-->

Thursday, July 27, 2023

డాక్టర్ హరి వంశరాయ్ బచ్చన్ " మధుశాల "

"నువ్వే నా మధు పాత్ర ప్రియతమా నేనే నీ - దాహార్తి
నిన్నే నాలో నింపుకు ఉంటే అవుతావు నువు నా అభ్యర్థి
నన్ను తాగేది నువ్వయితే మరి నిన్ను తాగేది నేనె కదా
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

       ప్రేయసీ ప్రియులు ఒక మధుశాల. నిత్యం ఒకరికినొకరు మధువనే ప్రేమను సేవిస్తూ జీవితం సాగిస్తారు. ప్రేయసి మధుపాత్ర అయితే ప్రియుడు దాహార్తి.
      
      "మధుశాల" కవితా సంపుటి లోతైన తాత్విక చింతన. అమితాబచ్చన్ తండ్రిగారైన డాక్టర్ హరివంశ రాయ్ బచ్చన్ హిందీలో రాయగా,  డాక్టర్ దేవరాజు మహారాజు చే తెలుగులోకి అనువాదింపబడిన కవితా సంపుటే మధుశాల. మధుశాల కేవలం మధువుకే కాదు; ఒక ధ్యేయానికి, గమ్యానికి సంకేతం అంటాడు అనువాదకుడు మహారాజు.


"ఒక్కొక్కడుగూ వేస్తూ తీస్తూ ఎంత జీవితం నడిచాము
అయినా చాలా దూరం ఉందని దారి చూపు వారంటారు
సాహసముంటె వెనక్కి తిరగకు ధైర్యం ఉన్నా ముందుకు పోకు
కింకర్తవ్యమ్మని సంశయించు నను, దూరము నెట్టెను మధుశాల!"అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

"ఎరుపు వర్ణపు మదిరా ధారలు చూసి జ్వాలలని అనకండి
హృదయ జ్వాలల గాయం కాదు, మదిర మీది తెలి నురుగండి
విగత స్మృతి సాకీ అయితే, బాధే కద మధువున ఉన్న నిషా
రండి - బాధలో ఆనందం, పొందే వారిది మధుశాల"
అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

"మందిరమందున గంట కొట్టరు విగ్రహాలకి దండ వేయరు
మసీదుకు ఓ తాళం వేసి, మౌల్వీ గారు నిద్రపోదురు
రాజుల కోటలు బీటలు వారును గుల్లయి పోవును కోశాగారం
తాగు బోతులకు శుభం కలగనీ, తెరిచి ఉండనీ మధుశాల" 
ఈలోకంలో ఏం నశించి కనుమరుగైనా... ప్రేమ మధువును గ్రోలేవారికి ప్రేయసి హృదయ మధుశాలలు తెరిచే ఉంటాయని హరివంశ రాయ్ బచ్చన్ అంటారు. శుభం కలగాలని కోరుకుంటాడు.


"ఏడ్చేవారు ఒక్కరు మిగలక పరివారాలు నాశనమగును
సుస్వరాల సిరి గల భవనాలు చప్పుడు లేక మూగబోవును
రాజ్యాలన్నీ తల కిందవును రాజుల భాగ్యం నిద్ర పోవును
అయినా, తాగే వారిని కూడగట్టును - తట్టి లేపును మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
అంటే ఈ లోకంలో ఏవి కళావిహీనమైనా, దూరమైనా నిత్యం మధువును ఆస్వాదించేవారితో నిత్యం సందడిగా ఉండేది మధుశాలే అంటాడు కవి.

"యుగయుగాలుగా జగమున మధువు, చెడుదని అందరు అంటారు
తాగేవాడు బుద్ది హీనుడు సాకీ హొయలు తుంటరివి
జగతికి మధువుకు జోడీ కుదరదు-దూరం పెరగదు
క్షీణించేది జగమైతే, నిత్యం రాణించేది మధుశాల"అంటాడు కవి హరివంశ రాయ్ బచ్చన్.


