-->

Tuesday, June 27, 2023

శ్రీరంగం నారాయణబాబు✓


    "ప్రేమకు ప్రాణాలిచ్చే స్త్రీలు
    ఉరికొయ్యల్లాంటి మగాళ్ళు
    ... ... ...
    గుమస్తాలంతా గుల్లగాళ్ళు
    బీదవాళ్ల నెత్తురు
    బీరులాగ తాగేస్తారు
    ... ... ...
    ధర్మాన్ని పశువునిచేసి
    పట్టపగలు కోర్టులోన
    వధచేసి, సాయంత్రం
    సురాపానంలో చప్పరించి
    నంచుకుంద్రు" అని 'విశాఖపట్టణం' అనే గీతంలో అంటారు నారాయణ బాబు. ఒక స్థలాన్ని వర్ణించిన ఆధునిక స్థలపురాణం ఈ గీతం! "సర్రియలిజం" అనే "అధివాస్తవికత " కవితా నిర్మాణం శైలిలో నారాయణ బాబు రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో అధివాస్తవిక కవిత్వాన్ని ప్రవేశపెట్టిన ప్రముఖులలో
ఒకరు శ్రీరంగం నారాయణరా బాబు. అతి నవ్యకవితా రీతులలో కవితా చిత్రాలను చిత్రించే సమర్ధ కవి. నాటక రంగంలోనేగాక, "భక్త 
కబీర్" సినిమాలోకూడా నారాయణ బాబు నటుడిగా నటించారు.

    "పల్లకీ దిగినట్టి
    పెళ్ళికొడుకులు మీరు
    పట్టుతివాసీని నేను
    నడవండి, నడవండి!
    నామీంచి నడవండి!!" అని "గడ్డిపరక" అనే గీతంలో వర్ణిస్తాడు. గడ్డిపరక పేదలకు ప్రతీకైతే..‌‌., వీరి జీవితాలపై నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళేవారికి ప్రతీక ధనికులు.  పశువుల నోటికి పాయసాన్నంగా కూడా వర్ణించాడు కవి.
"నీ
పాటల కత్తులతోనే
నా
హృదయం నెత్తురుతీసి
నే
వెలిగించిన
దీపపు కాంతిని నర్తింపుముర
శ్రీ
శ్రీశ్రీ!" అని శ్రీశ్రీ పై కవిత రాశారు.

నారాయణ బాబు రచనలు:
విశాఖపట్నం
ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
గడ్డిపరక
గేదెపెయ్యె
తెనుగురాత్రి
రుధిరజ్యోతి
కపాలమోక్షం
కిటికీలో దీపం
ఊరవతల
పండగనాడు
మౌన శంఖం
సంపంగి తోట
    ఈరోజు శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో. అధివాస్తవికతను అనుసరించే కవితాశైలి నారాయణ బాబుది. అధివాస్తవికత ను ఇంగ్లీష్ లో సర్రియలిజం అంటారు.  ఊహను, వాస్తవాన్ని అనుసంధానిస్తూ వ్యక్తీకరించే రచనా ప్రక్రియనే అధివాస్తవికత... లేదా సర్రియలిజం అంటారు. 

Friday, June 23, 2023

నగ్నముని కవిత ✓


“ఎంగిలి మెతుకులేరుకొని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళకప్పుల మీదా జంతు కళేబరాలమీదా
అలగాజనం పుళ్ళమీదా
పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిథ్యగూర్చి కావు కావుమంటూ ప్రవచించగలవు" అని దివిసీమ ఉప్పెన విపత్తును "కొయ్య గుర్రం " దీర్ఘ కవితగా రాసిన నగ్నముని ప్రతీకాత్మక కవిత రాశాడు. కవితా సంపుటి పేరే ప్రతీకగా పెట్టారు. 

గుర్రం వేగానికి గుర్తు. కొయ్య గుర్రం జడత్వానికి  అధికారానికి, అసమర్ద పరిపాలనకి ప్రతీక.  కొయ  యంత్రాంగం వైఫల్యాన్ని. కొయ్య గుర్రం చలనం లేని వ్యవస్థ, ప్రభుత్వానికి ప్రతీక.

