-->

Tuesday, May 15, 2012

B.V.Bangrraju padyaalu

అమ్మను మించిన దైవము 
ఇమ్మహి లేదదియె నిజాము ఏమర కెపుడున్ 
బామ్మయ్య ఏమి చేసెనొ
అమ్మేగా నిన్ను కన్న దవనిని మౌనీ!

పుట్టిన జీవాలన్నీయు 
గిట్టుట ధర్మమ్ము ప్రకృతి గేహమునందున్;
పుట్టితివి మనుజ జన్మను
గట్టిగ మేలొకటి సేయ గావలె మౌనీ!

కల్లా కపటము లెరుగవు
కల్లోలపు లోకమందు కాలిడి తివహో 
కల్లోల మంట కుండగ   
నుల్లాసము తోడి బ్రతుకు నొందుము మౌనీ!

పనియే దైవం బిలలో 
పనిచేయుట పూజయగును పరమాత్మునకున్ ;
ఘనులందరు పనిలోనే
మనసును లగ్నమ్ము చేసి మనెదరు మౌనీ!

పరులకు సేవలు చేయుట,
పరమాత్ముని పూజయగును పరికింపంగా;
కరుణామయు లీ మాటనె
తరియింపగ చెప్పినారు తలపుము మౌనీ!

మన సంస్కృతి, మన ధర్మము
ఘనమైనది విశ్వమందు కాదన గలరే!
కన జాలని మౌడ్యముచే   
మనముంటిమి  తెలివికలిగి మసలుము మౌనీ!

నీవే దైవము దయ్యము 
నీవే సుఖ దుఖములకు నెలవై నిలువన్,
భావించ నేల నితరులు 
జీవిత విద్రోహులనుచు సిగ్గది మౌనీ!

నుదుటను బ్రహ్మయరాతని,
ఇది పూర్వపు కర్మయంచు నేడ్చుట యెల్లన్ 
వదలని మూర్ఖత్వం బిది
కదలక కూర్చున్న ఫలము కలుగునె మౌనీ!

కన్యా శుల్కము పేరిట 
నన్యాయము జరిగే పూర్వ మతివలకిలలో;
ఏ న్యాయ మిప్పుడున్నది?
కన్యల పాలిట శని వరకట్నము మౌనీ!

'మతపిచ్చి'యు, 'కుల పిచ్చి'యు
వెతలను కలిగించె నేడు విపరీతముగా;
గత చరిత మెరిగి కూడా
'కుతికల'వరకెందు కింత క్రోధము మౌనీ!

పరమేశుడు గుడి లోపల 
గిరిగీసు కొనుండ డమ్మ ఖేదము బాపన్;
గురినిల్పు హృదయముండిన 
పరమేశుని జూతు వన్ని ప్రాణుల మౌనీ!

ద్వేషింపకు పరమతమును,
దూషింపకు కులము పేర దుష్టుం డైనన్,
వేషాలకు విలువివ్వకు,
రోషావేశాల కెపుడు  లొంగకు మౌనీ!


'అల్లా' 'రాముడు' 'జీససు'
కల్లా కపటములు లేని కరుణామయులే;
ఎల్లరి మూలం బొకటని
వెల్లడియగు, తెలియ లేరె? వెర్రా! మౌనీ!

పతిపోయిన స్త్రీలందరు
గతిలేదని యేడ్చినంత కరుగుదురె జనుల్;
వెతలకు వెరువక నిలబడి
బ్రతుకును సాగింప తమకు భావ్యము మౌనీ!


పురుషాధిక్యపు సమాజపు
షరతులు మరి సాగ వలదు శాస్త్రము పేరన్;
తరుణుల రెండవ స్థానము
సరికాదని సమమటంచు చాటుము మౌనీ!

అబలను నేనని క్రుంగకు;
కబళించును లోక మెల్ల కర్కశరీతిన్;
శబలను నేనని ధైర్యము
నిభిడీ కృతమైన జయము నీయది మౌనీ!

మన ఆచారపు, పెండిలి
మన దాంపత్యంపు సరళి, మన జీవనముల్
కనమెందు విశ్వమందున
మనసుకు ప్రాధాన్యమిచ్చు మార్గము మౌనీ!ప్రేమయె దైవం బిలలో;
ప్రేమయె సుఖ జీవనమ్ము పెన్నిధి సుమ్మీ!
ప్రేమించు మెల్ల వారిని 
భూమండల మంత శాంతి పొందును మౌనీ!

శిబి చక్రవర్తి త్యాగము,
అభిరాముని పితృవాక్య మందభిరుచియున్,
ప్రభువు హరిశ్చంద్రు నిజము,
విభుకర్ణుని దాన గుణము విలువలు మౌనీ! 

గౌతమ బుద్దుని కరుణయు,
జాతికి పితయైన గాంధి శాంతి, అహింసల్
మాత థెరిస్సా సేవలు
నీతర మాదర్శములుగ నిలుపుము మౌనీ!

ధన బలము కలుగు వారలు
మన నీయరు బీదవారి మంచిగా నిలలో;
పనిగట్టుకు పడ ద్రోయరె?
నినదించుము దీనికెదురు నీవును మౌనీ!

మనిషి మరణము తథ్యము;
పనిచేయుచు నుండవలయు బ్రతికిన నాళ్లన్
పనిమానుట యన మరణము
కనుకనె మని మానతగదు జ్ఞానికి మౌనీ!

మనమున కలిగెడు దుఃఖము
క్షణమున పోగొట్టు మందు కనుగొనె గురువుల్
కనగానదియే 'వర'మీ
జనకోటికి "ధ్యాన"యోగ సాధన మౌనీ!

