-->

Thursday, July 7, 2011

My literary world





డా. తలతోటి పృథ్వి రాజ్


హైకూలు




బాల్య స్మృతుల

కలికితురాయి-

తురాయి పూలు





సాలెగూడులో

చిక్కుకుంటున్న కీటకాలు-

అబలలు




హృదయ కలశం

గూడుకడుతున్న మీగడ-

బాధలు





రాకపోకల మధ్య

అందమైన ఇంద్రధనుస్సు

జీవితం!




ఎడతెరిపిలేని వర్షం

మధ్యమధ్య ఓ క్షణం విరామమిస్తూ

కప్పల,కీచురాళ్ళ రొద





ఒరిగిన చెట్టు

ప్రవాహంతో ఆడుతోంది-

పూల పడవల్ని వదులుతూ...




పెరట్లోని మామిడి చెట్టు

పరిచయం చేసింది

పసిదొంగల్ని





మండుటెండలు.

కొంగలకు

వేట సుగమం చేస్తూ




మట్టైన

చిన్ననాటి స్నేహితుడు

ఆవహించిన వార్ధక్య వైరాగ్యం





బీడు భూముల మధ్య ఒరిగిన

టెలిఫోన్ స్తంభం వైర్లపై పిట్టలు

సంధ్యా సమయం.




దారి ప్రక్కే ఈత గెలలు

కోసుకుందామంటే

ఆగని రైలు





ఎందరో కాలు మోపెళ్లిన

భూమండలం.

అందరూ వ్యోమగాములే!




ఏడాది సమిష్టి కష్టార్జితం.

వడ్ల బండిని సంతోషంగా లాగుతూ

ఎడ్లు...





చెరువు.

జనావాసానికి దూరంగా

నిండా కలువలు




నేలపై చిందరవందరగా

పగిలిన అద్దం ముక్కలు

మడుగులు.





పచ్చని పొలాలు...

దాన్యరాశులకై విష సర్పాలు

-దళారులు.




అంధులు...

నల్లద్దాల వెనుక ఆవిరయ్యే

కన్నీటి నదులు...





ఈ దోవలో ఎందరో

అపరిచిత పథికుల పరిచయం

కడకు తప్పని ఒంటరి ప్రయాణం




ఎలా వదిలి వెళ్ళను...

ఇహలోక బంధాల్నిమించి

ప్రకృతి అనుబంధం!





జీవిత నావకు

మరామత్తు

కాలం వింత వైద్యుడు




ముత్యాల

సాలెగూడు

-హేమంత ఋతువు.





నేలపై చిందర వందరగా

పగిలిన అద్దం ముక్కలు

మడుగులు.




ఎన్ని మేల్కొన్నాయో

ఎన్ని నిద్రలోకి జారుకున్నాయో...

-జనన మరణాల పురిటిశాల పుడమి





ప్రతి ప్రాణికి నిర్దేశిత మార్గాలు.

పొద్దుబోయినా

-ఏ పక్షీ దోవతప్పకుండా గూళ్ళకి




ఎండకాస్తోంది వర్షం వెలిసి.

వలపు విహారంలో

తూనీగా తోకన తూనీగ





తాను ప్రకృతిలోకి...

ప్రకృతి తనలోకి

యాత్రికుడు!




మహా నగరం;

ఆవాసాలలో కపోతాలు

విహంగ వీక్షణలో గ్రద్దలు





సుఖ,దుఃఖాలు

మనవ ప్రకృతి

వసంత,శిశిరాలు




చల్లగా వీస్తోంది...

నింగిలో కాడలేని విసనకర్ర

-గ్రీష్మ పౌర్ణములు





బోటనీ విద్యార్థుల పుస్తకాల్లో హెర్బెరియం

పిల్లల పుస్తకాల్లో నేమలీకలు...

చిన్ననాటి జ్ఞాపకాల బ్యాంక్ బ్యాలన్స్




దేవాలయంలో

పావురాళ్ళ గూగూలు...

నిస్వార్థ విన్నపాలు!





పూరిపాక

మెత్తబడుతూ వర్ష సంగీతం

-ముసురు.




ఆటల్లో ఇల్లే మరిచే పిల్లోడు

తల్లి కొంగు వదలడం లేదు...

-ఉరుములు...మెరుపులు...





చెక్కు చెదరని చెరశాలలు.

సమరయోధుల

కన్నీటితో తడిసినవి కదా




ఎవరు గంపకెత్తు కెళ్ళి పోయారో

ఒక్క నక్షత్ర కుసుమం లేదు

- అమావాస్య





చుట్టూ చెట్లు లేవు...

విశాల దీవి నడుమ మనిషిలా నేను

సుస్వరాలకు దూరంగా...




చెరువు విస్తళ్ళు పరిచి

కనులకు వడ్డిస్తోంది

కలువల అందాల విందు





నరకబడుతున్నాయి

పిలకలేస్తూ-గెలలు కాస్తూ

-ఆశల అరటిచెట్టు మనిషి




ప్రేమ మాంద్యం

కుటుంబ వ్యవస్థ

చిన్నాభిన్నం





మనిషి గుండె గుప్పెడే...

అగ్ని పర్వతంలోలా

ఆటం ఆలోచనల లావా!




వర్షిస్తూ దు:ఖ మేఘాలు

సగటుమనిషి హృదయాకాశంలో

నిట్టూర్పుల ఉష్ణవాయువు





ప్రతిఘటించింది జంతువైనా!

పట్టి పీడించే నాయక మొసళ్ళకు

ప్రాణాలర్పిస్తూ ప్రజ




తీపి గురుతులు;

విడిది గ్రామానికి వలస పక్షుల

ఖాళీ గూళ్ళూ - ఈకలు





పూలమ్మే అబ్బాయ్

వెళ్ళిన జాడలు వీధుల్లో

- గ్రీష్మ ఋతువు




ఉదయ కాలపు ఎండలో

కొబ్బరి నూనె టిన్

- శీతాకాలం

No comments:

Post a Comment