-->

Saturday, December 4, 2021

ఉన్నవ లక్ష్మీనారాయణ నవల "మాలపల్లి"

         

 సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడైన ఉన్నవ లక్ష్మీనారాయణ 1922లో రాసిన నవల మాలపల్లి. 1921లో పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఉన్నవ వారు రాసిన నవల ఇది. ఈ నవలకు "సంగ విజయం" అనే పేరు కూడా ఉంది. 

          ఉన్నవ గారి మాలపల్లి నవల గురించి ఎందరు ఎన్ని రకాలుగా, ఉన్నతమైనదిగా, విశిష్టమైనదిగా చెప్పినా.... రచనా కాలం నాటి నుండి నేటి కాలం వరకు ఈ సమాజంలో జరిగిన పరిణామాలను బట్టి నాదైన కోణంలో ఈనవల స్థానాన్ని  విశ్లేషించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం.

          స్వాతంత్ర్యోద్యమ కాలంలో  స్వాతంత్య్రం గూర్చి పోరాడుతూనే సామాజిక సమస్యలపై రచనలు చేస్తూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రయత్నమే ఉన్నవ వారిది.  నాడు స్త్రీల పట్ల సానుభూతి గల కొందరు సంఘ సంస్కర్తలుగా స్త్రీల సమస్యలపై..., వారి అభ్యున్నతికై..., నాటి సామాజిక రుగ్మతలపై ఉద్యమించారు. సంఘ సంస్కర్తలుగా గుర్తించబడ్డారు. మరికొందరు వీరిలా ఉద్యమించడంమే కాకుండా కవులుగా, రచయితలుగా వివిధ రచనలు చేశారు. ఈ రెండవ కోవకు చెందినవారే ఉన్నవ లక్ష్మీనారాయణ.

          నాటి అభ్యుదయ భావాలు గల కవులు , రచయితలకు - సంఘసంస్కర్తలకు లింగపరంగా స్త్రీ సమస్య ఒకటైతే, కులపరంగా నాడు అంటరానివారిగా, హరిజనులుగా, అస్పృస్యులుగా పరిగణించబడేవారే ప్రధాన అంశం.   హరిజనోద్ధరణ, సహపంక్తి భోజనాలు, వర్ణ వ్యత్యాసాల నిర్మూలన, ఆలయప్రవేశం ఈ అంశాలు చాలామంది సంఘ సంస్కర్తలకు, కవులు రచయితలకు ముడిసరుకుగా ఉపయోగపడింది, ఉపయోగించుకున్నారు.  ఇలా కొందరు ఇతరులకంటే భిన్నంగా విశాల దృక్పథంతో ఆలోచించి ఉద్యమించారురచనలు చేశారే గాని మరొక అడుగు ముందుకు వేసి వారు ఆశించిన కుల నిర్మూలనకు వారు ఆచరణలో చూపలేదు. 

          కాలంలోనే కాదు; సాహిత్య లోకంలోనూ మార్పులు వచ్చాయి. లింగపరమైన వివక్షను ఎదుర్కున్న స్రీలు వారిసమస్యలను వారే సాహిత్యంగా చెప్పుకోవడం  ప్రారంభించారు. అదే స్త్రీవాదం! కులవివక్ష, అసమానతలు, అస్పృస్యతను అనుభవించిన వారే వారి సమస్యలను సాహిత్యంగా చెప్పుకోవడం ప్రారంభించారు. అదే దళితవాద సాహిత్యం. కులమతాలకు అతీతంగా దళితులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్న నిజమైన సంఘ సంస్కర్తలు జాషువా -గోరా లలాగా ఎందరున్నారు ఈ దేశంలో. సంఘసంస్కర్తలుగా చెప్పుకునే చాలామంది  ఉద్యమాలకు , కలవు-రచయితలు రచనలకే పరిమితమై నిలిచిపోయారు. 

          నాటి సంఘ సంస్కర్తలను ఇతరులకంటే భిన్నమైన విశాల దృక్పథం గలవారీగా మాత్రమే చూడాలి గాని, వారి ఉద్యమాలవల్ల, రచనలవల్ల వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు లేవు. నేటికీ దళితులపట్ల అదే కుల వివక్ష. నేటికీ దళితులకు ఆలయ ప్రవేశం లేని పరిస్థితులు. దళితుడు దేశప్రథమ పౌరుడు అని గొప్పగా చెప్పుకునే పార్టీలు ప్రభుత్వాలు రాష్ట్రపతిని ఆలయంలోకి పంపించలేక పోయాయి. మొన్నమొన్న తమిళనాడు. ఇలా ఎన్నో చోట్ల.                    