 పద్మభూషణ్  డాక్టర్ హరి వంశరాయ్ బచ్చన్ 80 కి పైగా రచనలు చేసిన కవి, కథకుడు, రచయిత. సుప్రసిద్ధ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రిగారు. 1935లో రాసిన కవితా సంపుటి ఈ "మధుశాల". ఉమర్ ఖయ్యాం గ్రంథానికి అనువాదం కాదు మధుశాల. ఇది స్వతంత్ర రచన. భావుకత ద్రాక్ష లత అనీ....కల్పన తీగ అని, పాఠక జనం ఆ మధువును సేవించే వారని, పుస్తకమే మధుశాల అని కవి ఓ కవితలో రాశారు.
           హిందీలో "హాలా"వాదాన్ని... అంటే "మధు" వాదాన్ని ప్రతిపాదించిన కవి రాయ్.  హాలా అంటే మధువు. కానీ ఈ కవి దృష్టిలో మధువంటే మధువే కాదు; తన కావాల్సిన దాన్ని వెతుక్కోవడంలో మనిషి పొందే ఆనందమే "మధువ"ని రాయ్ భావం. ప్రేమకు, ఆధ్యాత్మికతకు, జీవన గమ్యానికి సంబంధించిన సంకేతం మధుశాల. ఉర్దూ కవులైన ఉమర్ ఖయ్యాం, గాలిబ్, జఫర్, మీర్, దాగ్ వంటి కవుల మాదిరిగానే మధువు, మధు పాత్ర, మధుశాల, సాకీ పదాలను ప్రయోగిస్తూనే సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ "మధుశాల"లో కవితలు అల్లారు. హరివంశ రాయ్ బచ్చన్  అధ్యాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,  రాజ్యసభ సభ్యులు. తన తండ్రి 115వ జయంతి ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే అమితాబ్ బచ్చన్ తన తండ్రి మధుశాల కవితా సంపుటి ఆకృతిని రాతిబల్లగా పోలాండ్ లో తయారు చేయించి తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.

Saturday, July 15, 2023

శివసాగర్ జయంతి సందర్భంగా... 'నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ కవిత



"జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు

పొదలో పొంచివున్న అడివి ఎలుగు
నాపై క్రూరాతి క్రూరంగా దాడిచేసే వేళ
నడిరాత్రి వెన్నెలమ్మ
నిశ్శబ్దంగా నా దరి చేరి
ప్రేమతో నన్ను సాదరంగా అనునయించే వేళ

జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు
జీవితానికి మరణానికి మధ్య
నన్ను హల్లో అని పలకరించే
సరిహద్దు రేఖ మీద
పసిపాపలాంటి వృద్ధాప్యంలో
నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని
పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు" అని ‘నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అనే కవితలో శివ సాగర్ తన జీవితాన్ని అభ్యర్థిస్తాడు. పెద్దల దోపిడీలతో, అసమానతలతో ఉన్న ఈ సమాజాన్ని కాపాడేందుకు విప్లవ మార్గంలో నడినవాడు... అభ్యుదయ - విప్లవ కవిత్వం రాస్తూ తన యవ్వనాన్ని, జీవితాన్ని ఖర్చుచేసిన త్యాగశీలి శివసాగర్.

శివసాగర్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా 'నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అనే వారి కవిత మీకోసం. శివసాగర్ పురాణ ప్రతీకలు వాడుతూ కవిత్వం రాయడంలో దిట్ట. కవిత్వం కంటే గేయరచనల ద్వారే వారికి గుర్తింపు.~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
#శివసాగర్ #సత్యమూర్తికెజి #విప్లవకవి #తెలుగుకవిత్వం #హైకూక్లబ్ #తలతోటిపృథ్విరాజ్

Dr Talathoti Prithvi Raj
www.talathoti.com
www.litt.in

Friday, July 7, 2023

అద్దేపల్లి రామమోహనరావు కవితలో భావచిత్రం: విశ్లేషణ ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


