-->

Monday, September 27, 2021

పైడి తెరేష్ బాబు "అల్పపీడనం" కవిత

పైడి తెరేష్ బాబు 

పైడి తెరేష్ బాబు  ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని గద్దల కుంటలో సుబ్బమ్మ, శాంతయ్య దంపతులకు 1963 నవంబర్ 3 న జన్మించాడు. శాంతయ్య పద్యాలు రాయడం, పాడడం చేయడంతో తెరేశ్‌బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు. మొదటిసారిగా కొత్తగూడెం లోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించి  హైదరాబాద్‌ లోని ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా సేవలందించారుపైడి తెరేష్ బాబు గారి భార్య తాహెర సుల్తానా, ప్రణయ్‌ చంద్ర, సాయి రితిక కుమారుడు , కుమార్తెలు.  
 గజల్స్‌ రాసి స్వరకల్పన జేసి పాడడం ప్రతిభావంతుడు. పైడి తెరేష్ బాబు కవిగా అల్పపీడనం, 'హిందు మహాసముద్రంనేను నా వింతల మారి ప్రపంచం వంటి ఎన్నో రచనలు చేశారు.
తనదైన శైలితో అద్భుతమైన దళిత కవిత్వాన్ని రచిస్తూ దళితుల రక్తంలో వేడిని పుట్టించిన  కవి. దళిత జీవిత చిత్రాలనెన్నింటినో తన కవిత్వంలో ప్రదర్శించిన కవి. దళితులపట్ల సమాజం ప్రదర్శించే వివక్ష,  దోపిడీ,దౌర్జన్యాలను, అసూయను కవిత్వంలో ఎండగట్టిన కవి. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 29, 2014 సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు.

 అల్పపీడనం -

మట్టి మూకూళ్లూ మడ్డి తపేళాలు ఎంత దగా చేశాయి !

పందుల గుడిసెలు బందెల దొడ్లూ ఎంతకుట్ర పన్నాయీ !


ఎముకల గూళ్ళకింత కొవ్వా !

కాలికింద చెప్పులకింత మిడిసిపాటా !

ఎంగిలి మెతుకులకీ , కాపల కుక్కలకీ

కల్లు ముంతలకీ , కావిడి బద్దలకీ , గానుగెద్దులకీ

చెమట కాలవలకీ , చింపిరి చర్మాలకీ 

కత్తులకీ, అరెలకీ , పుసికల్లకీ , ఆనెలకీ

అరెరెరెరె . . . . . . . 

" బాంచన్దొరా నీ కాల్మొక్తా" లకి ఎంత ఒళ్ళు బలిసింది !

ఎంత గడి మీరకపోతే వీళ్ళ చర్మాలు జెండాలౌతాయి

ఎంత బరితెగించకపోతే వీళ్ళ చేతులు గొంతుకలౌతాయి

దుక్కుల్లో,దున్నకాలలో గొడ్లకొష్టాల్లో గాడిద చాకిరీల్లో

వీళ్ళసత్తవలు బుగ్గి కాలేదన్నమాట

చష్టాతూములకింద,గడ్డివాములవెనుక ,నాగేటి చాళ్లమధ్య

వీళ్లమానాలు మట్టి కాలేదన్న మాట

ఎండుమాంసాలు ఏరువాక మామూళ్లు వీళ్ళనోళ్లని నొక్కలేదనమాట

న్యూనతాభావాల నిప్పుకోళ్లు వీళ్ళని పొడిచి చంపడం లేదన్నమాట

ఈ సమీకరణ లేమిటి ఈ సమూహాలేమిటి

ఈ సంబంధాలేమిటి ఈ రణన్నినాదాలేమిటి

జఠరాగ్ని బడబాగ్ని తోబుట్టువులేననీ

అసంతృప్తుల్నీ పొగేస్తే అల్పపీడనమవుతుందనీ

వాయుగుండమై వామనపాదమై

కొత్త నింగి కొత్త నేల పుట్టుకొస్తాయని నూరిపోసి

వీళ్ళకిలా విరుచుకుపడే విద్య నేర్పిందెవరసలు

ఈ మబ్బులేమిటి ? ఈ ఝుంఝుంలేమిటి ?

ఈ వార్తవరణ హెచ్చరికలు , ఈ మేనిఫెస్టోలేమిటి

ఛీ నీయవ్వ -

నోటు ముద్ద‌ర్లకీ ఓటు ముద్దర్లకీ కక్కుర్తిపడ్డాగానీ

వీళ్ళ బొటనువేళ్లను నరికినప్పుడే

చూపుడువేళ్ల చర్మం సైతం వొలవ్వలసింది గాదూ !

ఈ హోరెత్తే కెరటాలేమిటి ? ఈ పోటెత్తే సముద్రాలేమిటి ?

ఈ ఉరవడీ ఈ అలజడీ ఓరిదేవుడా ఈ అదాటు ఉప్పెనలేమిటి ?

నా ఓట్లేంగాను నా సీట్లేంగాను నా గుత్తాధిపత్యం నా విత్తాధిపత్యం

నా దాపుడు చీరలూ , నా నియోజకవర్గాలు ఏమైపోను ?

నా మడీ మగాళ్లూ , నా వడ్డీ వసూళ్లూ నా పెత్తందారీతనాలు

నా బుర్రమీసాలు కాణ్ణించి కిర్రుచెప్పులదాకా

అడ్డంగా నిలువునా అష్టదిక్కులా బలిసిన నా " అహంకారం " ఏమైపోను ?

పిచ్చితుమ్మల మధ్యనో పీతిరిగుంటల పక్కనో

నాలుగ్గుడిసెలేసుకున్నారంటే సరే

ఉంటానిక్కావాలి - ఒప్పుకుంటా

ఈ ఉద్యోగాలేమిటి ? ఈ ఊళ్ళేలడాలేమిటి ?

మళ్ళీ వీళ్ల బొడ్లు కోసి కొత్తపేర్లు పెడుతున్న దెవరర్రా

నా ఇనప సింహాసనపు నాలుగోకాలు విరగ్గొట్టేది ఎవరర్రా


చ్చొచ్చొచ్చొచ్చొచ్చొ

మట్టిమూకుళ్లూ మడ్డి తపేళాలు ఎంత దగా చేశాయి !

పందుల గుడిసెలు బందెల దొడ్లూ ఎంత కుట్రపన్నాయీ !

   ---- మహా కవి ---- పైడి తెరేష్ బాబు ---

No comments:

Post a Comment