-->

Thursday, September 30, 2021

బోయ జంగయ్య కథ "చేపల చెరువు"

బోయ జంగయ్య కథ "చేపల చెరువు"
::వన్ లైన్ స్టోరీ ::
చేపలను ఇంకా చెర్లో ఉంచితే సగానికి సగం తరుగు వస్తాయని, అధికారులను డబ్బుతో కొనేస్తే ఈ దేశంలో ఈ పనైనా జరిగిపోతుందని బాగా తెలిసిన చేపల చెరువు కాంట్రాక్టర్ అధికారులకు డబ్బు మూట అందించి చెరువులో నీళ్ళు వదిలివేయాలని చూస్తాడు.

  పణలు పణలుగ పాలుపోసుకుని గింజలు పసుపు రంగు మారుతున్న దశ. నీరు వదిలితే కత్తెర పంట వెయలేమని మరోవైపు రైతులు పట్టు పట్టారు. ఈ విషయమై అధికారుల వద్ద అర్జీలతో రైతుల పోరాటం!!
ఈ దేశంలో దుర్మార్గాలు చేయాలంటే, చేయకుండా అడ్డుకోవాల్సిన వారు మౌనంగా ఉంటే చాలు మారణహోమాలుసైతం నిర్విఘ్నంగా జరిగిపోతాయని నిరూపించిన ఘటనలే  కారంచేడు , చుండూరు!  వాటిలాగే లంచాలు తిన్న అధికారులు మౌనం వహించడం ద్వారా ప్రశ్నించిన రైతుకు కాంట్రాక్టర్ అనునూయుల చేతుల్లో దెబ్బలు తినడం...చివరికి కాంట్రాక్టర్ నీళ్ళు వదిలి చేపలు పట్టుకొని సొమ్ము చేసుకోవడం జరిగిపోతాయి.

సంక్షిప్త కథ:
డాలర్లు పండించడం కోసం  ఏడాది పొడవునా పంటలు పండించుకోదగిన సారవంతమైన భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మారుస్తున్న వైనం తెలియనిది కాదు! చెరువంటే ఇలాంటివి కాదు. కొన్ని పల్లెల్లో ఉండే సహజ సిద్ధమైన చెరువుల్లాంటి చెరువే.
ఒకవైపు చెరువులో సమృద్ధిగా నీళ్ళు, వాటిలో బలిసిన చేపలు! ఆ చెరువు గట్టు క్రిందే మరోవైపు పాలు పోసుకుంటున్న దశలో వరి కంకులతో వరిపంట!! సగం కంటే ఎక్కువ నీటిని వదిలితే గాని చెరువులోని చేపలను పట్టడానికి కుదరదు గనుక, కాంట్రాక్టర్ బలిసిన ఆ చేపలను పట్టుకుని సొమ్ము చేసుకోవాలని అతని ఆరాటం!