          ఎన్నికలలో దళితవాడల్లో నిద్రపోవడం, కూర్చొని భోజనం చెయ్యడంవంటి సహపంక్తి భోజనాలు నాడు సంఘ సంస్కర్తలుగా చెప్పుకోడానికి ఉపయోగపడినట్లే నేడు ఓట్లు దండుకోడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి.  ఏది ఏమైనా  దళితుల అభ్యున్నతిని కాంక్షించి "మాలపల్లి"  నవలను రచించిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం సముచితమని భావిస్తున్నాను

మాలపల్లి లో ప్రధాన పాత్రలు

రామదాసు - మాలదాసరికులస్థుడైన రామదాసు సాత్వికుడు.గాంధేయవాది.

మహాలక్ష్మీ - రామదాసు భార్య

జ్యోతీ - రామదాసు కూతురు

సంగ దాసు - రామదాసు చిన్న కొడుకు. నవలలో మొదటి నాయకుడు. భూస్వామి చౌదరయ్య వద్ద పాలేరు. సంఘ చైతన్య స్ఫూర్తి కలిగిన నాయకుడిగా సంగ దాసు సమాజంలో కులపరమైన భేదాలు పోవడానికి, దళితాభ్యుదయానికి నిర్మాణాత్మకరీతిలో పాటుబడుతూ భూస్వామి చేతిలో మరణిస్తాడు.

వెంకట దాసు - రామదాసు పెద్ద కొడుకు. నవలలో రెండవ నాయకుడు. తమ్ముదు సంగ దాసుమరణానంతరం అడవులకు పోయి తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతొ ధర్మ కన్నాల ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు. వర్గచైతన్య స్పూర్తి నిండిన కలిగిన నాయకుడిగా సమాజంలో ఆర్ధిక అంతరాల నిర్మూలన కోసం విప్లవకారుడై సాయుధ పోరాటమార్గం అవలంబిస్తాడు. పోలీసులకు పట్టుబడి జైలు పాలై చివరకు మరణిస్తాడు.

అప్పాదాసు రామదాసు మేనల్లుడు (చెల్లెలు కొడుకు). దళిత బడికి టీచర్ గా సేవల నందిస్తాడు.

చౌదరయ్య ఊరికి మోతుబరి. నిరంకుశ భూస్వామి. మార్పుకి వ్యతిరేకి

వెంకటయ్య నాయుడు - భూస్వామి చౌదరయ్య పెద్ద కొడుకు

రామానాయుడు భూస్వామి చౌదరయ్య చిన్నకొడుకు. సంగ దాసు సదాశయాలతో ఏకీభవిస్తూ అతనికి సాయంగా మంచి మిత్రుడుగా ఉంటాడు. దళితాభ్యదయానికి చక్కని కృషి చేసిన దళితేతరుడు.

కమల - రామానాయుడు భార్య. మోహనరావు తో లేచిపోతుంది.


                                                             మాలపల్లి కథా సారాంశం:

ఎస్సీ ఉపకులాలలో ఒకటైన  మాలదాసరికులానికి చెందినవాడు రామదాసు. సాత్వికుడు.   సాంప్రదాయాలను పాటిస్తూ జీవించేవాడు. గాంధేయవాది. ఈ నవలలో కథంతా అతని కుటుంబం, సమాజాన్ని అల్లుకొని సాగుతుంది. రామదాసు భార్య మహాలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వెంకట దాసు, చిన్న కొడుకు సంగ దాసు, కూతురు జ్యోతి.

 

పెద్ద కొడుకు వెంకట దాసు తండ్రికి సాయంగా సేద్యం చేస్తుంటాడు. చిన్నకొడుకు సంగ దాసు ఒక భూస్వామి వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. పొలం పనులలో కూతురు జ్యోతి సాయం చేస్తుంటుంది. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి. ఆమె కొడుకు అప్పాదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు ఇంటిపట్టునే పనులు చేస్తూ పెరుగుతుంటాడు. ఈ విధంగా తమకున్న కొద్దిపాటి భూమితో మాలపల్లిలో రామదాసు కుటుంబమంతా శ్రమిస్తూ జీవనం సాగించేది.

ఆ వూరి మోతుబరి, 800 ఎకరాల ఆసామి అయిన చౌదరయ్య కొడుకులైన రామానాయుడు, వెంకటయ్య నాయుడు అనే అన్నదమ్ములు కూడా ఈ నవలలో ముఖ్య పాత్రలుగా వుంటారు. సంగ దాసు ఈ చౌదరయ్య వద్దనే పాలేరుగా పనిచేస్తుంటాడు. పనివాడైన సంగ దాసు, యజమాని కొడుకైన రామానాయుడుల ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో స్నేహంగా సఖ్యతగా వుంటారు.

