-->

Thursday, September 30, 2021

గురజాడ ఋషి వాక్కులు - డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ సాహిత్యోపన్యాసం

గురజాడ ఋషి వాక్కులు - డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ సాహిత్యోపన్యాసం 

గురజాడ తన గేయ కవితా పంక్తుల్లో కవిగానే కాకుండా; ఒక వ్యక్తిగా తన ఆకాంక్షను వెలిబుచ్చారు.  "ముత్యాల సరములు" అనే గేయంలో.....
“యెల్ల లోకము వొక్క యిల్లై
వర్ణ భేదము లెల్లకల్లై,
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ." అని ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. భవిష్యత్తును గాంచిన గురజాడ ఋషితుల్యుడే! కనుకనే సర్వకాలలోనూ చెలామణి కాగలిగిన పలుకులు పలికారు.  అందుకే-
“మతము లన్నియు మాసిపోవును.
జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును; -
అంత స్వర్గ సుఖంబు లన్నవి
యవని విలసిల్లున్."  అని అంటాడు. జ్ఞానానికి విలువ ఇవ్వడం ద్వారా మతాలు సమసిపోతాయి అనడానికి గుర్తుగా నేడు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు జరగడం చూస్తున్నాం. ఇంకా విరివిగా జరగాలి! కుల,మతాలు ఈ లోకంలో చెరిగి పోవాలి. గురజాడ ఈ కవితలో ఆశావాదాన్ని ప్రకటించారు.

కాసులు అనే గేయంలో..... గురజాడ రెండు సూక్తులు... లేదా సందేశాలను వ్యక్తీకరించారు.
"మరులు ప్రేమని మది దలంచకు;
మరులు మరలును వయసు తోడనె;
మాయ, మర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకముకు రాజమార్గము ." అని అంటాడు గురజాడ. సుఖానికి రాజమార్గం మాయ మర్మం లేని స్నేహం ఒక్కటే అని మనం గ్రహించాలి!
అలాగే...
"ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును.
ప్రేమ సిలిపిన ప్రేమ నిలుచును.
ఇంతియె." అనే సార్వత్రిక సత్యాన్ని చాటారు గురజాడ.   ప్రేమిస్తే ప్రేమిస్తారు.  ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును" అనే సత్యాన్ని చాటారు. మానవ సంబంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు పలచబడడానికి ఈ ప్రేమ లేమి కారణం!

"డామన్, పితియన్" కవితలో...
"బ్రతికి, చచ్చియు ప్రజల కెవ్వడు
బ్రీతి గూర్చునో, వాడె ధన్యుడు;...” అని గురజాడ అంటారు.
ఈ లోకంలో బ్రతికి చావడం సహజ విషయమే. కాని చచ్చి బ్రతకడం అరుదు. అది కొందరికే సాధ్యం! ఎవరా కొందరు?
  ధనవంతుడిగా,అందగాడు-అందగత్తె గా; గౌరవ ప్రదమైన కులం ఉద్యోగం కలిగి ఉండడం జన్మ ధన్యమని కాదు. ప్రజలకు బ్రతికుండగా ఎవరు మేలు చేశారో వారే చచ్చీ బ్రతికున్నవారు. అలాంటి వారే ధన్యులు

చివరిగా ....1912 డిసెంబరు 14న నాటి కృష్ణా పత్రికలో ప్రచురింపబడిన గురజాడ అప్పారావు గారి కవితలను పరిశీలిద్దాం! 
::మనిషి::
"మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్న కనిష్టం
గాను చూస్తే వేల బేలా ?
దేవు డెకడో దాగెనంటూ
కొండ కోనల వెతుకులాడే
వేలా ?
కన్ను తెరిచిన కానబడడో ?
మనిషి మాత్రుడి యందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి" అని అంటారు.

మనిషి చేసిన రాయిరప్పకు మహిమ ఉందని మనం సాగి మొక్కుతుంటాము. సాటి మనిషిని మాత్రం ఆ రాయి రప్పలకన్నా హీనంగా,  తక్కువగా చూస్తుంటాము. దేవునికోసం కొండా కోనల్లో తిరుగుతూ ఉంటాము. పూజలు పురస్కారాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాము. పరిశీలిస్తే.... నిజమైన దేవుడు మనిషిలోనే ఉన్నాడు. "మానవసేవే మాధవసేవ" అని గ్రహించి ఆచరిస్తే కోరిన  ముక్తి లభించదా అని అంటారు గురజాడ!

No comments:

Post a Comment