-->

Friday, December 10, 2021

కట్టమంచి రామలింగారెడ్డి "ముసలమ్మ మరణము" (డిసెంబర్ 10, జయంతి సందర్భంగా...)- డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


 కట్టమంచి రామలింగారెడ్డి గారు వ్రాసిన "ముసలమ్మ మరణం" అనే కావ్యం "నవ్య కావ్యం" అని కొందరంటే, ప్రబంధ లక్షణాలతో రాసిన ప్రబంధ కావ్యమే అని సాహితీ విమర్శకులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  కట్టమంచి  మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో ఆంధ్ర భాషాభి రంజననీ సమాజ పోషకుడు సమర్ది రంగయ్య శెట్టి నవ్య కావ్య రచయితలను ప్రోత్సహించడానికి 1899 లో నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్న కావ్యమే "ముసలమ్మ మరణం".  ఇందులో సాంఘిక కథను ఎంచుకొని సంఘ జీవితాన్ని ప్రదర్శించారు. సి.పి.బ్రౌన్ ప్రచురించిన "అనంతపుర చరిత్ర" నుండి "ముసలమ్మ మరణం" కథని స్వీకరించారు.  ఈ కావ్యం స్త్రీల కొరకు రచించాడు. ప్రచారంలో ఉన్న గ్రామదేవత కథను ఇతివృత్తంగా తీసుకుని రాశారు కట్టమంచి.  

 కట్టమంచి ప్రబంధ స్త్రీ వర్ణనకి భిన్నంగా పాశ్చాత్య ప్రభావంతో స్త్రీ త్యాగగుణాన్ని చాటుతూ ఈ కావ్యములో ముసలమ్మ పాత్రను మలిచారు.  ముసలమ్మ మరణం 107 పద్యాల చిన్న కావ్యం. అందుకే దీనిని ఖండకావ్యం అని కూడా కొందరన్నారు. ముసలమ్మ మరణం కథ ప్రేరణతో దువ్వూరి రామిరెడ్డి గారు కూడా "నలజారమ్మ " అనే కావ్యాన్ని రాశారు.  1930లో చిలుకూరి నారాయణరావు "ముసలమ్మ"పేరుతో చిన్న గేయ కృతిని రచించాడు. ఇలా మరికొందరు...

ముసలమ్మ మరణము-కథాంశం :- 
అనంతపురచరిత్ర లోని పై కథను స్వీకరించి కొన్ని తొలగింపులు, కొన్ని మార్పులు, కొన్ని కల్పనలు చేసి
రెడ్డిగారు వ్రాసిన కథ ఇది! 

బుక్కరాయ సముద్రమనే గ్రామంలోని చెరువు, వర్షాలు బాగా కురిసి నిండి పోయింది. చెరువు కట్ట తెగి ఊరంతా కొట్టుకొనిపోయే ప్రమాదమేర్పడగా, ఊరి పెద్దలంతా ఆలోచించి, పోలేరమ్మను కొలువటానికి నిశ్చయించు కున్నారు. ఊరి ప్రజలంతా చెరువు దగ్గరకు పోయి దేవతను కొలుస్తుండగా బసిరెడ్డికి చిన్న కోడలైన ముసలమ్మ బలియైనట్లయితే చెరువు కట్టనిలుస్తుందని ఆకాశవాణి పలికింది. ఈ విషయం తెలిసి తాను బలికావటానికి ముసలమ్మ నిశ్చయించుకొంది. భర్త, అత్త మామల అనుమతి తీసుకుంది. ఒక్కగానొక్కడైన కొడుకును భర్త కప్పగించింది. ప్రజల అనుమతిని కూడా తీసుకొని, భగవంతుణ్ణి ప్రార్థించి ముసలమ్మ చెరువు నీటిలో మునిగి పోయింది.

కట్టమంచి మూలకథలోని కొన్నింటిని మార్పులు చేర్పులు చేసి రాశారు. ప్రాత్ర పేరు పేరుకిి ముసలమ్మగాని; వయసురీత్యా 17 ఏళ్ళ  వయసు గల యువతి.  