 

ఒక విధంగా రామదాసు కుటుంబంలోని వాళ్ళంతా కులమతాల పట్టింపుల్ని దుయ్యబట్టినవాళ్ళే. కొడుకులు వెంకట దాసు, సంగ దాసులు సంస్కరణ భావాలు కలిగినవాళ్ళు. కరడుగట్టిన భూస్వామి చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించేందుకు సంగం దాసు తోటి దళిత కూలీలను సంఘటితపరచి, వారిలో చైతన్యం కలిగించి, సమ్మెలకు నాయకత్వం వహిస్తాడు. దళితులకు విద్య నేర్పడం కోసం బడులు తెరుస్తాడు. దళితుల జీవితాలను సంస్కరించడానికి ఆతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ కృషిలో రామానాయుడు అతనికి సాయంగా వుంటూ ఆర్థికంగా చేయూతనిస్తాడు. ఇది భూస్వామికి కంటగింపుగా వుంటుంది. ఒకనాడు భూస్వామి సంగ దాసు తలపై పనిముట్టుతో గట్టిగా మోదడం వల్ల సంగ దాసు మరణించడం జరుగుతుంది. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిది నుండి తప్పించుకొంటాడు. నష్టపరిహారంగా భూస్వామి ఇవ్వబోయిన ధనాన్ని నిరాకరించి తమ కొడుకు చంపబడ్డ విషాదాన్ని రామదాసు దంపతులు మౌనంగా భరిస్తారు. దీనితో రామానాయుడు పేద రైతులకు మరింత దగ్గరై, దళితాభ్యున్నతికి పూర్తిగా అంకితమవుతాడు. సంగ దాసు ఆదర్శభావాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా సంగ పీఠంగ్రామంలో నెలకొల్పబడుతుంది. క్రమేణా ఈ సంగ పీఠం కృషిలో దళితేతర అగ్ర కులాలు కూడా చేరతాయి.

 

వెంకట దాసు అడవులలో నివసిస్తూ తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతో సంతానులనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ఈ నవలలోని సంతానుల ప్రసక్తి బంకిమచంద్రుని ఆనందమఠం నవల లోని సంతానులను జ్ఞప్తికి తెస్తుంది. ధర్మ కన్నాలువేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి వెంకట దాసు నాయకత్వం వహిస్తాడు. అయితే పోలీసులతో జరిగిన సాయుధ ఘర్షణలో వెంకట దాసు గాయపడి పట్టుబడి చివరకు జైలు పాలవుతాడు. ఒక వ్యాజ్యంలో ఓడిన రామదాసు తన యావదాస్తిని భూస్వామి చౌదరయ్యకు స్వాధీనం చేయవలసి వస్తుంది. తన పొలం నుండి, ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన రామదాసు చివరకు ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళ జగ్గని సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో, ధర్మ కన్నంతో సంబంధం ఉందనే నెపంతో రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టుచేసి సెటిల్మెంటులో నిర్బంధ కూలీలుగా పనిచేయిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పెద్దకొడుకు వెంకట దాసుకు పరిచర్యల కోసం తల్లీ, తండ్రీ కొంతకాలం అక్కడుండటం జరుగుతుంది. వెంకట దాసు మరణిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులుతో పాటు కూతురు జోతి దుర్మరణం పాలవ్వడంతో అ బెంగతో భార్య మహాలక్ష్మికూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలన్నింటిని రామదాసు సహనంతో తన సహజ వేదాంతధోరణిలో శాంతంగానే స్వీకరిస్తాడు. క్రమేణా సంగపీఠం కృషి దినదిన ప్రవర్ధమానమవుతుంది. సహాయనిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాల వంటి ప్రజాఉద్యమాల ఫలితంగా స్వాతంత్ర్యం లభిస్తుంది. ఖైదీలు విడుదలవుతారు. వయోజన వోటింగు ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికవుతారు. రామదాసు కూడా జైలు నుండి విడుదలై తన గ్రామానికి వస్తాడు. రామానాయుడు తన యావదాస్తిని దళితుల అభ్యుదయానికి సమర్పించి రామదాసుని గ్రామంలోనే వుండి సంగ దాసు చేసిన కృషిని కొనసాగించమని కోరతాడు. కాని రామదాసు నిరాకరించి అడవుల కేగుతాడు. ఈ విధంగా అనేకానేక అంశాలు అల్లుకుపోయిన నేపద్యంలో చివరకు భూస్వాముల మదం అణిగిపోయి వారు తమ సర్వస్వాన్ని దళితుల అభ్యుదయానికి, గ్రామాభ్యుదయానికే సమర్పించుకొని, గ్రామసేవకి అంకిత మయినట్లుగా చెప్పబడింది.

No comments:

Post a Comment