-->

Tuesday, July 13, 2021

గోడమీద పిల్లులు : రచన, స్వరకల్పన, గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్

 #GodamedaPilli #Song #TalathotiPrithviRaj

  నా పాట సామాజిక ప్రయోజనం! దేశ వర్తమాన, సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నేను పాటలు రాస్తూ, స్వరపరుస్తూ, ఆలపిస్తున్న  విషయం మిత్రులైన మీరు గమనిస్తూనే ఉంటారు. నేను గొప్ప గాయకుడ్నేమీ కాదు. పాడే విధానం కూని రాగాలే గానీ, ఖూనీ రాగాలు కాదని నా నమ్మకం. అందుకే ఈ ప్రయత్నం. ఈ విషయాలలో సలహా ఇస్తే స్వీకరిస్తాను. ఇక విషయానికొస్తే ......

           "గోడమీద పిల్లి" అంటుంటారు. షార్ట్ కట్ లో "గోపి" అనికూడా అంటారు. ఒకరి వ్యక్తిత్వం మంచిదైనా, చెడ్డదైనా ఎవరూ ఆక్షేపించరు! ఎందుకంటే ఎవరి జీవితం వారిది! ఎవరి అభిప్రాయాలు వారివి! దీన్ని అందరూ గౌరవించాల్సిందే! కానీ.....పరిస్థితులను బట్టి "అవకాశ వాదం"తో కొందరు వారికి ఎటు ప్రయోజనం ఉంటే అటు... వాళ్ళకు ఎటు మేలు కలుగుతుంది అనుకుంటే అటు ఠక్కున మారిపోగల, నాలుకను మడిచేయగల, అమాంతంగా ఆవైపుకు దూకేయగల సమర్ధులు. నాలాంటి వాడికి నచ్చని విషయం ఇదే! వ్యక్తిత్వం ఇటువంటి వారికి పీతిగుడ్డతో సమానం. ఇంకా చెప్పాలంటే వారి వ్యవహార శైలే గొప్ప వ్యక్తిత్వం గా భావిస్తారు! తాము అనుకున్న వైపు దూకగల అవకాశం వీరి సొంతం! అందుకే "గోడ మీద పిల్లి వాటం" అని కూడా అంటుంటారు! ఊసరవెల్లిలా రంగులు మార్చే ఈ తరహా వ్యక్తుల తత్వం! అపరిచితుడ్లా వారి స్వార్ధ ప్రయోజనాలపై స్పందిస్తుంటారు. మన పక్కింటోడు కావచ్చు..‌., మన బంధువులు కావచ్చు... లేదా మన కొలీగ్స్ కావచ్చు లేదా మన స్నేహితులే కావచ్చు! ఇవి ఒక తరహా పిల్లులు! ఇక రెండో తరహా గోడ మీద పిల్లులు రాజకీయాల్లో ఉంటాయి! మొదటి తరహా పిల్లులకు వ్యక్తిత్వంతో పనిలేకుంటే; ఈ రెండవ తరహా పిల్లులకు వ్యక్తిత్వంతో పాటు పార్టీ సిద్ధాంతాలతో కూడా పని లేదు!  ఎన్నిక అనంతరం హంగ్ ఏర్పడ్డా, సంకీర్ణ ప్రభుత్వానికి ఆడుగులు పడుతున్నా, బల నిరూపణ సమయంలో ఈ పిల్లులే కీలకం. ఈ విధమైన తత్వంపై వ్యంగ్యంగా రాసిన పాట. 

పల్లవి: పిపిపిపి పిల్లులు గోడమీద పిల్లులు చుచుచుచు చూస్తున్నాయి దూకేందు సిద్ధమై ||2|| కష్టాలలో నీవుంటే జారుకునే పిల్లులు... కలిమిలో నీవుంటే చేరుకునే పిల్లులు... అవసరంలో ఆసరాకి నీతోటి నిలబడక అవకాశం గోడలపై గెంతేందుకు పిల్లులు...  ||పిల్లలు|| 1వ చరణం: వ్యక్తిత్వం సిద్ధాంతాలు పిల్లులకివి రాద్ధాంతాలు స్వలాభం, స్వార్ధాలు పిల్లులకవి పరమార్థాలు ||2|| మనవతా స్నేహభావం విసర్జించి కప్పేస్తాయి విలువల వలువలు తీసి బతికేసే పిల్లులు! అధికారులు మారితే గోడదూకే పిల్లులు ||పిల్లులు|| 2వ చరణం: హంగైన, కూటమైన పిల్లులని నమ్మలేక రిసార్ట్స్ క్యాంప్ లో బోనులోని ఎలుకల్లా ||2|| ప్రభుత పాలన నచ్చేనంటూ ఫిరాయించే పిల్లులు అవిశ్వాస తీర్మానం పరమాన్నం పిల్లులకు అధికారం మారితే గోడదూకే పిల్లులు. ||పిల్లులు|| ~ రచన, స్వరకల్పన, గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ www.talathoti.com

Wednesday, July 7, 2021

Song on Father Stan Swamy by Dr Talathoti Prithvi Raj

 

#FatherStanSwamy #Kavitalathoti #TalathotiPrithviRaj

ప్రజల పక్షం లేని పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా... ప్రజా వ్యతిరేకమైనదే! ప్రజలు ఓటేసి నాయకుల్ని ఎన్నుకున్నది దేశ ప్రజల సంక్షేమాన్ని చూస్తారని! సంక్షోభంలోకి నెడతారని కాదు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు. ప్రజాధనాన్ని, ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో అయిన వారికి కారుచౌకగా అమ్మేస్తున్నాయి; లూటీ చేస్తున్నాయి ! ఇదేమిటని ప్రశ్నిస్తే... ప్రభుత్వ వ్యతిరేకి అని కూడా కాదు; "దేశద్రోహి"గా ముద్రవేసి శిక్షిస్తున్నాయి. నాడు "తెల్లదొరల" ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడిన భగత్ సింగ్, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటివారిని దేశభక్తులుగా గుర్తించి నీరాజనాలు పలుకుతున్నారు. నేడు "నల్లదొరల" ప్రజా వ్యతిరేక పాలనపై మాట్లాడిన వారిని మాత్రం "దేశద్రోహులు" గా ముద్ర వేస్తున్నారు. హక్కులను పరిరక్షించే గొంతులను నొక్కి జైల్లోకి నెట్టేస్తున్నారు. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరిస్తూ శిక్షిస్తారు! మేధావులు మాట్లాడాలి! అది ఏ ప్రభుత్వమైనా... ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాల్సిందే! ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోవాల్సిందే! ఆదివాసీల హక్కుల గూర్చి పోరాడుతూ ప్రభుత్వం (చే హత్యగావింపబడ్డ) చేతిలో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి గారికి నివాళులు.
"ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ సంకెళ్లు
ప్రజల బాగు కోరే మేధావులకు
హక్కులపై ఉక్కు పాదము
నియంతల రోత క్రౌర్యము
ఓటు విత్తు విత్తితే విషవృక్షం మొలిచింది
ప్రాణాలను తీసే ఫలాలను కాస్తోంది..."
వాయిస్ ఓవర్:
ప్రజలు ఆలోచించాలి! తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు వీరూ దేశాన్ని దోచేస్తుంటే స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరిస్తుంటే ఏం చేయాలో ప్రజలు ఆలోచించాలి!!
~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
గీత రచయిత, గాయకుడు.