హైకూ అంటే :
హైకూ ఓ ప్రాకృతిక కవితా రూపం . అంటే ప్రాకృతవిలోని వస్తువులపై ,దృశ్యాలపై రాసే కవిత్వాన్ని హైకూ అంటారు . జెన్ తాత్విక భావజాలాన్ని అనుసరించి రాయడం కూడా జరుగుతుంది . హైకూ వస్తువులు ఉదా : హిమబిందువు , సెలయేరు , తూనీగ , సీతాకోక చిలుక , పుష్పాలు మొదలైనవి . ప్రాకృతిక దృశ్యాలకు ఉదా ఇంద్రధనుస్సు , కురిసే వాన, ఉదయించే సూర్యుడు , కమ్ముకుంటున్న పొగమంచు. ఇలా ఎన్నింటినో చెప్పుకోవచ్చు . 14వ శతాబ్ది నుండి కవితా ప్రక్రియగా లక్షలాదిమంది కవులచే అనుసరింపబడుతున్న కవితా ప్రక్రియ హైకూ .
హైకూ ఎలా రాయాలి :
హైకూని మూడు పాదాలలో(లైన్లలో ) రాయాలి . అక్షర నియమాన్ని అనుసరించాలనుకుంటే మొదటి , చివరి లైన్లలో ఐదేసి అక్షరాలను , మధ్య లైన్లో ఏడు అక్షరాలను పాటిస్తూ రాయాలి . ఉదా :
"చిలుక ముక్కు (5 అక్షరాలు)
పండ్లెన్ని కొరికిందో ...(7 అక్షరాలు )
పడిపోయింది !(5 అక్షరాలు )"
ప్రాకృతిక హైకూ :
ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోని హైకూ సాహిత్యంలో ప్రాకృతిక వస్తువులపై , దృశ్యాలపై వచ్చిన హైకూలు ఎక్కువున్నాయని పండితులు అభిప్రాయం పడ్డారు .
1) ఉదయకాలం తలుపు సందులోనుంచి వెలుగు ప్రవాహం అన్నట్లు ఇంట్లోకి జొరబడి సూర్యకిరణాన్ని గమనించి అందమైన ప్రాకృతిక హైకూగా ఇలా అన్నాను
"అందరూ అడిగే
ఇంట్లోకి వస్తారు
ఒక్క ఉదయ రేఖ తప్ప "
2) పరోపకారిగా చెట్టును చెప్పుకోవాలి . మనిషి జన్మ అన్ని జన్మల్లోకెల్లా ఉన్నతమైనది చెప్పుకుంటున్నప్పటికీ, చెట్టు పూలని,కాయల్ని ఇస్తుంది . నీడను పంచుతుంది . మనం సృష్టించిన కాలుష్యాన్ని గ్రహించి ప్రాణవాయువుని అందిస్తుంది . పక్షులకు గూడుగా , మన ఇళ్ల తలుపుగా , వంట చేరుకుగా ,స్మశానంలో ఈ కట్టెను కాల్చే కట్టెగా ...ఎన్నో విధాలుగా చెట్టు ఉపయోగపడాలని మనిషి చెట్టు అని కవులు పోల్చింది .
ఆకులు రాలి మోడుగా ఉన్న చెట్టుకూడా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది . శాఖోపశాఖలుగా కనిపించే శిశిర వృక్షంలో ఎంత సౌందర్యం ! అలాంటి చెట్టు కొమ్మపై పిట్టవాలితే ఇంకెంత అందంగా ఉంటుందో . సౌందర్య దృష్టి గలవాళ్లే గ్రహించగలరు. ఈ ఆలోచనలోనుంచి వచ్చినదే
"చెట్టు .
కాయల్ని ఇవ్వలేనిదైనా నీడనిచ్చింది .
నీడ ఇవ్వలేనిదైనా ఆనందాన్నిచ్చింది " అనే ఈ హైకూ
సామాజిక హైకూ :
సామాజిక అంశాలనుకూడా హైకూగా మలిచారు కవులు .
1) పల్లెల్లో అరుగులపై పులీ మేక ఆట ఆడడం సాధారణ విషయం . పెద్దమనుషులనబడేవారు బలహీనులపై పక్షపాత తీర్పులు ఇస్తూ ఉండడం కూడా సాధారణమే . ఈ రెండు అంశాలను స్ఫురింపజేసేలా
"పల్లె జనాలు
పులి ...మేక ఆటలో
రచ్చబండపై " అని రాశాను .
తాత్విక హైకూ :
బౌద్ధ తాత్వికతే ప్రధానంగా రాయబడే కవితా ప్రక్రియగా కూడా హైకూను చెప్పుకోవాలి .
1) గాలికి రాలిపోతున్న ఆకుల్ని గమనించి
"రాలిపోతున్నాయి
గాలొచ్చి పండుటాకులు
గాలిపోయి దేహాలు " అని తాత్విక కోణంలో హైకూను చెప్పాను .
2) గతించిన మన ఆత్మీయులగూర్చి చింతిస్తుంటాము . తుది శ్వాస విడిచినవారి గూర్చి విచారించవద్దు . ఎందుకంటే ....
"వాళ్ళుపోయినా
మనం పీల్చే గాలిలోనే
వారి తుది నిశ్వాస ." అనుకుని కుదుటపడాలి
No comments:
Post a Comment