రసాత్మకమైన కావ్యంగా మలచడం కొరకు (1) వర్ణనలు (2) సన్నివేశాలు (3) పాత్రల్లో మూలంలో లేని కొన్ని మార్పుల్ని చేశారు కట్టమంచి.

గ్రామీణ జీవితాన్ని చక్కగా వర్ణించగల కవి! గ్రామ వర్ణనతో కట్టమంచి కావ్యాన్ని ప్రారంభించారు.  
చెఱకు తోటల్లోబడి పాడుచేసే దొరలా దర్జాగా పోయే అడవి పందులు సమూహంతో, ఎండ్రకాయలకోసం వచ్చి కూసే గుంట నక్కలు, పొలాల్లో పిచ్చికి మేసి కొవ్వుబట్టి నిగనిగలాడే గోవులు, జొన్నచేలమీద వారి శబ్ధించే గువ్వలు.... ఇలా పైరు పచ్చదనంతో ఆ పల్లె శోభతో ఉండడమే కాదు; చెరువు ఎల్లప్పుడూ నీటినందిస్తూ ఉంటుందని కట్టమంచి పల్లెను ఇలా వర్ణించారు.
 కట్టమంచివారు పంటపొలాల పరిసరాలను ఇలా వర్ణించారు.   

సీ. చెఱకుఁ దోఁటలఁ జొచ్చి కొఱికి పాడొనరించి - దొరలట్లఁ బోవు పందుల గణంబు,
నెండ్రకాయల కొఱ కేతెంచి గుంటిపై - మెక్కి కూసెడు గుంట నక్క గములు,
బడుగు బక్కలు గాక కడుపారఁ దిని పంది - గున్న లతో రాయు గొఱయ పిండుఁ,
బొలముల లేఁ బచ్చికల మేసి చియ్యచే - నిగనిగ లాడు గో నికరములునుఁ, 

చెఱకు తోటల్లోబడి నమిలి పంటను పాడుచేసి దొరల్లా పోయే అడవి పందుల సమూహము, ఎండ్రకాయలను గొంతుకాడికి మెక్కి కూసే గుంటనక్కల సమూహము, బడుగు బక్కా అనే తేడాలేకుండా కడుపారా తిని పందిగున్నల్లా తయారై పోట్లాడే అడవి గొర్రెల సమూహము, పొలములోని పచ్చిగడ్డిని మేసి కొవ్వుబట్టి నిగనిగలాడే గోవుల సమూహములతోనేగాక ;   


తే. గలకలారావములు మీఱఁ గలిసి జొన్న
చేలపై వ్రాలు గువ్వల చెలువుఁ గలిగి
పైరు పచ్చల నొప్పు నా పల్లె, చెఱువు
నిండి నీరంబు లొసఁగుచు నుండ నెపుడు

కలకల శబ్దాలతో మించి పోయి కలిసిపోయేలా జొన్న చేలపై వాలే గువ్వలతో, పైరు పచ్చలతోనూ, సంవృద్ధిగా నిండిన నీటితో కూడిన చెరువుతో ... శోభతో ఆ పల్లె ప్రకాశిస్తుంది.   


కట్టలు తెంచుకునేలా ఉగ్రరూపం దాల్చిన చెరువును సముద్రమన్నట్లు అతిశయోక్తి గా ఇలా వర్ణించారు కట్టమంచి. సుదీర్ఘ సమాసాతో కవి ఈ పద్యాన్ని రాశారు.

"మ. చలదుత్తుంగ మహెగ్ర భంగపటలీ సంఘట్టనారావ, ము
జ్వల కూలాగ్రనటత్తరంగరవ, మంచన్మధ్యభాగ్భూమి భృ
త్కులసంపాతి మహెర్మికానికర నిర్ఘోషంబునుం, గూడఁగా
నలరున్ ఘోరసరస్సు దిగ్విదళన వ్యాపార పారీణమై."

