-->

Friday, December 10, 2021

"బాల్చీలో చంద్రోదయం " అనే ఇస్మాయిల్ కవితా సంపుటిలోని కొన్ని కవితలు ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


నవంబర్ 25, ఇస్మాయిల్ గారి వర్ధంతి సందర్భంగా ఇస్మాయిల్ గారి "బాల్చీలో చంద్రోదయం" అనే కవితా సంపుటి నుండి వారి కొన్ని కవితల్ని ఈ వీడియోలో చెప్పుకుందాం!  భావకవి కృష్ణశాస్త్రి శిష్యుడైనా, చెట్టు కవిగా పేరు పొందిన వాడైనా, హైకూ కవితా ప్రక్రియ వైపు మొగ్గినా; ప్రాథమికంగా ఇస్మాయిల్ ప్రకృతి ప్రేమికుడు. ఎన్నో హైకూ సంపుటాలకు ముందుమాట వ్రాసిన విమర్శకునిగా గుర్తింపు పొందారు. హైకూ కవి గా కప్పల నిశ్శబ్దం, నత్త ప్రణయ యాత్ర అనే హైకూ సంపుటాలు కూడా వారు తీసుకొచ్చారు.
ఇస్మాయిల్ గారి వర్ధంతి సందర్భంగా మినీ కవితల్లాంటి వారి సంక్షిప్త కవితలు కొన్ని చెప్పుకుందాం!

 మొదటి కిటికీ అనే కవిత గురించి చూద్దాం!
నాలుగు గోడల మధ్య ఉండేది నిశ్శబ్దం, కనిపించేవి గదిలోని వస్తువులు.  కిటికీ తెరిచి చూస్తే కనిపించే అందమైన మొహమే ప్రకృతి కాంత. కవిత ముగింపు కిటికీలు ముగియడానికి కాదు; తెరవడానికి కూడా! అనే మాటలు ఆకట్టుకుంటాయి.

కిటికీ 

పాత కిటికీ తెరిచి
బూజు దులుపుతుంటే
ఒక అందమైన మొహం
తళుక్కున మెరిసింది.
ఇక ఈ కిటికీ
ఎప్పుడూ మూయకూడదు.

కిటికీలు మూయటానికి కాదు.
తెరవటానికి.
29.10.95
---------------------

 ఇస్మాయిల్ గారి మరో కవిత చోర ప్రియుడు. గుండ్రంగా... నిండుగా... ప్రకాశవంతంగా ఉండే చంద్రుడిపై మనసు పడనివారెవరు? అందుకే "చోర ప్రియుడని"కవితా శీర్షిక పెట్టారు ఇస్మాయిల్.

చోర ప్రియుడు

పెరటి గోడ దుమికి
ప్రవేశించాడు చంద్రుడు.
వీడెవడు ?
ప్రియుడా, చోరుడా ?
రెండూను.
రాత్రంతా నా కళ్లు చుంబిస్తాడు,
నా నిద్ర దొంగిలిస్తాడు.
30.10.95
---------------------
 ఇస్మాయిల్ గారి మరో కవిత పాత ఇల్లు. మనిషి ముసలి అయినట్టే; ఇల్లు పాతదై పాడైపోవడం ముసలిదైపోవడమే. పాడైపోయిన ఇల్లుని కప్పుకుని కొత్తది చేసుకున్నట్లే కమ్ముకుని సడలిన యవ్వనంతో అలుముకున్న వార్ధక్యాన్ని తొలిగించుకోవాలనుకోవడం, పునర్జీవం పొందాలనుకోవడం కొత్తగా నిర్మింపబడాలనుకోవడమే. కవి ఈ కవిత ద్వారా ఆశిస్తుంది అదే!

పాత యిల్లు

మా ఇల్లు ముసిలిదైపోయింది
విప్పేసి కొత్తిల్లు కడదామనుకుంటున్నాం.
నేనూ ముసలాణ్ణయిపోయాను,
ఎవరేనా నన్ను విప్పేసి
కొత్తగా కడితే బాగుణ్ణు.
2.11.95
-------------------------
 ఇస్మాయిల్ గారి మరో కవిత ఆలస్యమైందని. ఒక్కో రోజు, ఒక్కో సమయంలో, ఒక్కో రంగులో, ఒక్కో ఆకారంలో చంద్రుడు దర్శనమిస్తాడు. జాబిల్లి నెలవంక నుండి పౌర్ణమి వరకు రోజురోజుకీ పరిణామ క్రమాన్ని బట్టి పగటివేళల రాత్రివేళల ఒక్కోసారి దోసపండు పసుపుపచ్చగా, మరొకమారు తెల్ల చామంతి పూవులా ఆకర్షించే శక్తి చందమామది. అందుకే ఇస్మాయిల్ ఇలా రాశారు

ఆలస్యమైందని

రాత్రి
ఆలస్యమైందని విసుక్కుంటూ
ఇంటికి తిరిగొస్తుంటే
దారిలో చంద్రు డుదయించాడు.
ఇక
ఎంత ఆలస్యమైనా పరవాలేదు.
5.11.95
------------------
 వయసు శరీరానికే గానీ మనసుకు కాదని ఎందరో కవులు వారి కవిత్వం ద్వారా.‌. వారి శృంగార కవితల ద్వారా రుజువు చేశారు! కుర్రోళ్ళ ప్రేమ లేఖల్లాంటి ఇస్మాయిల్ గారి రెండు ప్రేమ కవితలు చూద్దాం!

ప్రేమ గీతం -1

ఆక్టపస్ నైతే బాగుణ్ణు నేను :
అష్ట బాహువులతో నిన్ను
వాటేసుకుందును.

రాక్ పక్షినైతే బాగుణ్ణు నేను :
తన్నుకుపోయి నిన్ను
రత్నాల కోనలో
జారవిడుద్దును.

సింహాన్నైతే బాగుణ్ణు నేను :
కబళించి నిన్ను
బంగారు యెండలో పండుకుని
రక్త వర్ణ స్వప్నాలు
కందును.
30.12.95
--------------
ప్రేమ గీతం - 2

నీ బాహువుల్లో నన్ను బంధించి
నా దేహానికి కొత్త ద్వారాలు
తెరుస్తావు.

నీ వేళ్ల మంటల్తో నన్ను కాల్చేసి
నా దేహానికి కొత్త చర్మం
తొడుగుతావు.

నీ పెదిమల సంధ్యలో నన్ను అస్తమింపజేసి
నా దేహంలో కొత్త ఉదయాల్ని
చేదుతావు.

నీ కత్తి నాలికని నా నోటిలో నాటి
నా దేహంలో కొత్త జీవవృక్షాన్ని
మొలిపిస్తావు.
31.12.95No comments:

Post a Comment