-->

Thursday, September 30, 2021

జాషువా పద్యాలు (ముంటాజమహలు)సంజ కెంజాయలో జలకంబు సవరించిన
పఱతెంచు సూర్య బింబంబు లోన
పదునాఱు దినముల పరువు వచ్చిన నాఁటి
చంద్రుని ధవళ హాసముల లోన
పూలతోటలతోడ ముద్దుముచ్చట సెప్పి
చెఱలాడు మొలక తెమ్మెరల లోన
నీలమేఘంబుల నెటియలలోఁగుల్కి
పరువెత్తు మెఱపు గర్భముల లోన

హాయిగాఁ బవ్వళించి బ్రహ్మాండములను
బల్కరించుచు నున్న దివ్యస్వరూప!
హృదయమును జీల్చి పూజ లర్పించుకొందు
నందుకొనిపొమ్ము, వ్యవధి లేదనక రమ్ము.

రాణివిడచిపోయె రాజు నొంటరిఁజేసి
రాజు విడచిపోయె రాజ్య రమను
రాజ్యరమయు విడిచె రాజులఁ బెక్కండ్ర
తాజి విడువలేదు రాజసంబు.

అతివ చక్కదనము నభివర్ణనము సేయ
కలము సాగ దెట్టి కవివరులకు
చేయి యాడ దెట్టి చిత్రకారులకును
చెలువ చెలువమెల్ల జిలుకరింప.

అసమసౌందర్యవతి నూర్జహాను రాణి
కోడలి విలాసమునకు సిగ్గును వహించు
వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప
తురక రాయఁడు నిలువున గరిగిపోవు.

“ముద్దులరాణి మాటకు విభుం డెదురాడడు రేని యానక
మ్ముద్దియ మాఱుపల్క డదెపో: సహవాస” మటంచు నిత్యమున్
బెద్దలు ప్రస్తుతింప నతివేల సుధా ప్రణయైక రాజ్యపుం
గద్దె నలంకరింతురు మొగల్ మగ లమ్మహనీయ దంపతుల్.

ఆ సతీపతుల గాఢా శ్లేషములనుండి
జారి పోయిన నిమేషంబు లేదు
ఆ దంపతులకు నాహ్లాదంబు గూర్పక
తొలఁగిన వెన్నెల తునక లేదు.
ఆ ప్రేమజీవుల యనురాగ వృద్ధికై
రుత మొనర్పని పరభృతము లేదు
ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దులచేత
తీపి కెక్కని ద్రాక్షతీఁగ లేదు.

అవధి లేనివారి యానంద కేళికిఁ
దోడుపడని పూలదోఁట లేదు
వారి కూర్మి పెంపు వలచి వర్ణనజేసి
సుప్రసిద్ధి గనని సుకవి లేఁడు.

మొగలు దొరసాని లావణ్యభూషణంబు
కన్ను మాయదు సంతాన ఘర్షణమున
జీవితంబున నొక దుష్టచింత లేని
సత్యవంతుల ప్రాయంబు జాఱదండ్రు

తన సంతానము మాతృహీనమయి వంతం గుందుచున్నట్లుగా
తనరాయండు వియోగభారమునఁ జింతన్ మున్గుచున్నట్లుగా
తనకై దొడ్డ సమాధి నయ్యమున పొంతం గట్టుచున్నట్లుగా
ననుమానించుచునుండె సత్సతుల యూహల్ సత్య సామీప్యముల్,

భక్తి దైవార మానెడు వజ్రమణులు
భూతలేశ్వరుఁ డల్లాకు మ్రొక్కికొనియెఁ
గాని యిల్లాలు స్వస్థత గాంచదయ్యె
చండతరుఁడైన విధి లంచగొండి గాదు.

ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో
నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాసయాత్ర యో
ధీసముపేత! యిట్టి పరదేశుల చెల్మి తిరంబు గాదు క్ష్మా
వాసకథా విశేషములు స్వాప్నికముల్ జపలావిలాసముల్

ఈ తనువుండునంతవఱ కింతయు నెమ్మది లేదు ప్రాణి కీ
భూతలమందు గష్టసుఖముల్ జెలికత్తెయలై భజింప నా
శాతరళాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతా
ద్యూత వినోదరంగ మిది తోరపు సంపదలెల్లఁ బాచికల్,

ఆవిరియోడలో జలధియాన మొనర్చెడు బాటసారు లో
భూవర రేవులందు దిగివోయెద రించుక వెన్క ముందుగా
నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములై
పోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మ వర్తకుల్,

ఏ పుష్పంబును జేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవమో
భూపశ్రేష్ఠ! విచార మందకుము మామూలేకదా ఈ మృతి
వ్యాపారంబు సమస్త జీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
మాపుల్ రేపులు నెందఱో యిముడుచున్నారందు నేనొక్కతెన్,

సమతా చిహ్నితమైన యీ మరణ మీ సర్వంసహా వేదనా
సమర శ్రాంతుల గౌఁగిలించుకొని విశ్రాంతిన్ బ్రసాదించెడిన్
హుమయూనాదుల మీపితామహుల బోలుర్వీధవుల్ పెక్కురీ
సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్.