"పడమటి కొండమీద జారిపోతూ
ఊరి చివర తుమ్మతోపుల ముళ్ళు
గుండెలో గుచ్చుకొని
నెత్తురు కారుస్తున్నాడు సూర్యుడు
ఆ నెత్తురు తాగి
కన్నీటితో గడ్డకట్టి నిలబడ్డది కాలువ" అని
అద్దేపల్లి రామమోహనరావు ‘రక్తసంధ్య' కవితా సంపుటిలో 'సమాధిలో కలం' అనే కవితలోని ఈ కవితా పంక్తులు భావచిత్రానికి ఉదాహరణ. 


అందరూ చూసే, చూసిన దృశ్యమే ఇది. సాధారణ ప్రజలు దృష్టికంటే కవుల దృష్టి, అభివ్యక్తీకరణ భిన్నంగా ఉంటుంది అని నిరూపించిన కవిత. సమాధిలో కలం అనే కవితా శీర్షికను బట్టి కవితా వస్తువేమిటో మనం గ్రహించవచ్చు. కవీ సూర్యుడే. తన కవితాక్షరాలనే కిరణాలను లోకంలో ప్రసరిస్తాడు... చైతన్య పరుస్తాడు కవి సూర్యుడు.  అయితే ఈ పని అంత సులువైనది కాదు. స్త్రీ ప్రసవవేదనవంటిదే కవి తన అనుభూతికి  కవితాక్షరాలుగా జన్మనివ్వడానికి. ఈ కవితలో అదే కవి వేదన. ప్రాకృతిక దృశ్యాన్ని ఆలంబనగా చేసుకొని కవి వేదనను వ్యక్తీకరించాడు. 
      పడమటి కొండమీద  సూర్యుడు జారిపోవటం కవి వైఫల్యానికి ప్రతీక. తుమ్మతోపుల ముళ్ళు సూర్యుని గుండెలో గుచ్చుకొని నెత్తురు కారే దృశ్యం కవి బాధకి ప్రతీక. ఎర్రని అస్తమయ సూర్యుని ప్రతిబింబ వర్ణం  కాలువ కన్నీరు గడ్డకట్టి నిలబడింది అనడం కవిలోని నిరాశాస్థితికి ప్రతీక. ఇలా కవి తన ఆవేదననంతా ఒక అద్భుతమైన భావచిత్రంగా ప్రదర్శించాడు. 

పి. అనంతరావు గారి "పొగ జెండా" కవితా విశ్లేషణ :~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


"మా చెమట
మా జీవితాల ఎజెండా
పొగ జెండా
అది మరిగి, మరిగి, ఆవిరై, పొగలై
ఫ్యాక్టరీ గొంతుల్లోంచి
వినీల ఆకాశ వీధుల్లో ఎగురుతుంది
మా చెమట బొట్ల విజయాన్ని
బాహాటంగా, సగర్వంగా చాటుతుంది
గుండెల్లో రగిలే సెగల్లోంచి
ఎగిసిన పొగల అల్లికయే మా జెండా!" అని కవి పి. అనంతరావు తన "పొగ జెండా" కవితా సంపుటిలో కవితను చెబుతూ...‌ శ్రామికుల శ్రమశక్తితో... ఉత్పత్తులతో స్వర్ణకాంతులీనాల్సిన ఈదేశం ఎడారిగా విస్తరించడాన్ని చూసి ఆవేదన చెందుతాడు. వృత్తిరీత్యా కవి కార్మికుడే! కర్మాగారాలు తమకు తల్లి ఒడి అని...సర్వస్వం అని, అటువంటి కర్మాగారాలను కొన్ని దోపిడీ శక్తులు కుహనా రాజకీయ నాయకులతో చేతులుకలిపి ఆక్రమించే ప్రయత్నాల్ని కవి నిరసిస్తూ...

