-->

Friday, December 10, 2021

గురజాడ అప్పారావు గారి "మెటిల్డా" కథానిక ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

 

  సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసే సాహిత్యమే నిజమైన సాహిత్యమని గ్రహించి గురజాడ రచించిన కథానికే ఈ "మెటిల్డా".  సామాజిక రుగ్మతగా, దురాచారంగా నాటి సమాజంలో నెలకొని ఉన్న బాల్య వివాహాలపై సంఘసంస్కర్తలుగా, రచయితలుగా వీరేశలింగం... గురజాడ మొదలుగున్నవారెందరో ఎన్నో రచనలు చేశారు.

 గురజాడ తన ప్రాంతంలో విస్తరించిన "కన్యాశుల్కం" వంటి దురాచారంపై "కన్యాశుల్కం" వంటి నాటకాన్ని రాయడమే కాకుండా; కన్యాశుల్కం వంటి దురాచారం లోని భాగమైన వయో భేదం తో జరిగే వివాహాల గురించి రాసిన కథ "మెటిల్డా"

కట్టె, కొట్టె, తెచ్చే అనేలా ఈ కథ గూర్చి చెప్పాలంటే..‌‌‌.
ప్రతిబంధకాలు.... ఆంక్షలు... అవమానాలు..‌. వయోభేదంతో కూడిన తన సంసారంలో నిత్యం అనుమాన పక్షిలా చూసే భర్తను నుంచి తన జీవితాన్ని స్వేచ్ఛగా మలచుకుని, భర్తలో మార్పు తెచ్చుకుని జీవితాని సాగించిన గుణవతి కథ  "మెటిల్డా".

     కథని కొంచెం విస్తరించి చెప్పుకుందాం:

 కొంతమంది కాలేజీ విద్యార్థులు మేడ ఇంట్లో ఉంటూ ఎం.ఏ. పరీక్షలకు చదువుకుంటూ ఉండే వారు. ఒక రోజు రామారావు తన మిత్రుడికి సైగ చేసి పిలిచి పక్కనున్న బంగ్లాలోని సొగసైన, బంగారు ఛాయ మేని గల మెటిల్డా ను చూసీ చూడనట్లు చూడమని చూపిస్తాడు. అంతేకాదు; మరెప్పటికీ ఆమె వంక చూడవద్దని కూడా హెచ్చరిస్తాడు‌.  కొన్నాళ్ళపాటు రామారావు చెప్పిన మాటకు కట్టుబడి కొన్ని రోజులు
ఉండగలిగాడు గానీ; ఆతర్వాత రామారావు లేని సమయంలో ఆతని మిత్రుడు ఆమెను చూడడానికి అనేక మార్గాలు వెతుక్కున్నాడు... ప్రయత్నించాడు.

 మెటిల్డా భర్తను పులి..., ముసలి పులి‌... అని ఆ విద్యార్థులు పేరు పెట్టారు. అతనికి 55, 56 ఏళ్ళ వయసు ఉంటుంది. వయసులోని అంతరాన్ని బట్టి కాకుండా, అందాన్ని బట్టి కూడా భార్యపై అనుమానం పెంచుకునే కొందరి మగాళ్ళెలా గే మెటిల్డా మొగుడూ మెటిల్డాను గుమ్మంలోకి రాకూడదని ఆంక్షలు విధిస్తాడు. తన భర్త అక్క పెట్టే  మానసిక హింసనూ మెటిల్డా భరిస్తూ వస్తుంది.

