-->

Sunday, August 16, 2026

శ్రీనాథుడు_కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి_చాటువు_స్వరకల్పన: డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

 వీడియో లింక్ :

https://youtube.com/shorts/VrB1qSsm47E?si=k7Tp9hcI0mN2B4d0

సీ|| కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి

     రత్నాంబరంబు లే రాయ డిచ్చు?

రంభగూడె తెనుంగు రాయ రాహుత్తుండు

     కస్తూరి కే రాజు ప్రస్తుతింతు?

స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ

     పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?

కైలాసగిరి పండె మైలార విభుడేగె

     దినవెచ్చ మే రాజు తీర్పగలడు?


తే|| భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె

కలియుగంబున నిక నుండ కష్టమనుచు

దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

అరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి!


సందర్భం:

శ్రీనాథుడికి ఆశ్రయం ఇస్తూ, కళలను పోషిస్తూ వచ్చిన మహానుభావులు ఒక్కొక్కరుగా కాలధర్మం చెందారు. తనకు ఎంతో ఆదరాభిమానాలు అందించిన వీరారెడ్డి, విస్సనమంత్రి, మైలార విభుడు వంటి సంపన్నులు, ప్రభువులు మరణించడంతో శ్రీనాథుడు దిక్కులేని వాడయ్యాడు. ఆదరించే నాథుడు లేని ఈ కలియుగంలో తాను కూడా ఇక బ్రతకడం కష్టమని భావించి, తాను కూడా త్వరలో పరమపదిస్తానని తెలుపుతూ, తన అంతిమ దశలో ఈ పద్యం ఆవేదనతో ఆశువుగా చెప్పారు.


ప్రతిపదార్థం:

కాశికా విశ్వేశున్: కాశీ విశ్వేశ్వరుని,

కలిసెన్: చేరుకున్నాడు (మరణించాడు),

వీరారెడ్డి: వీరారెడ్డి (కానీ), 

రత్నాంబరంబులు: రత్నాలతో కూడిన అమూల్యమైన వస్త్రాలను,

ఏ రాయడు: ఏ రాజు,

ఇచ్చున్: ఇస్తాడు?

రంభన్: రంభను (అప్సరసను),

గూడెన్: కూడియున్నాడు, 

తెనుంగు రాయ రాహుత్తుండు: ఆంధ్ర రాజులలో శూరుడైన ఆ వీరారెడ్డి,

కస్తూరిన్: కస్తూరి సుగంధాన్ని, 

ఏ రాజు: ఏ రాజును బట్టి,

ప్రస్తుతింతున్: కొనియాడగలను?

స్వర్గస్థుడయ్యెన్: స్వర్గానికి వెళ్ళిపోయాడు,

విస్సనమంత్రి: విస్సనమంత్రి (ఆయన మరణించగా),

మఱి: ఇక

హేమ పాత్ర అన్నము: బంగారు పళ్లెంలో అమృతప్రాయమైన భోజనాన్ని, 

ఎవ్వని పంక్తి గలదు: ఇక ఏ రాజు గారి భోజన పంక్తిలో పెట్టగలరు?

కైలాసగిరి పండెన్: కైలాస పర్వతానికి వెళ్ళాడు, 

మైలార విభుడు ఏగి: మైలార భూపాలుడు స్వర్గానికి వెళ్ళిపోగా

దినవెచ్చమున్: రోజువారీ ఖర్చులను లేదా భోజన సదుపాయాలను, 

ఏ రాజు: ఏ ప్రభువు, 

తీర్పగలడు: తీర్పగలడు?

భాస్కరుడు:  ప్రసిద్ధ కవి భాస్కరుడు,

మున్నె: ముందే, 

దేవుని పాలికిన్: దేవుని వద్దకు, 

ఇరిగెన్: వెళ్ళాడు;

కలియుగంబునన్: ఈ కలియుగంలో, 

ఇక నుండన్: ఇక ఉండటం,

కష్టము+అనుచున్: చాలా కష్టమని భావించి,

దివిజ కవివరు గుండియల్: దేవలోకంలోని శ్రేష్ఠులైన కవుల గుండెలు,

దిగ్గురనగన్: అదిరిపోయేలా (భయంతో లేదా ఆశ్చర్యంతో),

శ్రీనాథుడు: మహాకవి శ్రీనాథుడు, 

అమరపురికి: అమరపురికి (యమలోకానికి/స్వర్గానికి), అరుగుచున్నాడు: వెళ్తున్నాడు!


భావం:

కాశీ విశ్వేశ్వరుని చేరుకున్న వీరారెడ్డి లేకపోయిన తర్వాత నాకు రత్నాంబరాలు ఏ రాజు ఇస్తాడు? రంభను కూడిన ఆ తెనుగు రాయ రాహుత్తుడు పోయిన తర్వాత ఇక కస్తూరితో సత్కరించే ఏ రాజును మేము కీర్తించగలం? స్వర్గస్థుడైన విస్సనమంత్రి లేకపోయిన తర్వాత బంగారు పళ్లెంలో రుచికరమైన భోజనం ఎవరి పంక్తిలో దొరుకుతుంది? కైలాసగిరికి వెళ్ళిన మైలార విభుడు లేకపోతే నా దినవెచ్చాలు (రోజూవారీ ఖర్చులు) ఏ రాజు తీర్చగలడు?

కవి భాస్కరుడు ముందే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ కలియుగంలో ఇక బ్రతికి ఉండటం కష్టమని భావించి, దేవలోకపు కవివరుల గుండెలు అదిరిపోయేలా మహాకవి శ్రీనాథుడు అమరపురికి (మరణం వైపు) బయలుదేరుతున్నాడు!

 ~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్

No comments:

Post a Comment