కదులుతూ పైకిలేచే మహోగ్రమైన కెరటాల రాపిడివల్ల శబ్దము ఒడ్లపై తరంగాలు నాట్యం చేస్తున్నాయి. ఆ నాట్యం చేస్తున్న కెరటం యొక్క శబ్దం కెరటాలు, ఒడ్లకు మధ్యగా ఉన్న ప్రదేశం  కులపర్వతాలలా  గొప్ప కెరటాల యొక్క ఘోష , ఆ కెరటాల తాకిడితో ఒడ్డు ఒరుసుకు పోతున్నది.  


ఎడతెరిపిలేని భయంకరమైన వాన గూర్చి: 

చ. కడవల ముంచి వంచిన ప్రకారము, మన్నును, మిన్ను నేక మ
య్యెడు గతి, రేవగళ్లు నొకటే విధ మొప్పఁగ, నాకసంబు తూ
టిడెనొ యనంగ, బల్పిడుగు లెక్కడఁజూచిన రాలుచుండగా,
సుడిగొని గాలియున్ విసర,జోరని వాన లొకప్డు వచ్చినన్.

కుండపోత వర్షంతోభూమ్యాకాశాలు ఏకమైన రీతిగా రేయింబగళ్లు ఒకేటే రీతిగా... ఆకాశానికి చిల్లి పడిందన్నట్లుగా, అనేకమైన పిడుగులు పడుతుండగా సుడిగాలి విసిరికొడుతుండగా ... ఇటువంటి జోరైనా వానలు ఒకప్పుడు వచ్చినప్పటికీ ... .   


శా. ఆ లాగుంగని రెడ్లు రైతులును దా మాలోచనల్ చేసి "యే
కాలం బందును నిట్టి వానల వినం గానంగ లేదెవ్వరున్
ఏలాగో మన మేమి చేయఁగల” మం చెంతేని భక్తిన్ వడిం
“బోలేరమ్మకుఁ బొంగలో” యనుచు సమ్మోదించి చాటించినన్.

పైవిధంగా భయంకరంగా కురిసే వానను రెడ్లు, కాపులైన రైతులు ఈవిధంగా ఆలోచన చేశారు. ఏకాలంలోనూ మునుపు ఇటువంటి పిడుగులతో కూడిన వానలు విన్నది చూసినది లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఎలాగో మనం ఏమి చెయ్యాలో అని ఆలోచన జెసి భక్తితో పోలేరమ్మకు పొంగళ్ళు అర్పించాలని అందరు అంగీకరించి తెలియజేశారు.     


క. నల్లని కోళ్లును బొట్టే
ళ్ళెల్లరుఁ గొని మగలఁగూడి యేతెంచిరి యా
పల్లియ కొమ్మలు మిక్కిలి
జిల్లను నా గాలి తనులు చిలచిల వడఁకన్.

ఇటువంటి పరిస్థితుల్లో కోళ్ళూ, గొర్రెలను పోలేరమ్మకు బలి ఇవ్వడం కోసం , తనువు చిలచిలమనే, జిల్లనే ఆ చల్లని గాలులతో కూడిన వాతావరణంలో తమ భర్తలతో  ఆ పల్లెస్త్రీలు ఎల్లరూ కూడి గుడికి వెళ్లారు.   


క. పొంగళ్లు దిగిన తోడనే
రంగుగ బలులిచ్చి, పళ్ళెరమ్ముల తళియల్
వొంగార, బూజారుల
నంగారిశుభాంగి వర్ణనల్ చేసిరొగిన్.

ఆపల్లె జనం దిగిన వెంటనే అందంగా వారు వెంటతెచ్చిన కోళ్ళూ, గొర్రెల్ని బలి ఇచ్చి పళ్లాలల్లోని పదార్థాలను పొంగారగా పూజారులు మనోహరంగా సమర్పించి పోలేరమ్మను శుభం కలుగజేయమని వేడుకున్నారు.   