ఒక రోజు మెటిల్డాని చూడడం కోసం మెటిల్డా ఇంటివైపు ఆమె వైపు చూస్తూ రామారావు మిత్రుడు చీమలా మెల్లగా పోతుండగా గుహలో నుంచి పులి పైకి దూకినట్లు వచ్చి తన ఇంటి లైబ్రరీలోనికి రామారావు మిత్రుడ్ని మెటిల్డా భర్త తీసుకొని పోయి
 "కావాలనే తన భార్యను చూశాడని...,  తన మొహం కంటే తన భార్య మొహం బాగుంటుందని చూశాడని! .‌..,  తనకంటే తన పెళ్ళాం అందంగా ఉంటుందని..‌‌‌.. ఇలా అనేక అనుమానాపు ప్రశ్నలు అడిగి కసిరి పంపిస్తాడు. మెటిల్డా భర్త తీరుకి దుఃఖ్కిస్తుంది.

 రామారావు మిత్రుడు తన ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకోగానే మెటిల్డా ఇంటిలోని ముసలి బ్రాహ్మణుడు ఇచ్చిన చీటీని అందుకుని చదువుతాడు. ఆ చీటీలో మెటిల్డా వేడుకున్న మాటల్ని గ్రహిస్తాడు. మెటిల్డాను కాపాడాలి అనుకుంటాడు. అతని స్నేహితుల వల్ల మెటిల్డా దాంపత్య జీవితానికి ముప్పు ఏర్పడకుండా చూడాలి అనుకుంటాడు. ఆమె తనను కోరుకుంటే పట్టం కట్టనా అని కూడా అనుకుంటాడు రామారావు స్నేహితుడు‌. రామారావు వచ్చిన తర్వాత జరిగిన కథంతా చెబుతాడు. రామారావు లోకజ్ఞానం కలవాడిగా మిత్రునికి నీతి వాక్యాలు చెప్తాడు. "నీకు మెటిల్డా మీద మనసు గట్టిగా లగ్నం అయింది. అది కూడని పని " అని కూడా తన స్నేహితుడ్ని గమనించి వారిస్తాడు రామారావు. మెటిల్డా భర్త , తన భార్య పట్ల తనకున్న అనుమానాన్ని తొలగించుకుని ఒకరోజు..‌‌‌.. "నాకు నీవూ, నీ స్నేహితుడు రామారావూ మరొక గొప్ప వుపకారం చేశారు. మీ మాటల వల్ల, చేష్టలు వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకున్నాను", "..  నా పెళ్ళాం బహు బుద్ధిమంతురాలు" అని గ్రహించిన విషయాన్ని చెబుతాడు. భార్య మెటిల్డా చేత ఆమె భర్త రామారావుకి, ఆతని స్నేహితునికోసం కాఫీ తెప్పిస్తాడు. మెటిల్డా, ఆమె భర్త సరాగానికి రామారావు మిత్రుడు సంతోషిస్తాడు .
             
                                                             /////////---------//////

గురజాడ వారికి తెనాలి రామకృష్ణుడు గురజాడవారికి పూనాడో, ఏమో గానీ; మెటిల్డా అనే తన కథలో గురజాడ మెటిల్డా భర్తకూ, మెటిల్డా అందాన్ని తనివితీరా చూడాలనుకునే రామారావు స్నేహితునికీ పేర్లు పెట్టలేదు. నిగమశర్మ అక్కకు పేరు లేనట్లే‌... అనుమానపు మెటిల్డా మొగుడికి పేరు ఎందుకు అనుకున్నాడో ఏమో! అందుకేనేమో.‌‌.. గురజాడ గారు ఆ అనుమానపు మొగుడికి పేరు పెట్టలేదు! 

కథా చిన్నదే అయినా విలువలతో కూడిన సంభాషణలు కథ మధ్య మధ్యలో పాత్రల ద్వారా పలికించారు గురజాడ గారు. మెటిల్డాను చూసిన మిత్రుడు రామారావుతో మెటిల్డాను ఉద్దేశించి:
" మంచి మనిషిషా,  చెడ్డ మనిషిషా" అని అడిగిన దానికి "మంచిదయితే మనకేలా, ఒకర్ని మంచి కాదనడానికి మన మంచేం తగలాడుతుంది. అని రామారావు బదులిస్తాడు. మన కంట్లో దూలాన్ని గుర్తించగలవాడు ఎదుటివారి కంటిలోని నలుసులు గురించి వెదికే ప్రయత్నం చెయ్యరు. 

