ఈ గేయాన్ని దాశరథి సామాజిక స్పృహతో రాశారు. వాచ్యార్ధంలోనే అన్ని పాదాలను అర్ధం చేసుకోకూడదు.
ఈ పాఠం సుప్రసిద్ధమైన పాట. అనాది మానవ చరిత్ర క్రమ పరిణామాన్ని అతితక్కువ పాదాల్లో చిత్రించిన అసాధారణ గేయమిది. మొదటి చరణం విజ్ఞానశాస్త్ర సారం. భూమి, మనిషి పుట్టుకల తీరును వివరిస్తుంది. రెండో చరణం సాంఘిక చరిత్ర సారం. రాజరిక యుద్ధాలు, శ్రమదోపిడీ రంగును వింగడిస్తుంది. తర్వాతి చరణాలు కవి కలలసారం. భావుక ప్రపంచాన్ని మరో మానవ సమాజాన్ని మన ముందుంచుతాయి. అన్నార్తులుండని నవయుగం, కరువుల్లేని కాలాలు, కలగంటాడు కవి. " పేదల దు:ఖం, కులమతాల కొట్లాటలు, పసిపిల్లల భవిష్యత్తు' సున్నితమైన కవికి అన్నీ ప్రశ్నలే. ప్రతిదీ తెగని సమస్యే. ప్రశ్నల రూపంలో గేయం సాగినా ఆ ప్రశ్నలకు తావుండని మంచిలోకం, మానవతా సమాజమే దాశరథి లక్ష్యం.
"ఆచల్లని సముద్రగర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భానువు లెందరో?
భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవరూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో?
శ్రమజీవుల పచ్చి నెత్తురులు
త్రాగని ధనవంతు లెందరో?
అన్నార్తులు అనాధలుండని
ఆనవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటక మంటూ
కనుపించని కాలాలెపుడో?
అణగారిన అగ్ని పర్వతం
కని పెంచిన "లావా" యెంతో?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో?
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవిగుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?
కులమతాల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
భారతావని బలపరాక్రమం
చెర వీడేదింకెన్నాళ్ళకో?
No comments:
Post a Comment