-->

Friday, June 2, 2023

వెంపలి వెంకట శివప్రసాద్ కవిత్వం

కొమ్మమీది కోయిలనై ....
======-వెంపలి వెంకట శివప్రసాద్


"లోకంలోని శోకాన్నంతటినీ తాగేసి
ధబ్బున కూలిపోతాను
భగ్గున మండిపోతాను
అసలే నివురై పోతాను
అప్పుడు..
వెయ్యి సౌఖ్యాల వెలుగులు
కళ్ళలో నింపుకొని
ఆనందగంగా ప్రవాహంలో
మునిగి తేలుతున్న జనాన్ని
అసమానతలసలే లేనిలోకాన్ని
భూతల స్వర్గాన్ని
పాటలుగా కూర్చి పాడడానికి
కోమ్మమీది కోయిలనై పుడతాను." అని సమసమాజ స్థాపన పట్ల తన ఆశావాదాన్ని ప్రకటించాడు. అందుకోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమన్నట్లు కవి వెంపలి వెంకట శివప్రసాద్ అంటాడు. చాలామంది కవులకుండే బలహీనతే వెంపలిని కవిత్వంనుంచే కాదు;, అతనినీ.... అతని కవిత్వాన్ని ప్రేమించే వారినుండి శాస్వతంగా దూరం చేసింది.

"మేం విధ్వంసకులం
చీకటి తెరలు చీల్చుతాం
మేం నిర్మాతలం
వెలుతురు తోరణాలు కడతాం" అని వెంపలి వెంకట శివప్రసాద్ , విప్లవ కవులు తమ కవితాక్షరాలతో సమాజంలోని సమస్యల చీకట్లను ఎలా తొలిగించి వెలుతురు సంతోషాల్ని పంచుతారో మినీకవితగా చెప్పాడు. అంతే కాదు;...
"సూరీడు
‘కోడివేసే తొలి కూతకు
తూరుపు కొండల్లో ఉదయిస్తే..
నేను పెట్టే పొలికేకకు
జనం గుండెల్లో ఉదయిస్తాడు" అని అభ్యదయ విప్లవ కవుల కవితాక్షరాల శక్తిని, వారి గొంతుకల బలాన్ని మరో మినీ కవితలో ఇలా చాటాడు.
        మినీకవితా ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా మినీకవితా ప్రక్రియ వ్యాప్తికి కృషి చేస్తూ, ప్రక్రియను అనుసరిస్తూ "కెరటాలు, చినుకు, శ్వేతనాగు, తోటపని, నేలచుక్క, రివ్వున సాగే, సప్తరుషి మండలం" వంటి పుస్తకాలను తీసుకువచ్చిన వెంపలి అనకాపల్లి వాసి. వృత్తిరీత్యా పాత్రికేయుడు, నాకు సాహితీ మిత్రుడు.

No comments:

Post a Comment