాలివాహన" మొదలగు పత్రికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

D) సాహితీ సంస్థలు - సాహితీ ప్రచురణలు:  
రాష్ట్రంలోనే కాదు కాదు, వివిధ రాష్ట్రాలలో,విదేశాలలో  ఉన్న తెలుగు వారు, తెలుగు సాహిత్య సంస్థలు సావనీర్లను,వార్షిక పత్రికలను,ప్రత్యేక కవితా,కథా  సంపుటులను  ప్రచురిస్తూ సాహిత్య పోషణ చేస్తున్నాయి. ఉదా: గుడిమెట్ల చెన్నయ్య. ఆధ్వర్యంలో జనని (సాంస్కృతిక సమితి,మద్రాస్),స్పందన(రాయగడ) మొదలగునవి.కొన్ని సంస్థలు కథలు,కవితల పోటీలుకూడా నిర్వహిస్తూ  సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.

E) టీవీ చానల్స్ - సాహిత్య పోషణ:
ప్రముఖ  కవుల జయంతి వర్ధంతులను పురస్కరించుకొని చాల టీవీ చానల్స్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి.వీటిల్లో ప్రధానంగా ప్రస్తావించవలసింది ఈtv2. "తెలుగు వెలుగు"శీర్షికతో ప్రతి ఆదివారం ఉదయం చక్కని సాహిత్య కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. మిగతా ఛానల్స్  శ్రీశ్రీ,జాషువా,గురజాడ మొదలగు ప్రముఖ కవుల జయంతి-వర్ధంతులను పురస్కరించుకొని సాహిత్య కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు.

F) ఆన్ లైన్ పత్రికలు - సాహిత్య పోషణ:
నేటి ఇంటర్నెట్ యుగంలో తెలుగు సాహిత్యాన్ని అనేకులు వెబ్ సైట్ లుగా,బ్లాగులుగా , ఆన్ లైన్ పత్రికల రూపంలో పోషిస్తున్నారు. సాహిత్య సంపద పేరుతో ఈనాడు ఆన్ లైన్ పత్రిక సాహిత్య వ్యాసాలను పబ్లిష్ చేస్తుంది. వ్యక్తి గతమైన కవిత్వానికి సంబంధించిన బ్లాగ్ లు ఇంటర్ నెట్ లో చాలా  ఉన్నాయి.  
    
http://kavulu.blogspot.కం  మొదలుగున్నవి.

ఇలా ఎన్నో సాహిత్య పత్రికలు వివిధ మాధ్యమాలలో సాహిత్య సేవ చేస్తున్నాయి.రచనలను పంపిన రచయితలకు,కవులకు కొన్ని పత్రికలు పారితోషకాన్ని కూడా పంపిస్తూ నిజంగా సాహిత్యాన్ని పోషిస్తున్నాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.