-->

Friday, December 10, 2021

నార్ల వారి మాట (డిసెంబర్ 1న జయంతి సందర్భంగా..‌)~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్నార్ల వెంకటేశ్వరరావు గారు పాత్రికేయులు హేతువాది వివిధ పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు వీరు నాటికలు కవితలు కథలు వ్యాసాలు వ్రాసారు వీరు 1958 నుంచి 1970 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు వీరి భార్య సులోచనాదేవి ఐదుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మహాలక్ష్మి లక్ష్మణరావు నార్ల వారి తల్లిదండ్రులు

జీవితం గూర్చి, సంఘం గూర్చి, సాహిత్యం గురించి తన అభిప్రాయాలను అనుభవాలను పద్య రూపంలో వ్యక్తీకరించినవే "నార్ల వారి మాట" అనే శతకంలోని పద్యాలు. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో అప్పుడప్పుడు తీసుకువచ్చారు.
స్వేచ్ఛా, సమత, ఓటు ఇత్యాది అనేక అంశాలపై ఈ సంపుటిలో నార్ల వారు రాశారు.
--------
(1)
పరుల ఆధీనంలో, స్వాధీనం లో ఉంటూ పాయసాన్నం భుజించడం, స్వేచ్ఛ కలిగి గంజి తాగడం మేలు. స్వేచ్ఛ లేని స్థితి పరోక్ష నరకమే కదా! :

"పారతంత్ర్యమందు పాయసాన్నముకంటె
గంజి మేలు స్వేచ్ఛ గల్గినేని ;
స్వేచ్ఛలేని సుఖము ప్రచ్ఛన్ననరకమే
వాస్తవమ్ము నార్లవారి మాట"

(2)
రాజులు... రాణులు పోయారు! భక్తవరేణ్యులైన నంబులు... వారి చెంబులకు కాలం చెల్లింది! కాలం మారింది. రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. సామాన్యుడ్ని  సార్వభౌముడ్ని చేసింది ప్రజాస్వామేనని నార్లవారు అంటారు! :

"రాజు పోయె, అతని రాణువ పోయెను;
నంబి పోయె, అతని చెంబు పోయె;
సార్వభౌముడయ్యె సామాన్య పౌరుడు
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(3)
ప్రజా స్వామ్యంలో "మెజారిటీ" కీలకం. ఈ ప్రజారాజ్యంలోనూ "మెజారిటీ" ప్రజలు సంపన్నులు, ధనికులు, ఒకప్పటి ప్రభుత్వాలచే తక్కువోళ్ళుగా చూడబడే అలగా  జనమే! ఆస్తిపన్ను కట్టేవారికే ఓటు హక్కు ఉన్న దశనుండి 18ఏళ్ళు నిండిన ప్రతి పౌరునికీ రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఓటుహక్కు కల్పించాడు. కనుకనే నాయకుడు గెలవాలన్నా;  పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా అలగాజనం అనబడేవారే ముఖ్యం!
 
"అధిక సంఖ్య ప్రజల “నలగాజన” 'మటంచు
త్రోసివేయగల్గు రోజు పోయే :
సాగు నిపుడు ప్రభుత సంఖ్యాబలముతోనే !
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(4)
ప్రజల లోటుపాట్లు తీర్చే శక్తి ఓటుకున్నది. నేటి సమాజానికి ఓటే బలం. ఇటువంటి దానిని డబ్బుకి అమ్ముకోవడమంటే చేటు తెచ్ఛుకోవడమే! 

"వోటు కున్న దోయి లోటుపాటుల దీర్ప
నేటి సంఘమందు మేటి బలిమి :
చేటు దెచ్చు వోటు పాటకు బెట్టగా
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(5)
మందు పోసో..., డబ్బులు చల్లో..... కులాన్ని వాడుకునో.... వాగ్దానాతో జనాన్ని నమ్మించి ఒక నాయకుడు గెలిచుండొచ్చు! అలాంటివారు గెలిచాక ప్రజల్ని పట్టించుకోనోళ్ళైతే నిలదీసి అడగడానికే ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు జరుపుకుంటారు. స్వేచ్ఛ కొరకు ఎన్నికలు జరగాలంటారు. 

"ఎన్నికైనవార లేబ్రాసు" లైనచో
తన్ని వేయ తిరిగి యెన్ని కుండు
సన్నగిల్లు స్వేచ్ఛ యెన్నిక లేకున్న
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(6)
 ఈ సమాజంలో నిజంగా ప్రజా సేవ చేసేవారిని ప్రజలు గుర్తించరు.తృణీకరిస్తారు!. నటించేవాడిని నెత్తికెక్కించుకుంటారు. నాయకుడ్ని చేస్తారు. గంగిరెద్దు ముస్తాబై ఊరూరు... వీధి వీధి ఎలా తిరిగి జనాన్ని మురిపిస్తూ, మైమరిపిస్తుందో నాయకుడు ఆలాగే అంటూ నార్ల వారు:

"సేవ చేయువాడు చెల్లడు ధరలోన ;
నటన చేయువాడె నాయకుండు
గంగిరెద్దె 'సుమ్ము' ఘనతతో నూరేగు
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(7)
అవకాశం దొరకాలేగానీ చడీచప్పుడు లేకుండా స్కామ్ ల మేత మేసే నేతలెందరో.... ప్రజల్ని... ప్రజా ధనాన్ని రక్షించాల్సిన వాడే కంచే చేను మేసినట్లు మేస్తే? అందుకే-

"సందు దొరికెనేని సడియు చప్పుడు లేక
మేత మేయువాడు నేత యగునె?
చేను మేయు కంచె సేమమ్ము నరయునా ?
వాస్తవమ్ము నార్లవారి మాట"

(8)
కులం పేరుతో రాజకీయాలు చేసి గెలిచి గద్దెనెక్కిన తర్వాత, ఆ కులం జనాల్ని విస్మరించే కుటిల రాజకీయ నాయకుల గురించి నార్ల వారు ఇలా అంటారు!

"కులము పేరు చెప్పి బలము కూర్చుకొనెడి
కుటిల రాజనీతి కోవిదుండు
కులము గొంతు గోసి కూర్చుండు గద్దెపై
వాస్తవమ్ము నార్ల వారి మాట"

(9)
హేతురహితంగా ఉన్న ఎంతటిదానినైనా.... చివరికి వేదం ఘోషిస్తుంది అని గొంతుచించుకున్నా గుడ్డినమ్మకాలను విజ్ఞాని విశ్వసించడు...అనుసరించడని నార్ల వారంటారు!

"వేదవాక్కునైన విజ్ఞాని మెచ్చడు
హేతురహితమైన రీతి నున్న :
గుడ్డి నమ్మకాలు గొడ్డుకే చెల్లురా
వాస్తవమ్ము నార్ల వారి మాట"

No comments:

Post a Comment