-->

Friday, December 10, 2021

దిగంబర కవిత్వం - డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

 

1960లో బెంగాల్లోని "హంగ్రీ యంగ్ మెన్" సాహిత్య ధోరణిలాగానే దిగంబర కవులు వినూత్న కవితా ధోరణిని ప్రారంభించారు. అందరూ యువ కవులే! 
నగ్నముని (ఎం.హెచ్. కేశవరావు), నిఖిలేశ్వర్ (మాధవరెడ్డి), జ్వాలాముఖి (వీరరాఘవాచారి), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు) దిగంబర కవులు.
   సంఘ దుస్థితికి పిచ్చెత్తి రోదించి ప్రవచించిన కవిత్వమే దిగంబర కవిత్వం. అంతేకాదు; ఇజాలతోనూ, మతాలతోనూ సంబంధం లేని కవిత్వం దిగంబర కవిత్వం. 

సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై... లేవెట్రీగా మారిన సమాజంపై ధ్వజమెత్తి రాసిన కవిత్వం దిగంబర కవిత్వం. అందుకే ధన పిశాచాలు గా మారిన బాబాలు గురించి, మతోన్మాదులు , ప్రభుత్వ తొత్తులుగా మారిన కళాకారులు, కళలతో వ్యాపారం చేసే కళాకారులపై,  సినీ హీరో ల మీద ఇలా అనేకులపై కవిత్వం రాశారు. అందుకే-
" దిగంబర కవులు 
ముళ్ళ గులాబి పువులు 
ఆగ్రహ భార్గవు
ప్రభువుల శిరస్సులపై పరశువులు
పగబట్టిన చక్షుశ్ర్శవులు" అని శ్రీశ్రీ అంటారు.

 నేటి చెత్త వ్యవస్థను సమూలంగా తొలగించి , నిత్యనూతన, మహత్తర వ్యవస్థ కోసం తపన పడుతున్న వాళ్ళే దిగంబర కవులు. మంచి కోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటము లేని చిరునవ్వులు చిందించే సమాజం కోసం ఎలుగెత్తి నిలిచి కవిత్వం కురిపించిన కవులే దిగంబర కవులు.

1965 మే 6న మొదటి కవితా సంపుటి ని హైదరాబాదులో ఆబిడ్స్ సర్కిల్లో నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుని చేత ఆవిష్కరింపజేశారు దిగంబర కవులు.

 1966 డిసెంబర్ 8న, రెండవ సంపుటిని  విజయవాడ గవర్నర్ పేట సెంటర్లో రోడ్డుపై అర్ధరాత్రి
ఒక హోటల్ క్లీనర్ ఆవిష్కరింపజేశారు.

 1968 సెప్టెంబర్ 14న మూడో సంపుటిని విశాఖపట్నంలో ఎడమనూరి యశోద అనే బిచ్చగత్తె ద్వారా ఆవిష్కరింపజేశారు.

మూడు సంపుటాలలోని కవితలు మొత్తం 93 అయినా సాహిత్యలోకం అందర్నీ తమవైపు తిప్పుకున్న కవిత కవితధోరణి ఈ దిగంబర కవిత్వం.

"మానసిక దిగంబరత్వం కోసం, నిత్యసచేతన ఆత్మ స్ఫూర్తి. జీవించడమే మా ఆశయం - శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో పడివున్న ఆరాటాన్ని, అసంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో
వ్యక్తీకరించి, 'నూతన విశ్వాసాన్ని' ఆశను కలిగించాలని మా తత్పరత" అని ప్రకటించారు దిగంబర కవులు.

“ఈ దేశంలో , ఈ భూగోళంలో ఊపిరి పీల్చే ప్రతిమనిషి ఉనికి కోసం తపనపడి, అతని భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చెత్తి ప్రవచించిన కవిత -”
అని దిగంబర కవులు చెప్పుకున్నారు

'మేం దిగంబర కవులం, మంచి కోసం , మనిషిలోని, నిప్పులాంటి నిజమైన మనిషికోసం, కపటం లేని 'చిరునవ్వులు చిందించే సమాజం' కోసం అహోరాత్రాలు ఆరని అగ్నిలో నడచిన
ఆత్మలలోంచి పలుకుతున్న గొంతుకలం.” అని దిగంబర కవులు తాము ఎందుకు కవిత్వం రాస్తున్నారో చెప్పారు.

"సమస్యలకు లోతులు తీసి
సామాన్యుల గోతుల్లో తోసి
కాలాన్ని గాలంగా వాడుకుంటూ
నిర్లిప్తతలోనే నిప్పును రాజేస్తూ
అనంత అమాయక మానవజాతిని
అనాదిగా అధ్వాన్నంగా పరిపాలించే
పిడికెడు మేధావులకు
పిరామిడ్లు కట్టాలనుంది " అంటారు జ్వాలాముఖి.

"నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే 
నిద్రపోనియ్యి, లేపకు...
పండిత వార్తా! రికార్డులా నోరు త్రిప్పకు,
నవసృష్టిని కాలదన్నకు
భావకవుల నపుంసక హావభావాలకు సవాలు
అభ్యుదయ కవీ నల్లమందు తిని నిద్రపోయావ్
నయాగరా జలపాతంలో దూకలేకపోయిన అన్నయ్యా
గుడ్ బై! మీకందరికీ సలాంవా లేకుమ్
వచనం లేదు - కవిత్వం అంతకంటే లేదు
చప్పబడిన చపాతీ బ్రతుకు
ఫైళ్లమధ్య నలిగిన కాగితపు భూతం
నీవు అధిరోహించావ్ 'బిగ్ బెన్' అగ్ని పర్వతాన్ని
ఇక కక్కనీ! సమస్తం కాలనీ!.... చావు
దిగంబర కవిత్వంలో మరొకడు.... మరొకడు
నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవారు
ఆత్మ యోని నుండి పుట్టుకొస్తున్నాడు - " అని కు కవులను, నయాగరా కవులను‌ నిందా స్తుతితో నిఖిలేశ్వర్ ఆక్షేపించారు.

“ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం 
తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి 
నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా 
చలనం లేని మైకం నీది 
కోత కొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి'వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకంనీది
ఆకలికి ఎండిమాడి ఎరువు సొమ్ములతో
వీధిన బడ్డ సింగారం నీది
గమ్యం ఏమిటితల్లీ !
వందేమాతరం ! వందేమాతరం!!"  అని దేశమాత దయనీయ స్థితి ని చెరబండ రాజు వర్ణించారు.

"భూమి ముసలి వరిబీజములా వున్నది
భూమి ఆంధ్రుల జీవితములా వున్నది
భూమి 'కవిసామ్రాట్టు తర్కంలా వున్నది
భూమి వచన కవితోద్యమంలా వున్నది
భూమి తెలుగు సినిమాలా వున్నది
భూమి ఎద్దు ప్రభుత్వములా వున్నది
భూమి కడగని ఎండిన పీత ముడ్డిలా వున్నది” అని సమాజానికి ప్రతీకగా భూమిని వర్ణించారు నగ్నముని.

“చచ్చిన రాజుల పుచ్చినగాధల, 
మెచ్చే చచ్చు చరిత్రకారులను
ముక్కు చెవులు కోసి అడగాలనుంది,
మానవ పరిణామ శాస్త్రం నేర్పిందేమని?"

“సమస్యలకు లోతులు తీసి, 
సామాన్యుల గోతుల్లో తోసి
కాలాన్ని గాలంగా వాడుకుంటూ, 
నిర్లిప్తతలోనే నిప్పును రాజేస్తూ
అనంత అమాయిక మానవ జాతిని అనాదిగా, అధ్వాన్నముగా
పరిపాలించే పిడికెడు మేధావులకు పిరామిడ్లు కట్టాలనుంది" అని జ్వాలాముఖి అంటారు.

“దేశ దేశాల సుఖవ్యాధి పుండ్లతో
చీడ పురుగులు నిండిన మేడి పండ్లతో
భూమి వెలయాలై, పతితయై, భ్రష్ట మై
పుచ్చి గబ్బు కొడుతున్నప్పుడు
నేను పుడుతున్నాను దిగంబరకవిని”
-మహాస్వప్న.

"పుడమితల్లి చల్లనిగుండెను
పాయలు పాయలుగా చీల్చుకొని
కాల్వలై ఎవరిదో, ఏ తరం కన్నదో
గలగలా సుళ్ళు తిరిగి మెల మెల్లగా పారుతూంది
ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది" -చెర బండరాజు

"నా దేవుడు
చీము నెత్తురూ వున్న మానవుడు
మానవత్వాన్ని తప్ప మరో మతాన్ని అంగీకరించడు”
-భైరవయ్య.

“కోడిపందాలకీ, గొర్రె పందాలకీ 
కుత్తుకలు తెగేసుకునే ఓ ఆంధ్రదేశమా!
నీ రోడ్లనీ, గొడ్లనీ, లారీల్నీ, మైకా గనుల్నీ, 
టెండర్లనీ, కంట్రాక్టర్లనీ
మాదాకవళం మేధావుల్నీ, 
లంగా మార్కు సినిమాలనీ....
ప్రణాళికల వ్రణాలపై మూగే ఈగల రాజకీయాల్నీ...
అగాధమీలనే అనాథ శరణాలయాల్నీ.......
నీ వేల సంవత్సరాల గొడ్రాలి సంస్కృతిని
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
కారంలో పొర్లించిన రోకళ్ళతో
పట్టపగలు విషయించాలనుంది." - నగ్నముని

“దేవుడు దేవుడంటూ నేలవిడిచి సాముచేయు
తత్త్వ దిమ్మరులకు ఆధ్యాత్మిక సోమరులకు
కళ్ళుపీకి చూపాలనుంది" - జ్వాలాముఖి.

No comments:

Post a Comment