-->

Tuesday, December 17, 2019

ప్రియమైన అధ్యాపక మిత్రులకు నమస్కారాలు!. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించడానికి సుముఖతను లేదా విముఖతను తెలియజేయమని ప్రభుత్వం నుండి ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలకు సర్క్యులర్ అందించిన విషయం అందరికీ తెలిసిందే! ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలుగా మార్చాలని ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం (డాక్టా) స్వాగతిస్తుంది. సేవా భావంతో విద్యాసంస్థలను నెలకొల్పి పాటు పడే రోజుల్లో ప్రభుత్వం కళాశాల యాజమాన్యం వారి ఆర్థిక భారాన్ని తగ్గించి కళాశాల నిర్వహణలో వారికి చేయూతనందించి విద్యావకాశాలను ప్రోత్సహించే గొప్ప కార్యక్రమంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రారంభం అయింది. కాని రానురాను; మరీముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాదాపు చాలా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కళాశాలలను నిర్వహిస్తున్నాయి. దాదాపు సీనియర్ లెక్చరర్స్ రిటైర్డ్ అయిపోయాక; బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ద్వారా అధ్యాపకులుగా నియమింపబడిన వారే అనేక కళాశాలలలో మిగిలి ఉన్నారు. ఎయిడెడ్ అధ్యాపకులు న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన ప్రిన్సిపాల్, ఎన్.సి.సి. ఇటువంటి అనేక పదవులను
కళాశాల యాజమాన్యానికి చెందిన సామాజిక వర్గం పార్ట్ టైం అధ్యాపకులే పొంది నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అనేక ఎయిడెడ్ కళాశాలలలోని దళిత అధ్యాపకులు ఎదో ఒక రూపంలో యాజమాన్యం వేధింపులకు,వివక్షకు గురియవుతూ ఇక భరించలేని స్థితిలో కమిషనర్ గారికి ఫిర్యాదులు చేయగా కమీషనర్ గారు స్పందించి ఎంక్వైరీలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి లోని ఎయిడెడ్ కాలేజీ పైసంఘటనలకు ఒక ఉదాహరణ.
చాలా కళాశాలలలో నిధుల దుర్వినియోగం, నిధుల మళ్లింపులు జరుగుతున్నాయి. ఇన్నిజరుగుతున్నా వారికున్న రాజకీయ పలుకుబడి, అండతో ఇవన్నీ చేస్తుంటారు అని ప్రభుత్వాధికారులు చూసి చూడనట్లు పోతున్నారు. ప్రజలకు విద్యావకాశాలను మరింత కల్పించడానికి, దళిత- దళితేతర అధ్యాపకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, యాజమాన్యం వేధింపుల నుండి విముక్తి కలిగించడానికి, కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను విద్యాభివృద్ధికై వినియోగించుకోవడానికి ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలుగా మార్చాల్సిందే!. కళాశాలపై వారికుండే పెత్తనాన్ని వదులుకోవడానికి ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టపడకపోయినా నిర్భందంగా... ప్రభుత్వ పాలసీగా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చాలని డాక్టా కోరుకుంటుంది.
ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా జాతీయం చేసిన సందర్భం మరువకూడదు. ప్రభుత్వాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మా ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం (డాక్టా) మద్దతు ప్రకటిస్తోంది.
~ డాక్టర్ కాకాని సుధాకర్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం. (డాక్టా).

No comments:

Post a Comment