బసిరెడ్డి చివరి కోడలు బలిగా పోతే ఇసుమంత కూడా కష్టమేర్పడదని వారి బలులు పూజల అనంతరం ఆకాశవాణి పలికిన మాటలకు ఆ ఊరిజనం హడలి ఇలాగనుకుంటున్నారు.

"క. సుదతీమణి, కడుమెత్తని
హృదయాబ్జము గలది, పసిది, యేమియెఱుఁగ, దా
పదలం బడ దెన్నండును,
హృదయేశుని విడిచిపోవ నెట్లో పునొకో"

స్త్రీలలో శ్రేష్ఠురాలు, గొప్పది , అతి మెత్తని, సున్నితమైన హృదయ కమలం ఆమెది. పసిదనం వయసుగలది, ఏమీ తెలియని అమాయకురాలు ఎన్నడూ ఆపదలు పొందనిదైన ఆ ముసలమ్మ తన భర్తను ఇప్పుడు ఎలా విడిచి వెళ్ళుటకు సహిస్తుందో అని జనం బాధపడతారు. చింతిస్తారు.      


 గ్రామ ప్రజలకు తాను త్యాగం చేయాలని పరిస్థితిని భర్తను చెప్పుకోవడం కోసం అతని ముందుకు వచ్చిన  ముసలమ్మ స్థితిని కట్టమంచివారు ఇలా వర్ణించారు 

గీ. తనకుఁ గడుఁగూర్చు ప్రజలకై తాను వేగం
బ్రాణముల్ వీడ సంతసపడియు బాల
మగని నత్తను మామను మఱఁదుల మఱిఁ
గలజనమ్ముల విడిచిపోఁ గాళ్లురాక,

ప్రజలను ఆపదనుండి తప్పించి ప్రజలకు మేలు కలిగించడానికి వేగముగా తానూ సంతోషముతో ప్రాణాలు అర్పించడానికి ఆ బసిరెడ్డి కోడలు 17 ఏళ్ళ ముసలమ్మ తన భర్తను, అత్తను, మామను, మరదలను , తనతోటివారిని విడిచిపెట్టివెళ్లడానికి కాళ్ళు రాక ... తర్వాత పద్యం అన్వయింపు -    


క. లేనగవును గన్నీళ్ళును
గా, నెద తటతటయనంగఁ గాంతుని యెదుట న్
వానయు నెండయుఁ గలసెడు
చో నొప్పెడు నభమనంగ, సుందరి నిలిచెన్.

చిరునవ్వును కన్నీళ్ళుగా తన ఎదపై గుండెలపై తటపట కురియగా తనభర్త ఎదుట ఎలా నిల్చుందంటే వానా ఎండా కలిసి నప్పుడు ఆకాశం ఒప్పే రీతిగా ఆ సుందరి ముసలమ్మ భర్త ఎదుట నిలుచుంది.  


తానూ చేయబోయే పనివల్ల భర్తకు కీర్తి పెరుగుతుంది అనే విషయాన్ని ముసలమ్మ తన భర్తతో ఇలా చెబుతున్నట్లు కట్టమంచివారు ఇలా వర్ణిస్తున్నారు.  

గీ. మీరు కన్నా రఁ జూచుచు గారవింపఁ
గన్ను మూసికొనుట నాకు ఘనము కాదొ?
తమకుఁ దమభార్య యిటుచేసెఁదగుఁదగునని
యెల్ల వారును వర్ణింప నింపుకాదొ?"

ప్రజలకొరకు ప్రాణత్యాగం చెయ్యబోయే తన అభిప్రాయాన్ని భర్తగా గౌరవించడం, మీ కళ్లెదుటే ముతైదువుగా కన్నుమూయడం గొప్ప విషయం కదా!   తమకొరకు తమ భార్యలు ఈ విధంగా  ప్రాణత్యాగం చెయ్యకపోవడం, ముసలమ్మ ఈ రీతిగా చెయ్యడానికి పూనుకోవడం గూర్చి జనులు మాట్లాడుకోవడం మీకూ ఘనమైన విషయం కాదా అని అంటుంది .


