ఋక్కులు
కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా -
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్లచెక్కా
నీవేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్లెం, హారతిపళ్లెం, గుర్రపుకళ్లెం
కాదేదీ కవిత కనర్హం!
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రసనిర్దేశం!
దొరకదబోయ్ శోభాలేశం?
కళ్ళంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం!
కవిత్వ మొక తీరనిదాహం!
No comments:
Post a Comment