అదిమి పెట్ట నెంచ నటకెక్కి కూర్చుండు
బుజ్జగించు కొలది బుసలు కొట్టు;
లెక్క చేయకున్నచక్కగా దరిజేరు,
మనసు, చంచలమ్ము వినవె; చైతు!

అడ్డ దారులందు నక్రమార్జన చేయ
ప్రాకులాడుచుండు పాడుబుద్ధి;
చక్కనైన దారి సాగనెంచెదవేని,
సజ్జనాళి మైత్రి సలుపు; చైతు!

అమ్మ-నాన్నకన్ననారాధ్యు లెవరయ్య?
ఉపిరుండు వరకు కాపుకాచి,
నీదు వృద్ధి కొరకు నిరతమ్ము తపియించు,
త్యాగ శీలురయ్య; తలపు; చైతు!

ఆశతోడనుండు టవనిలో  సహజమ్ము;
అతిగ నాశపడిన బ్రతుకు చెడును;
శక్తి నరసి పనుల జరుపుట ధర్మమ్ము
మోయలేని పనికి పోకు; చైతు!


ఆత్మ తృప్తి మించు నైశ్వర్య మున్నదే?
సహన పరుని గెలుచు శక్తి గలదె?
పరహితమ్ము కన్న పరమార్థ మేముండె?
నిజముకన్న నేది నిలుచు? చైతు!

ఊర కుక్కవోలె నూరెల్ల తిరుగుట
భూమి భారమౌను పుట్ట చేటు;
పరుల సేవ మాట భగవంతు డెరుగులే!
పరుల కెపుడు కాకు బరువు; చైతు!

ఎన్ని నీతులైన నెదుటి వానికె గాని,
తనకు కూడ నంచు తలపడసలు;
నీకు చెప్పుచున్న నీతులు సకలమ్ము
చెప్పు నాకు కూడ చెందు; చైతు!

గుడుల చుట్టు తిరిగి, గుంజీలు తీసిన
కడుపు పండు మాట కల్ల గాదె?
రావి చెట్టు కాదు, రక్ష రేకులు కాదు,
లోప మెరుగ కలుగు పాప; చైతు!

చెడ్డవారి తోడ స్నేహమ్ము మనకేల?
దొడ్డ గుణము లెల్ల తొలగిపోవు;
మంచివారి తోడ మసలిన చాలు లే,
తెలియకుండ చెడుగు తొలగు; చైతు!


ధనము ధాన్యముండి దాత్రుత్వమే లేక
కూడబెట్టు వాడు కూళయగును;
పైకిపోవు వేళ పడి వెంట రావు లే!
దాన గుణము తోడ దనరు; చైతు!

ధ్యానమైన గాని, దైవ ప్రార్థన గాని,
మనసు మంచి వైపు మరలు కొరకె;
పిచ్చి ఊహలందు విహరింప బోకుండ
స్థిరత కలుగ చేయు వరము; చైతు!

నీతి కొరకు చచ్చు నేత యొక్కడు లేడు;
ప్రాణ మిత్తు ననును పదవియన్న;
పదవి లేదటన్న పలుకులే వికటించు;
విలువలన్నిగాలి గలిసె; చైతు!         

నీతికొరకు నెవరు నిలిచినా ధైర్యాన
పాతి పెడుదురతని పట్టుబట్టి
నీతిలోన పుట్టి నీతిని నిలబెట్టు
జాతి మనది; కృషిని సలుపు; చైతు!

జనన మంది నరుడు చనిపోవు లోపున
జ్ఞానమబ్బు నెపుడొ, కాని వేళ;
అబ్బ జ్ఞాన, మతని యంత మందున గాక
అది నబ్బ, మంచి యగును; చైతు!

"పెద్ద వారి మాట చద్ది మూట" యనిరి;
పెద్దలన్న నిపుడు పెదవి విరుపు;
హద్దులన్న వారి కది యిష్ట ముండదే!
స్వేచ్ఛ యెక్కువైన చెడుటె; చైతు!

భరతదేశ మన్న గురుపరంపర, యోగ
పుంగవులకును, ఋషి పూజ్యులకును
నెలవు; విశ్వమందు వెలసిన మతముల
సమత, గోరుకొనెడి జాతి; చైతు!

మనసు మంచిదైన మంచి యే కనిపించు;
మలినమైన మనసు తెలివి దప్పు;
తెలివి కలుగ మనసు మలినమ్ము తొలగును;
మంచి వైపు తాను మళ్ళు; చైతు!

రాజకీయ మందు రగిలిన స్వార్థమ్ము
అన్ని రంగములను నావహించే;
ప్రభుత మార్గమిపుడు ప్రజల కాదర్శమ్ము
ప్రభుత కంచే మేసె;పట్టు; చైతు!

సృష్టి చేయుచున్న శిక్షలు చాలవా?
ఉగ్రవాదమేల? ఉద్యమమ్ము?
భయపు టంచు లందు ప్రజనుంచు క్రూరత్వ
మే, మతమును నేర్పదిలను చైతు!

స్త్రీల కెచట పూజ చేతురో యచ్చట
దేవతాళి వచ్చి తిరుగునంట!
బడిత పూజ చేయు భర్తల యిండ్లలో
తిరుగ రాదొ! మంచి జరుగు: చైతు!

సంఘ మందు బ్రతుక, సహనమ్ము కావలె;
యుద్ధ మందు శౌర్య బుద్ధి వలయు;
యుద్ధమేల మనకు పెద్ద లందరి బుద్ధి 
నవ్యమైన, దొరుకు శాంతి; చైతు!       

No comments:

Post a Comment