కథా రచయిత బోయ జంగయ్య ఈ కథలో ఊరు తీరుని వర్ణిస్తున్నాడు. పార్టీ జెండాల దిమ్మెలు...వాటిపై ఆయా పార్టీలు గుర్తులు. 
కథకి కవిత్వానికున్న పరిధి కంటే ఎక్కువ విస్తృతి కథా వస్తువుబట్టే కాకుండా సందర్భానుసారంగా వర్తమాన, సామాజిక అంశాలను కథలు చెప్పే అవకాశం ఉంది. అటువంటి వర్ణనే ఇక్కడ.  కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనుషులు అనేక వర్గాల వారిగా విభజింపబడినట్లు, డబ్బుని బట్టి విభజించబడిన విధంగా, రాజకీయ పార్టీలను బట్టి కూడా పల్లెల్లోనూ మనుషులు విభజింపబడడే కాకుండా తాత్కాలిక తాయిలాలకు ఎన్నికల్లో ఎలా ఉంటారో చెబుతూ...
" చెరువు కట్ట మీద నుంచి ఊళ్లోకి పోతూ ఉంటే మొట్టమొదట ఓ ఓపెన్ గ్రౌండులో
వివిధ రాజకీయ పార్టీల జెండాల దిమ్మెలు. వాటిపై ఆయా పార్టీల గుర్తులు. ఆ గుర్తు కింద గుంపులుగా విడిపోయి ఉన్నారు. ఏ పండుగకు ఆ దేవున్ని కొలిచినట్టుగ ఏ పార్టీ మీటింగ్ కు ఆ పార్టీ వాళ్ళు గుమికూడి మీటింగ్ జరుపుకుంటారు. పండుగనాడు తాగినట్టె ఆ మీటింగ్ నాడు కూడా తాగి తందానలాడతారు. అందువల్ల ఉన్నా, లేకున్నా పండుగలన్నా పార్టీ మీటింగులన్నా ఆ ఊరి జనానికి ఎంతో ఇష్టం" అని నేటి పల్లెల్లో జరిగే తంతును కథకులు బోయ జంగయ్య చెబుతాడు. అలాగే... కులాల వారీగా ఉన్న వాడలను వర్ణిస్తూ యాదవ, కురుమ ఇళ్ళు. ఆ తర్వాత కాపుతనపు రైతుల ఇళ్ళు. అటు తర్వాత గౌండ్ల వాళ్ళ ఇళ్ళు. ఆ ప్రక్క రజకులు,క్షురకుల ఇళ్ళు,  కుమ్మరి ఇళ్ళు. చివర ఒక వైపు దళితుల ఇళ్ళు అని ఊరులోని వాడల తీరును, వారి వృత్తి బతుకుదెరువు సంబంధమైన వస్తు సామాగ్రి, పశు సంతతి గూర్చి ప్రస్తావిస్తాడు.

ఊరి రైతుల అర్జీని తీసుకున్న ఎమ్మార్వో ఆర్.ఐ.ను చెరువు సమస్యను పరిష్కరించడానికి పంపిస్తాడు‌. రైతులు చెరువు దగ్గర ఆర్.ఐ. కోసం ఎదురుచూస్తుండగా కొంతసేపటికి ఆర్.ఐ. వచ్చి  రైతులు వ్రాసుకున్న అర్జీ లోని విషయాల్ని చదివి వినిపిస్తాడు. చెరువులోనే నీళ్లు కత్తెర పంట తర్వాత వదలాలని తుమ్మలగూడెం రైతుల విన్నపంగా చదువుతాడు. ఈలోపు అక్కడికి గ్రామాధికారి వస్తాడు. రైతులకు దూరంగా చెరువుగట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆర్ .ఐ. గ్రామాధికారి చంకలో ఉన్న బ్యాగును చూస్తూ విషయం కనుక్కున్నాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ముడులను పుచ్చుకున్న గ్రామాధికారికి  ఆర్.ఐ.కు అర్థమయ్యేలా విషయం చెప్తాడు. అర్థం చేసుకున్న ఆతని ముఖం విప్పారింది‌. " నేను చూసుకుంటానులే" అని కాంట్రాక్టర్ డబ్బుకు అమ్ముడు పోయిన ఆర్.ఐ.  రైతులకు ఉత్తుత్తి భరోసా ఇచ్చి వెళ్తాడు.
ఊళ్లోకి వచ్చిన జీపు మైసమ్మ గుడి దగ్గర ఆగుతుంది. అందులోంచి లావుపాటి వ్యక్తి దిగుతాడు. మైసమ్మను పూజించిన తర్వాత ఆతని దృష్టి చెరువు, అందులోని చేపలపై పడుతుంది. అతనికి కదిలే చేపలు వందరూపాయల నోట్లు కదులుతున్నట్లు అనిపించాయి.
సగం కంటే ఎక్కువ నీటిని వదిలితే గాని చేపలు పట్టడానికి వీలుపడదు అని మాట్లాడుకుంటారు.
       నీరు వదిలితే కత్తెర పంట వేయలేమని రైతులు నీటిపారుదలశాఖ చుట్టూ, ఎమ్మార్వో చుట్టూ తిరుగుతూ అర్జీలతో విన్నవించుకున్నారు.
రైతులు నీళ్ళను వదలడానికి వీలుపడదని చెప్పిన విషయాన్ని కాంట్రాక్టర్ గుమాస్తా తన యజమాని ఫోన్లో చెప్పగా "డబ్బులకు ఆశపడని మనిషి, దెబ్బలకు భయపడని మనిషి ఉండర్రా బాబు"అని అవన్నీ నేను చూసుకుంటగా అని బదులిస్తాడు.
చెరువు గట్టు మీద ఉన్న కాంట్రాక్టర్ గుమస్తా చెరువులో కదిలే చేపలను చూసి "ఈసారి పైసలె పైసలు అనుకుంటూ కట్టకిందికి చూశాడు. వరిచేను చాలా ఒత్తుగా పెరిగి, పణలు పణలు పాలు పూసుకుని గింజలు పసుపు రంగులోకి మారుతున్న దశ. మరో పది రోజుల్లో తెరిపి లేకుండా నీరు అందితే గాని చేతికి రావు. అప్పుడు కాని పశువులకు గడ్డి, మనుషులకు తిండి రాదు. ఈ పరిస్థితి ఎట్లా గట్టెక్కుతుందో అనుకున్నాడు."