కలుషం బింతయులేని నీ మధుర ముగ్ధంబైన చిత్తంబు లో
పల నిద్రింతు ననారతంబు నదె యాహ్వానించుచున్నారు వే
ల్పులు నాకై చనుదెంచె మిఁచులరథంబుల్ ఱెక్కఁలల్లార్చు చున్
సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చెన్ భర్తృ వక్షస్థలిన్.

కుతలం బంతయు భస్మరాశియయి నాకుందోచె నాశాపరా
జితమై జీవిత మంధకారమునఁ  జొచ్చెన్ నీ సమావేశముల్
కతలై పోయె సహింపఁజాలని వియోగజ్వాల కావింప ను
ద్గత దుఃఖాంకితమైన యీ శిథిల కంకాళంబు నెట్లీడ్చెదన్

జీవన తారవై యమరసీమల నీవు సముజ్జ్వలింప మా
యావృతమైన విశ్వవలయంబుల శాశ్వత శోకమూర్తి నై
జీవిత మూని యీ చరమజీవిత నాటకరంగ మెక్కి వా
పోవుచునుంటి నీ విధురభూమికతోడ కిరీటధారినై.

పయనంబు సాగించు మెయిలు తిన్నెల మీఁద
కనుపింపలేదు నీ కాలి జాడ
అరవిచ్చి మురిపించి మెరుపుల తోఁటలో
మిట్టాడలేదు నీ మేని కాంతి
కొమరారు నిండుపున్నమ చందమామలో
భాసిల్ల లేదు నీ హాసలవము
సచరాచరంబైన సర్వ సర్వం సహా
వినిపింపలేదు నీ విమలవాక్కు

ఏ రహస్య సరణి యే హరిత్తుల జాడ
నీ నిలింప రథము నిర్గమించె
నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను
నెట్లు దొంగిలించె నీశ్వరుండు.

నీవు వసించుచోట వసియింతును నేనును దాచి యుంపుమో
దేవి! యొకింత నేల చను దెంచెద రేపట మాపటన్ నిరా
శావిషదహ్యమానమయి సౌఖ్య పరాజ్ముఖమైనయట్టి నా
జీవిత శేష మంకితముఁ జేసెద నీ కవివాహితుండనై.

గురుతర సత్యలోకమునకుం బయనించి సుఖించుచుంటివో
కరిగి యనంతమౌ ప్రకృతి గర్భమునందున లీనమైతివో
యెఱిఁగినవాడు లేడు హృదయేశ్వరి దుర్ఘటమైన మృత్యనం
తర విషయం బయోమయ మనన్వయ కావ్యము మానవాళికిన్

ఎల్ల జీవులకు నత్యుల్లాస మొలికించి
ప్రభవించె నీ సుప్రభాత సంధ్య
వలచు కమ్మని పరీమళము గుప్పిటఁ బట్టి
పూచె నీ సంపంగి పూలతోఁట.
నిలువుటద్దమువద్ద నిలిచి జారిన కొప్పు
సవరించె నీ వయస్యాజనంబు
తొలి నమాజుల మేలుకొలిపి లోకాధీశు
మన్నించె బెడఁగు జుమ్మా మసీదు

మదన గోర్వంక నిద్దురమత్తు వోవఁ
దనువు విదళించి యీశ్వరస్తవ మొనర్చెఁ
బ్రాతరానందమున సృష్టి పరిఢవిల్లె
నీవు మాత్రము నిద్దుర లేవ లేదు.

నివసించుటకు చిన్న నిలయ మొక్కటి దక్క
గడన సేయుట కాసపడను నేను
ఆలుబిడ్డలకునై యాస్తిపాస్తులు గూర్ప
పెడత్రోవలో పాద మిడను నేను
నే నాచరించని నీతులు బోధించి
రానిరాగము తీయలేను నేను
సంసారయాత్రకు చాలినంతకుమించి
గ్రుడ్డిగవ్వయు గోరుకొనను నేను

కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను!

https://youtu.be/1hfTjcvfzC8
సెప్టెంబర్ 28, కవితా విశారద, కళాప్రపూర్ణ గుర్రం జాషువా గారి జయంతి. ఈ సందర్భంగా జాషువా గారు రచించిన "ముంటాజమహలు" అనే కావ్యం లోని కరుణ రసాత్మకమైన, ప్రేమైక పద్యాలను విశ్రాంత తెలుగు అధ్యాపకులు, ఆంధ్ర పద్యకవితా సదస్సు నర్సీపట్నం ప్రాంతీయ కార్యదర్శి శ్రీ జెట్టి యల్లమంద గారు తన మధురమైన గొంతుకతో రాగయుక్తంగా ఆలపిస్తూ చేసిన సాహిత్యోపన్యాసమే " ముంటాజమహలు కావ్య సౌందర్యము". మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు 🙏~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్. శ్రీ జెట్టి యల్లమంద (9849860962)

1 comment:

  1. కవితా విశారద, కళాప్రపూర్ణ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా జాషువా గారు రచించిన "ముంటాజమహలు" కావ్యం లోని కొన్ని రసాత్మకమైన పద్యాలను మాఅందరికీ అందించారు ధన్యవాదములు. శ్రీ జెట్టి యల్లమంద గారు తన మధురమైన గొంతుకతో రాగయుక్తంగా ఆలపిస్తూ మాఅందరి మన్నలను మరియు హృదయాన్ని చూర గొన్నారు.

    ReplyDelete