సీ. లేఁగ మై నాకుచు లీలమై మెడ మలం - 
చిన గోవుఁబిండెడు వనరుహాక్షి
బొండుమల్లెలతోఁటఁ బువ్వులు గోయుచు - 
వనలక్ష్మి యననొప్పు వనజగంధి
బీదసాదలనెల్ల నాదరించుచుఁ గూడు - 
గడుపారఁ బెట్టెడు కన్న తల్లి
వ్యాధిబాధల నెవరైన నడల రెప్ప - 
వేయక కాచెడు వినుతచరిత

మెడ మలిచి తన లేగ దూడను ప్రేమతో నాకుతూ పాలిచ్చే పద్మాలవంటి కనులు గలది, బొండుమల్లెలతోటలో పువ్వులు కోసే సుగంధాన్ని పరిమళింపజేసే వనలక్ష్మి వంటిది, బీదసాదలను ఆదరించి కడుపారా కూడుపెట్టే కన్నతల్లివంటిది, ఎవరైనా వ్యాధిబాధలతో ఉండగా రెప్పవేయకుండా వారిని సంరక్షించే గుణము కలిగినటువంటిది...      
 
గీ. బిడ్డలెల్లరుఁ దమవారి విడిచిచేరఁ
జంక నిడికొని ముద్దాడు సదయహృదయ
అమ్మ! నీకిట్లు వ్రాయంగ నౌనె బ్రహ్మ
కనుచు నూరివారందఱు నడలియడలి

తమవారిని విడిచి తనదరిచేరిన బిడ్డలను చంకనెత్తుకొని ముద్దాడే మంచి హృదయం గల నీకు అమ్మా నీకు ఈవిధంగా బ్రహ్మ నీ తలరాత రాయడం తగునా అని ఆ ఊరివారందరు దుఃఖంతో అన్నారు .  


 
సీ. కన్నెఱ్ఱవారిన ఖరకరోదయకాల - 
మల్లనమ్రింగు జాబిల్లియనఁగ
జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతోఁ బోవు - 
ధాత్రీ మహాదేవి తనయ యనఁగ
కెందామరలబారు సుందరమగు లీల - 
నల్లనల్లనఁ జొచ్చు నంచ యనఁగ
కాల మహాస్వర్ణ కారకుం డగ్ని లోఁ - 
గరఁగించు బంగారు కణికయనఁగ

కళ్ళు ఎర్రబారినట్లు సంధ్యాకాలంలోని యెర్రని సూర్యబింబాన్ని మెల్లగా మింగే జాబిల్లి లాగా, ప్రకాశిస్తున్న అగ్ని శిఖలపైకి  నవ్వుతూ వెళ్లిన భూదేవి కుమార్తె సీతమ్మ లాగా, అందమైన తామర గుంపులోకి మెల్లగా వెళ్లిన హంసలాగా వెళ్ళింది. కాలమనేటువంటి స్వర్ణకారుడు కరిగించే బంగారు కణికలాగా కాలప్రవాహంలో సాలిసి పోడానికి ఆ చెరువులోకి ముసలమ్మ దిగుతుంది.     

గీ. ప్రళయ కాలానల ప్రభాభాసురోగ్ర - 
రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకుఁ
గలఁక నొందక, దరహాస మలర, 
మంద మందగతిఁ బోయి, చొచ్చె నమ్మగువ నీట."

ప్రళయ కాలంలో అగ్నిప్రభలు వ్యాపిస్తాయి. పైకి ఆకాశమంతటా నీరు వ్యాపిస్తుంది. వాటికి బాధపడకుండా భయపడకుండా ఆ చిరునవ్వు ప్రకాశిస్తుండగా మెలమెల్లగా వెళ్లి ఆ నీటిలో ప్రవేశించింది ముసలమ్మ. 
  

No comments:

Post a Comment