 ఎంగిలి మెతుకులేరుకోవటం  అంటే .... శ్రమించకుండా అవినీతి సొమ్ముతో బ్రతకడం అలవాటు చేసుకున్న అధికార గణం కాకులకు ప్రతీక. అలగా జనం పేదలకు ప్రతీక. పరిస్థితులు ఎలా ఉన్నా ఊరిపై...ఇళ్ళపై... జనంపై బడి దోచేయడమే కాకులకు ప్రతీక అయిన అధికారులు, నాయకుల తీరును కవి నగ్నముని నిరసించాడు.
========
"ముక్కులు పగల గొడుతున్న
దుర్గంధ రక్త స్రావంలో దూకి కేరింతలమునకలేస్తూ
దుర్గంధ రక్త స్రావాన్నే దోసిళ్ళతో తాగుతున్న
మనుషులనే మందల్ని చూశా

నాలుకలు చిమ్ముతూ
బ్రతుకును మురగబెడుతూ
సస్యశ్యామలాల్నీ మానవత్వపు పరిమళాల్నీ
ముంచేస్తున్న యీ ప్రవాహం ఎక్కడనుండోనని
పుండు ఎక్కడోనని కత్తుల్తో ప్రయాణంచేశా

ప్రపంచం ముట్టయింది
రాజకీయాలు రక్త స్రావం." అని "కంపు " అనే కవితలో నగ్నముని అంటాడు. దుర్గందపూరితమైనవి రాజకీయాలు. కుల,మత, ప్రాంతీయ బేధాలతోనే గాక, పార్టీలపరంగా కూడా మనుషులు విడిపోయారు. అధికార పార్టీ పాలనా నిర్ణయాలతో సగటు మనిషి చితికిపోతున్నా, ఆ పార్టీలకోసం గ్రూపులుగా ప్రజలు తన్నుకు ఛస్తారు. సిద్ధాంతాలు మరచి అపవిత్రపొత్తుల్తో రాజకీయం చేయడం, నమ్మి ఓటేసిన ఓటరు నడ్డివిరవడం, ఇచ్చిన హామీలను మర్చిపోవడం....పాలనా తీరును ప్రశ్నిస్తే విమర్శిస్తే ప్రజల్ని బెదిరించి నోరుమూయించడం..‌..
ముట్టైతే జరిగే రక్తస్రావమే ఈ తంతంతా!

Friday, June 2, 2023

వెంపలి వెంకట శివప్రసాద్ కవిత్వం

కొమ్మమీది కోయిలనై ....
======-వెంపలి వెంకట శివప్రసాద్


"లోకంలోని శోకాన్నంతటినీ తాగేసి
ధబ్బున కూలిపోతాను
భగ్గున మండిపోతాను
అసలే నివురై పోతాను
అప్పుడు..
వెయ్యి సౌఖ్యాల వెలుగులు
కళ్ళలో నింపుకొని
ఆనందగంగా ప్రవాహంలో
మునిగి తేలుతున్న జనాన్ని
అసమానతలసలే లేనిలోకాన్ని
భూతల స్వర్గాన్ని
పాటలుగా కూర్చి పాడడానికి
కోమ్మమీది కోయిలనై పుడతాను." అని సమసమాజ స్థాపన పట్ల తన ఆశావాదాన్ని ప్రకటించాడు. అందుకోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమన్నట్లు కవి వెంపలి వెంకట శివప్రసాద్ అంటాడు. చాలామంది కవులకుండే బలహీనతే వెంపలిని కవిత్వంనుంచే కాదు;, అతనినీ.... అతని కవిత్వాన్ని ప్రేమించే వారినుండి శాస్వతంగా దూరం చేసింది.

"మేం విధ్వంసకులం
చీకటి తెరలు చీల్చుతాం
మేం నిర్మాతలం
వెలుతురు తోరణాలు కడతాం" అని వెంపలి వెంకట శివప్రసాద్ , విప్లవ కవులు తమ కవితాక్షరాలతో సమాజంలోని సమస్యల చీకట్లను ఎలా తొలిగించి వెలుతురు సంతోషాల్ని పంచుతారో మినీకవితగా చెప్పాడు. అంతే కాదు;...
"సూరీడు
‘కోడివేసే తొలి కూతకు
తూరుపు కొండల్లో ఉదయిస్తే..
నేను పెట్టే పొలికేకకు
జనం గుండెల్లో ఉదయిస్తాడు" అని అభ్యదయ విప్లవ కవుల కవితాక్షరాల శక్తిని, వారి గొంతుకల బలాన్ని మరో మినీ కవితలో ఇలా చాటాడు.
        మినీకవితా ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా మినీకవితా ప్రక్రియ వ్యాప్తికి కృషి చేస్తూ, ప్రక్రియను అనుసరిస్తూ "కెరటాలు, చినుకు, శ్వేతనాగు, తోటపని, నేలచుక్క, రివ్వున సాగే, సప్తరుషి మండలం" వంటి పుస్తకాలను తీసుకువచ్చిన వెంపలి అనకాపల్లి వాసి. వృత్తిరీత్యా పాత్రికేయుడు, నాకు సాహితీ మిత్రుడు.