వారి పనికి అడ్డొచ్చే రైతులు పేర్లను చెరువు కాపలాదారుడ్ని తెలుసుకుని ఆ కాంట్రాక్టర్ గుమాస్తా ఒక నోటు బుక్ లో రెండు పేజీలలో రాసుకున్నాడు.

ఊళ్లో ముఖ్యమైన వాళ్ల ఇళ్లకు లీటర్ లీటర్ సారా, రెండు రెండు తెల్ల చేపలు చేరాయి. రెండు రోజులు పండగ చేసుకున్నారు. ఇవి అందిన తర్వాత నీళ్లు వదలడానికి వీల్లేదని పలికిన కొందరి రైతుల స్వరం మారింది.
ఒక పెద్ద రైతు గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. రైతులందరూ రాత్రి మిమ్మల్ని కలవడానికి వస్తానన్నారు అనే విషయాన్ని గ్రామాధికారికి తెలిజేస్తాడు.
అప్పుడే గ్రామాధికారి దగ్గరకు కొందరు రైతులు వస్తారు. మనుషులతో కాంట్రాక్టర్ కొట్టించడం గూర్చి ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్లు చెబుతారు. దెబ్బలు తిన్న రైతులు ఆ దెబ్బలు గ్రామాధికారికి చూపుతారు. ఆర్. డి. ఓ. గారు వస్తున్నారని, చెరువు విషయం తేలిపోతుందని చెబుతారు. ఇదంతా గమనిస్తున్న పెద్ద రైతులు ఆర్డి.వొ. గారు రాకుండా చూసుకుని నీటిని వదిలిపెట్టేలా చేసేందుకు కండువాలు చుట్టి ఉంచిన డబ్బు మూటని గ్రామాధికారికి ఇస్తాడు. ఒకప్పుడు నీటిని వదలొద్దు అన్న రైతులే  లంచం ముట్టజెప్పి నీళ్లు వదిలేయండి అనేలా రైతులు అనడానికి గల కారణం.... కాంట్రాక్టర్ కొట్టించే దెబ్బలకు తట్టుకోలేక! ఆ తర్వాత ఆ ఊరికి ఆర్డీవో రానే రాలేదు.
ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని చెప్పకుండానే ఇక్కడతో కథకుడు కథను ముగించారు.  ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో చెప్పకనే చెప్పారు.

ఎమ్మార్వో. , ఆర్ .ఐ., గ్రామాధికారి, సర్పంచ్, ఆర్డీవో... ఇంత వ్యవస్థ ఉన్నా జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి . ఈ వ్యవస్థ డొల్లతనాన్ని, అవినీతి అధికారుల తీరును ఈ కథలో చెప్పారు. బాధితుల ఫిర్యాదులు సమస్యల పరిష్కారానికి కాకుండా ,  అధికారులు డబ్బులు సంపాదించుకునేలా ఉపయోగపడుతున్నాయి. 

No comments:

Post a Comment