 ఈ కథలో గురజాడ మెటిల్డా భర్త వయసుని పేర్కొన్నాడు గాని మెటిల్డా వయసును ఎక్కడా పేర్కొలేదు. విద్యార్థులు మెటిల్డాపై ప్రదర్శించే వలపునుబట్టి, ఆమె అందచందాలను రచయిత ప్రస్తావించిన దానినిబట్టి ఆమె భర్త వయస్సు కంటే బాగా చిన్నదాని గ్రహించవచ్చు. 

 దాంపత్య జీవితం నమ్మకంతో సాగించాల్సింది. మనిషికి ఆకలి ఎంత ముఖ్యమో... శారీరక సుఖం కూడా అంతే! భర్తగా భార్యకు సుఖపెట్టాలి. శారీరకంగా సుఖపెట్టలేని ఏ భర్త అయినా మెటిల్డా భర్తలాగే భార్యను అనుమానిస్తాడు, అవమానిస్తాడు! ఈ కాలంలో అయితే పరాయివారితో రంకు కట్టడానికి కూడా వెనుకాడని భర్తలున్నారు! అనుమానంతో చంపే భర్తలూ ఉన్నారు.  ఈ ఆలోచనలోనుంచి మాట్లాడిన మాటలే ... "అయితే ఈ ముండను తీసుకుపో; నీకు దానం చేశాను. తీసుకుపో ! నాకు శని విరగడై పోతుంది" అని రామారావు మిత్రునితో మెటిల్డా భర్త అంటాడు.     

ఈ కథలో అతి కీలకమైన వాక్యాలు ఏమిటంటే.... చీటీలో మెట్ల రాసిన మాటలే! " మీరూ, మీ నేస్తులూ నా కాపరం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను ? తలవంచుకు మీ తోవను మీరు పోతేనే బతుకుతాను., లేకపోతే నా ప్రారబ్ధం" అని రాస్తుంది.   చెడు తలంపులు, నడవడిక గల ఇల్లాలైతే ఎప్పుడో ముసలి భర్తను మభ్య పెట్టి అక్రమ సంబంధాలు సాగించేది. కానీ మెటిల్డా అలా చేయలేదు.  గుణవతిగా శీలవతిగా, భర్త అనుమానంతో అవమానించినా, శారీరక సుఖాన్ని ఇవ్వకున్నా అతనితో కలిసి బతకాలని అనుకుంటుంది. కనుకనే పై విధంగా ఆ విద్యార్థికి ఆ లేఖ రాసింది. లంజా, ముండా అని ఎవరి ఎదుట తిట్టాడో వారి ఎదుటే మెటిల్డా భర్త "నా పెళ్ళాం యోగ్యురాలు, బుద్ధిమంతురాలు అని గ్రహించి గొప్పగా చెప్పుకుంటాడు. 

 కథా రచయిత  రామారావు పాత్రల, ఆతని మిత్రునికి చేసే హితబోధలో కూడా "ఆలు మొగళ్ల దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్యగోచరాలు,మధ్యవర్తులు , కాపరం చెక్క చేదావని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు."అని హితబోధ చేయిస్తాడు. మెటిల్డా ను అనుమానిస్తాడేగాని ఆమెకు ఆయింటిలో ఏ లోటు, హాని లేదని రామారావు చెప్పే తీరుకూడా గురజాడ పాత్రలను మలిచే, కథను చక్కగా నడిపించే శైలికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

సంక్షిప్తంగా చెప్పడం సామాన్యమైన విషయం కాదు.  కథానికా గొప్పతనాన్ని రచనా శైలిని సామాజిక ప్రయోజనాన్ని గురజాడ గారు ఈ కథ ద్వారా చాలా చక్కగా చెప్పారని మనం గ్రహించవచ్చు. 


No comments:

Post a Comment