"మమ్మల్ని ఫ్యాక్టరీల నించి గెంటాలని చూస్తే
తిరుగుబాటు పొగల్లో మీకు ఊపిరాడకుండా చేస్తాం
మా ఫ్యాక్టరీల్ని
మా దేశాల్ని
మా ప్రజల్ని
కాపాడుకునే కర్తలం, క్రియలం మేమే
ఏనాటికీ మాకు ఓటమి లేదు
అందుకే
మా చెమట
మా జీవితాల ఎజెండా!", అని ముగిస్తాడు. 

కరోనా బలిగొన్న అనేకులలో ఒకరు కవి అనంతరావు. నన్ను అభిమానించే సాహితీ మిత్రుడు. 

పి. అనంతరావు, ఎం.వి.ఆర్. మూర్తి విశాఖపట్నంలో కవిసోదరుల్లా సాహితీ సమావేశాలలో కనిపిస్తుంటారు. అభ్యుదయ భావజాలం గల కవులు. అరసం లో సభ్యులు, కొన్నాళ్ళు కార్యవర్గ సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు. అద్దేపల్లి రామమోహనరావు గారి అనుంగు శిష్యులు. పి. అనంతరావు గారు ఇండియన్ హైకూ క్లబ్ సమావేశాలలో పాల్గొనేవారు.కనికరంలేని కాలం.. వయసు కలిసి ఆయనకు గుండెజబ్బు తెచ్చిపెట్టాయి. ఇంకొన్నాళ్ళకి కరోనా బలిగొంది. అనంతరావు నన్ను అభిమానించే వ్యక్తి. వారి స్మృత్యర్థం వారి అభ్యుదయ కవితను మీకు పరిచయం చేయాలని ఈ కవిత. విశాఖ స్టీల్ ప్లాంట్ 
 ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఈ కవిత స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

#పి.అనంతరావు #పొగజెండా #తెలుగుకవిత్వం #అభ్యుదయరచయితలసంఘం #హైకూక్లబ్ #తలతోటిపృథ్విరాజ్
~ Dr Talathoti Prithvi Raj,
www.talathoti.com
www litt.in

మల్లవరపు జాన్ " అస్పృశ్యత " పద్యాలు


"నాక మునుండి యూడిప డెనా? యొకరుండు; మఱొక్కరుండధో
లోకమునుండి వచ్చెనె? ప్రలోభులు స్వార్ధము నెంచి మానవా
నీకమునందు నగ్రజులు నిమ్న జులన్న విభేద తత్వముల్
వాకొని మభ్య పెట్టి వెలివాడల నుంచిరి నిన్ను; సోదరా!" అని మధుర కవి మల్లవరపు జాన్ "అస్పృశ్యత " అనే పద్య ఖండికలోని ఈ పద్యంలో అంటాడు!
 "చెప్పారాని కులం" అని దళితులగూర్చి మాట్లాడేవారికి బుద్ధి చెప్పడానికి బదులు భయపడుతూ... వారే ఎదురైతే నమస్కారాలంటూ ఎంతకాలం సహిస్తావంటూ తన దళిత సోదరులను కవి నిలదీసి స్వార్ధపరుల కుట్రను వివరించాడు 

"ఎక్కువ మా కులమ్మను మహీ సురులైన వివాహవేళ నా
చుక్కలలోని నీయనుగు సోదరియైన 'అరుంధతీ' సతిన్
'మొక్కులు వెట్టి చూచి శుభముల్గొను చుండగ నీకులం బెటుల్
తక్కువయయ్యె; దుర్జనుల తంతులు
చిత్రవిచిత్రముల్ గదా!" అని మరోపద్యంలో అంటాడు కవి. మనం తక్కువ కులమనీ, వారు ఎక్కువ కులం అని చెప్పుకునేవారు, వివాహ సమయంలో  మన సోదరి అరుంధతీకి  నమస్కరిస్తూ వారు శుభం పొందుతున్మప్పుడు మన కులం తక్కువెలా అవుతుంది? ఇవన్నీ దుర్జనుల పనులుగా గ్రహించమని తన జాతి జనులలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టే హితవచనాలు చెబుతాడు కవి మల్లవరపు జాన్.
 
అస్పృశ్యులు, నిమ్నజాతి వారంటూ సమాజంలో దళితులను దళితేతరులు తక్కువ వారిగా చూస్తుంటే...  దళితులు మాల మాదిగలనే బేధంతో ఉంటే...  సమానత పొందేదెపుడు, వారితో కలిసి తిరిగేదెపుడని ప్రశ్నించాడు కవి. ఇంటగెలిచి రచ్చగెలవాలి అనే సామెతను తన జాతిజనానికి ఇలా గుర్తు చేస్తున్నాడు కవి.
"మాల యతడు; నేను మాదిగ కులజుడ;
నను విభేద ముండు నంత దనుక
కలిసి తిరుగ లేవు గద! కులీనుల తోడ
ఇంట గెలిచి రచ్చ కేగుమయ్య!"


మల్లవరపు జాన్ ఛందో బద్ధమైన రచన ప్రౌఢమైనది కాదు. అతి సరళమైన శైలి.సమాజ హితాన్ని చాటడమే గాక... కుల వివక్షను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం సభ్యుడు. "విశ్వ ప్రకాశము" ఖండకావ్యం. 20 శీర్షికలతో ఇందులో పద్యాలు ఉన్నాయి.
ఆ విధంగా వ్యవహరిచేవారు స్వర్గం నుండో అధోలోకం నుండో రాలేదు... స్వార్థంతో ఎక్కువ తక్కువలు సృష్టించి వెలివాడలో నుంచిని సత్యాన్ని  


మద్దూరి నగేష్ బాబు. గారి "మాటిపూట" కవిత ~ Dr Talathoti Prithvi Raj


"ఎవడో కులంపేరెత్తి తిట్టినట్టు
కందగడ్డయిపోయిన మాటీడి సూర్యుడు

రాత్రి నిరాహారా దీక్షకోసం
పచ్చిక బయళ్లనుండి అయిష్టంగా కొట్టాలకు వస్తున్న గొడ్లు

ఏ చిన్నదేశంమీదో అమెరికావిమానాలవాన కురిపించినట్టు
వరసగా వెళ్లిపోతున్న ఏటికొంగలబారు

బడి నుండి ఇంటికొస్తే
కల్లాల దగర్నుండి అమ్మ ఇంకా రాలేదు..." అని "మాటిపూట " అనే కవితలో మద్దూరి నగేష్ బాబు అంటాడు. 
      సాయంకాలం పడమర గూటికిచేరే సూర్యుడు...గూటికి చేరే కొంగలు, కొట్టాలకు చేరుకునే గొడ్లు, స్కూల్ నుండి ఇంటికి చేరుకునే పిల్లలు. ఒకే సమయంలో కనిపించే ఈ దృశ్యాల్ని దళిత స్పృహతో సమర్ధవంతంగా కవిత్వీకరించాడు.

   ఎర్రటి అస్తమయ సూర్యుడ్ని దళిత స్పృహతో వ్యక్తీకరించాడు. పల్లేల్లో గొడ్లుకాచే దళితుల దుస్థితి గుర్తుచేశాడు. నాయకుల దొంగ నిరాహార దీక్షను ఎత్తిపొడిచాడు.

చిన్నదేశాలమీదే కాదు; చిన్నకులాలుగా చిత్రించే సాగించే దౌర్జన్యాలు, మారణకాండను ఎగిరెళ్ళే కొంగల బారును సామాజిక దృష్టితో చూశాడు కవి.

 బడినుండి ఇంటికి వచ్చినా కల్లంనుండి ఇంటికి రాని తల్లిగూర్చి  ఆలోచించే పిల్లవాడి  ద్వారా దళితుల్లోని అభద్రతా భావాన్ని కవి వ్యక్తీకరించాడు.


Wednesday, July 5, 2023